క్రైమ్ కథ

పారిపోయే మనిషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత రెండు గంటలుగా జాక్ ఆ ఎడారి వేడిలో రైలు పట్టాల పక్కన నడుస్తున్నాడు. హై వే, దానికి కొద్ది దూరంలో ఉన్న ఏకైక భవంతి కనపడ్డాక అతను అలసటగా ఆగాడు.
ఆరిజోనా ఎడారిలో కొద్ది మైళ్ల దూరంలోని ఓ గూడ్స్ బండిలోని జంతువుల రవాణా పెట్టెలోంచి చెమట కారే అతను దిగాడు. తను ఎడారిలో ఉన్నాడని తప్ప సరిగ్గా ఎక్కడ ఉన్నాడో అతనికి తెలీదు. ఓ చిన్న కప్పుడు నీళ్లు తాగి కొన్ని గంటలు అవడంతో అతని నాలిక పిడచ కట్టుకుని పోయింది. ఆ భవంతి బహుశ పెట్రోల్ బంక్‌ది అయి ఉండచ్చు. అంటే అక్కడ నీళ్లు దొరకచ్చు.
చేతిలోని ఎయిర్‌బేగ్‌తో అతను ఆ భవంతి వైపు నడుస్తూంటే ఆకలి వేయసాగింది. వారి దగ్గర తినడానికి ఏదైనా ఉండచ్చా అనే ఆలోచన కలిగింది. అతను క్రితం రాత్రి తిన్నాడు. అంటే దాదాపు ఇరవై గంటలు దాటింది. హై వే ఉపరితలం మీద కరిగిన తారు నల్లటి ద్రవపు గాజులా కనిపిస్తోంది.
ఒకే అంతస్థుగల ఆ పాత చెక్క భవంతి ముందు చిన్న పార్కింగ్ స్పేస్, రెండు పెట్రోల్ పంపులు కనిపించాయి. ఆ భవంతికి కుడివైపు వెనకగా చిన్న షెడ్ కూడా ఉంది. ఆ భవంతి బయట ఛార్లెస్ ఒయాసిస్ అనే వెలిసిపోయిన బోర్డు అతని కళ్లబడింది. ఆ భవంతికి గల రెండు కిటికీల్లో ఓ దాంట్లో సాఫ్ట్ డ్రింక్, మరో దాంట్లో బీర్ ప్రకటనలు కనిపించాయి. భవంతి బయటగల తలుపునకు రెస్ట్ రూమ్స్ అని రాసి ఉండటం చూసి ముందుగా అందులోకి వెళ్లాడు.
అద్దంలో చూసుకున్నాడు. పెరిగిన నాలుగు రోజుల గడ్డం వల్ల తన వయసు ముప్పై ఒకటి బదులు నలభై ఏళ్లుగా అతనికి కనిపించింది. ఆ ఎడారి సూర్యుడు తన చర్మాన్ని పింక్ రంగులోకి మార్చాడని తెలుసుకున్నాడు. కరెన్ తనని ఇలా చూస్తే ఏమంటుందో అనుకున్నాడు. ఒంటి మీది తడిసిన దుస్తులని విప్పి వాష్‌బేసిన్‌కి ఉన్న పంపుని తిప్పాడు. సన్నటి ధార కింద చేతులని ఉంచి ముందు నోటిని శుభ్రంగా కడుక్కున్నాడు. ఆ నీటిలోని రసాయనం రుచి తెలిసాక తాగాలనే కోరికని బలవంతంగా ఆపుకున్నాడు. లోపల మంచినీళ్లు దొరకచ్చు.
ఎయిర్ బేగ్‌లోంచి పల్చటి సబ్బుని, టవల్‌ని తీసి మొహాన్ని, మెడని శుభ్రం చేసుకున్నాక మిగతా శరీరం మీద జంతువుల వాసన పోయేలా నీటిని పోసుకుని టవల్‌తో పొడిగా తుడుచుకుని నీలం రంగు చొక్కాని, అండర్ వేర్, డెనిమ్ పేంట్‌ని తీసి తొడుక్కున్నాడు. కొద్దిసేపు గడ్డం గీసుకోవాలా అని ఆలోచించాడు. కాని తను కరెన్‌తో డిన్నర్‌కి వెళ్లడం లలేదు. కాబట్టి ఆ అవసరం లేదు అనే ఆలోచన కలిగింది. కరెన్ గురించి ఆలోచించడం ఎప్పటికి తను మర్చిపోతాడో అనుకున్నాడు. విడిచిన బట్టలని ఎయిర్‌బేగ్‌లో ఉంచుకుని, జుట్టుని తడి చేసుకుని, దువ్వెనతో శుభ్రంగా దువ్వుకుని ఆ భవంతిలోకి నడిచాడు.
లోపల పెద్ద సీలింగ్ ఫేన్ తిరుగుతున్నా వేడిగానే ఉంది. ఓ ఎయిర్ కూలర్ ఉన్నా అది సమర్థవంతంగా పని చేయడంలేదు. ఓ పొడుగాటి కౌంటర్, అనేక కుర్చీలు, బల్లలు, బల్లల మీద ఎరుపు-తెలుపు చెక్స్ టేబిల్ క్లాత్స్ కనిపించాయి. చెక్కగోడల మీద పారలు, పలుగులు, గునపాలు అమ్మకానికి వేలాడుతున్నాయి.
కౌంటర్ వెనక తెల్లటి యూనిఫాంలోని బంగారు రంగు జుట్టుగల ఓ అమ్మాయి కనిపించింది. ఆమె బుగ్గలు గులాబి రంగులో మెరుస్తున్నాయి. అతను ఓ కుర్చీలో కూర్చుంటూ కరెన్‌లా ఆమె కళ్ల రంగు కూడా నీలం అని గ్రహించాడు. ఆమె పంపులోంచి ఓ పెద్ద గ్లాస్ నిండా నీళ్లని నింపి ఇచ్చింది. మంచులా చల్లగా ఉన్న ఆ నీళ్లని అతను మొత్తం తాగేసరికి కొన్ని అతని చొక్కా మీద పడ్డాయి. అతని దాహాన్ని గుర్తించి అడిగింది.
‘ఇంకాసిని కావాలా?’
‘కావాలి’
‘మీరు రావడం కిటికీలోంచి చూశాను. ఎండలో వచ్చిన మీరు మంచి నీల్లు అడుగుతారని అనుకున్నాను’
‘నా కారు పాడై పోయింది’ చెప్పాక తనా అబద్ధాన్ని అనాలోచితంగా చెప్పానని జాక్ గ్రహించాడు.
‘ఇక్కడ కారు మెకానిక్ లేదు’
‘్ఫర్వాలేదు. ఓ మిత్రుడు వస్తాడు’
ఇంకో అబద్ధం! ఈ అమ్మాయికి ఎందుకు తను అబద్ధాలు చెప్తున్నాడు?
‘తినడానికి ఏమైనా కావాలా?’
‘కావాలి’
‘హేంబర్గర్ ఏభై సెంట్లు. ఛీజ్ బర్గర్ అరవై సెంట్లు. గ్రిల్డ్ హేమ్...’ ఆమె ఇచ్చిన మెనూ కార్డ్‌ని చదివి, దాన్ని బల్ల మీద ఉంచి చెప్పాడు.
‘స్క్రేంబిల్డ్ ఎగ్స్ టోస్ట్’
‘తాగడానికి?’
‘కాఫీ’
ఆమె ఆ గదికి, వెనక వంటగదికి మధ్యగల గోడలోని చతురస్రపు రంధ్రం వైపు తిరిగి గట్టిగా అరిచింది.
‘నాన్నా!’
తెల్లజుట్టుగల ఓ ముసలాయన మొహం అక్కడ కనిపించగానే ఆ ఆర్డర్‌ని చెప్పింది.
బర్నర్ మీది కెటిల్ లోంచి వేడి కాఫీని ఓ కప్పులోకి పోసి తెచ్చి అతని ముందు ఉంచింది.
‘మీరీ ప్రాంతం వారు కాదు. మీ మాండలీకాన్ని బట్టి న్యూయార్క్ నించి వచ్చారని అనుకుంటున్నాను. అవునా?’
‘బోస్టన్’ జవాబు చెప్పాడు.
మూడో అబద్ధం! తన ప్రమేయం లేకుండా అబద్ధాలు దొర్లిపోతున్నాయి. గత నాలుగు నెలలుగా ఇలా తను ఎన్ని అబద్ధాలు చెప్పాడో లెక్కలేదు.
‘కేలిఫోర్నియాకి వెళ్తున్నారా?’
‘అవును. లాస్‌ఏంజెలెస్‌కి’
‘నేనోసారి ఎల్ ఏ చూశాను. చాలా పెద్ద ఊరు. మాది యుమా’
‘అది ఇక్కడికి దగ్గరలో ఉందా?’
‘నలభై మైళ్లు’
‘ఆ హైవే అక్కడికి వెళ్తుందా?’
‘అవును. తూర్పు వైపు.’
ఆమె వంట గదిలోకి వెళ్లాక అతను తన పర్స్‌ని తెరచి చూశాడు. రెండు డాలర్లు ఉన్నాయి. జిప్ లాగి నాణాలని తీసి లెక్కపెడితే డాలర్‌కన్నా ఎక్కువే ఉంది. అదే తన దగ్గర మిగిలి ఉన్న డబ్బు. తన దగ్గర డబ్బైపోయి ఉంటుందని కరెన్ ఈపాటికి ఊహించి ఉంటుంది. బహుశ అందుకు బాధ పడుతూంటుంది కూడా. తన కోసం పోలీసులు వెతుకుతున్నారా అనే ఆలోచన మళ్లీ కలిగింది. తను ఆమెకి దూరమై నాలుగు నెలలు దాటింది కాబట్టి తప్పక పోలీస్ రిపోర్ట్ ఇచ్చి ఉంటుంది. బహుశ ప్రైవేట్ డిటెక్టివ్‌లని కూడా నియమించి ఉండచ్చు. తనని తిరిగి ఇంటికి రప్పించటానికి అన్ని ప్రయత్నాలూ చేస్తుంది. ఆమె ఏం కోరితే అది సంపాదించుకుంటుంది. కాని తన విషయంలో మాత్రం ఈసారి అది కుదరదు. ఆమెతో తను జీవించిన మూడేళ్లల్లో ఆమె గురించి తను తెలుసుకుంది చాలా తక్కువ. తను పారిపోవడానికి కారణం ఇంజనీర్‌గా తను రోజుకి పది గంటలు పని చేస్తూంటే, కరెన్ ఆ డబ్బుని విలాసాలకి ఖర్చు చేయడమే. చెయ్యద్దని కోరినా తన మాట వినకపోవడంతో, తన భార్య ఎలా ప్రవర్తించాలి అన్న తన కల భగ్నం అవడం వల్లే ఆమెని వదిలి తను పారిపోతున్నాడు. తన అహాన్ని ఆమె ధ్వంసం చేసేసి తన అధీలోకి తీసుకుంది. కాని ఆమె ఆధీనంలో ఉండడానికి ఇష్టపడలేదు. ఆ విషయం మీద తమ మధ్య చాలా వాదనలు, చర్చలు జరిగాయి. కాని తామిద్దరి ప్రవర్తనలో ఎలాంటి రాజీలేదు. ఎక్కడికి పారిపోతున్నాడు? ఇంకా ఎంత కాలం?
ఆమె స్క్రేంబిల్డ్ ఎగ్స్, టోస్ట్‌లతో వచ్చింది. మొత్తం ఒకేసారి నోట్లో పెట్టుకోవాలనే, ఆకలి వల్ల కలిగిన కోరికని అణచుకుని ఫోర్క్ తీసుకుని, మధ్యమధ్యలో కాఫీ తాగుతూ మెల్లిగా తినసాగాడు. మరేం పనిలేక, ఆమె అతను తినడాన్ని నిశ్శబ్దంగా గమనిస్తూండి పోయింది.
బయట నించి కారు చప్పుడు వినిపించింది. కిటికీలోంచి బయటకి చూస్తే దుమ్ము కొట్టుకుపోయిన ముదురు ఆకుపచ్చ రంగు స్టేషన్ వేగన్ కారు పార్కింగ్ లాట్లో ఆగడం, అందులోంచి ఇద్దరు దిగడం కనిపించింది. వాళ్లు లోపలకి వచ్చి ఓ బల్ల ముందు కూర్చున్నారు.
‘ఏం వేడి! ఏం వేడి!’ ఒకతను చేతి రుమాలుతో తన మొహాన్ని తుడుచుకోబోయే ముందు చెప్పాడు.
‘కాల్చేసే ఎండ’ రెండో వ్యక్తి అంగీకారంగా చెప్పాడు.
‘మీకేం కావాలి?’ ఆమె వారి దగ్గరికి వెళ్లి అడిగింది.
‘రెండు బీర్లు. అవి చల్లగా ఉన్నాయని అనుకుంటాను?’
‘ఐస్‌లా చల్లగా ఉన్నాయి’
‘మెనూ కార్డ్‌ని కూడా తీసుకురా’
జాక్ ఎగ్స్‌ని తిని టోస్ట్ మీద జామ్‌ని రాసుకోసాగాడు. ఆమె బాటిల్ కూలర్లోంచి రెండు బీర్లని బయటకి తీసి ట్రేలో ఉంచుకుంది. ట్రేలో వాటితోపాటు మెనూ కార్డ్‌ని కూడా తీసుకెళ్లి వాళ్లకి ఇచ్చింది.
వారిలోని ఒకరు రెండు రిబ్స్‌ని ఆర్డర్ చేశాడు. ఆమె తన తండ్రికి వినపడేలా ఆ ఆర్డర్‌ని అరిచి చెప్పాక జాక్ కోరాడు.
‘ఇంకొద్దిగా కాఫీ కావాలి’
అతని గ్లాసులో మంచి నీళ్లని నింపి, కాఫీ తెచ్చిచ్చింది. దాన్ని తాగుతూ అతను బయట హై వే వంక చూస్తూ తనకి లిఫ్ట్ దొరుకుతుందా అనుకున్నాడు. హైవేలో ఒక్క కారు కూడా కనపడలేదు.
‘మీరు కేలిఫోర్నియాకి వెళ్తున్నారా?’ ఆమె వారు అడిగిన మరో రెండు బీర్ సీసాలని తీసుకెళ్లి ఇస్తూ అడిగింది.
‘ఫ్రేంక్! మనం కేలిఫోర్నియాకి వెళ్తున్నామా?’ వారిలోని ఒకరు అడిగాడు.
‘లేదు’ ఫ్రేంక్ నవ్వి చెప్పాడు.
‘మీరు సేల్స్‌మెన్నా?’
‘అలా కనిపిస్తున్నామా?’
‘ఇక్కడికి చాలామంది సేల్స్‌మెన్ వస్తూంటారు’
‘మేం సేల్స్‌మెన్ కాదు’ ఫ్రేంక్ చెప్పాడు.
‘మేము వేటగాళ్లం’ మొదటివాడు చెప్పాడు.
‘ఐతే మీరు నెవేడాకి వెళ్తున్నారన్నమాట. అక్కడ వేటాడడానికి అవకాశాలు ఎక్కువ అని విన్నాను’
‘లేదు. మేం నెవేడాకి వెళ్లడంలేదు. చక్కటి వేట ఇక్కడే ఉంది’ ఫ్రేంక్ నవ్వి చెప్పాడు.
‘ఇక్కడ కుందేళ్లు తప్ప వేటాడటానికి ఇంకేం లేవు’ ఆమె చెప్పింది.
‘రిబ్స్ సిద్ధం’ ఆమె తండ్రి గట్టిగా చెప్పాడు.
జాక్ చేతి గడియారం వంక చూసుకున్నాడు. సాయంత్రం ఐదు అవుతోంది. వెంటనే వెళ్తే చీకటి పడకుండా తను సమీపంలోని ఊరుకి లిఫ్ట్ సంపాదించచ్చు. లేదా యుమాకి వెళ్లచ్చు. తను రాత్రి పడుకోటానికి ఓ గది, ఉదయం ఓ ఉద్యోగం సంపాదించాలి. కొత్త ఊళ్లో గినె్నలు తోమడం తప్ప ఇంకో పని దొరక్కపోవచ్చు. గత నాలుగు నెలల్లో చాలాసార్లు తను ఆ పని చేశాడు.
ఆ అమ్మాయి ఇచ్చిన బిల్ వంక చూశాడు. ఏభై ఏడు సెంట్లు. నాణాలతో దాన్ని చెల్లించి తన ఎయిర్‌బేగ్‌ని అందుకుని లేస్తూ ఆ ఇద్దరి వంకా చూశాడు. వాళ్లని లిఫ్ట్ అడుగుదామని అనుకున్నాడు కాని వాళ్లు వేటగాళ్లని వినడంతో బహుశ వాళ్లు అందుకోసం పర్వతాల్లోకి వెళ్తూండచ్చు అనుకున్నాడు. హైవేలో లిఫ్ట్ దొరకచ్చు అనుకుని తలుపు వైపు నడిచాడు.
‘ఎక్కడికి అంత వేగంగా?’ ఆ ఇద్దరిలోని ఒకరు అడిగారు.
‘వెళ్లాలి’
‘కూర్చుని ఇంకో కప్పు కాఫీ తాగి వెళ్లచ్చుగా?’
‘ఇంక అక్కర్లేదు’
‘తాగడం మంచిది’ ఫ్రేంక్ అధికారికంగా చెప్పాడు.
అతను తాగి ఉన్నాడు అని జాక్ అనుకున్నాడు. వాళ్లని లిఫ్ట్ అడగనందుకు సంతోషిస్తూ తలుపు వైపు నడిచాడు. తక్షణం వాళ్లిద్దరూ లేచి నిలబడ్డారు. ఇద్దరి చేతుల్లోని రివాల్వర్లు తనకి గురి పెట్టి ఉండటం గమనించాడు.
‘ఏమిటిది? ఎందుకు?’
‘కూర్చో’ ఫ్రేంక్ రివాల్వర్‌ని ఆడిస్తూ కఠినంగా చెప్పాడు.
‘ఏమిటీ జోక్?’
‘జోక్ కాదు. ముందు కూర్చో’
జాక్ నిస్సహాయంగా చూస్తూ కుర్చీలో కూలబడ్డాడు. అది నిజం రివాల్వర్లేనా? వాళ్ల ఉద్దేశం ఏమిటి?
‘ఓ ముసలాయనా! బయటకి రా’ ఒకరు అరిచారు.
ఆయన వారి చేతుల్లోని ఆయుధాల వంక భయంగా చూస్తూ అక్కడికి వచ్చాడు.
‘లోపల ఇంకెవరైనా ఉన్నారా? అంట్లు తోమేవాడు, వంట వాడు లేదా పెట్రోల్ కొట్టేవాడు కాని?’
‘లేరు’
‘సరే. మీ ఇద్దరూ వచ్చి మీ మిత్రుడి పక్కన కూర్చోండి’
కూర్చున్నాక ముసలాయన అడిగాడు.
‘మీరు దొంగలా?’
‘మనం దొంగలమా ఫ్రేంక్?’ మొదటివాడు నవ్వుతూ అడిగాడు.
‘ఏమో మరి?’
‘మా దగ్గర ఇరవై డాలర్లు మించి లేవు’ ముసలాయన చెప్పాడు.
‘నీ డబ్బు కోసం మేం రాలేదు’
‘మరి?’
‘మీకేం కాకూడదు అనుకుంటే నిశ్శబ్దంగా ఉండండి’
జాక్ పక్కనే కూర్చుని ఆమె భయంగా ఏడవసాగింది. జాక్ ఓదార్పుగా ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి వాళ్లని కోపంగా అడిగాడు.
‘ఎవరు మీరు? ఎందుకిలా బెదిరిస్తున్నారు?’
‘మాకు బెదిరించడం ఇష్టం. నువ్వు నోరు మూసుకోకపోతే రివాల్వర్ పేలుతుంది’ ఫ్రేంక్ హెచ్చరించాడు.
‘మీకు ఇక్కడ ఏం కావాలి?’ ముసలాయన అడిగాడు.
‘ఎర్ల్! ఆయన తెలుసుకోవాలిట. చెప్పు’
‘మేం ఓ మనిషిని చంపడానికి ఇక్కడికి వచ్చాం’ ఎర్ల్ చెప్పాడు.
‘ఏమిటి?’ జాక్ తుళ్లిపడుతూ అడిగాడు.
‘మీకు పిచ్చెక్కిందా?’ ముసలాయన అరిచాడు.
‘నోరు మూసుకో ఎర్ల్’ ఫ్రేంక్ అరిచాడు.
వెంటనే ఆమె ఏడుపు పెద్దదైంది.
‘తనని మెక్సికోకి తీసుకెళ్లడానికి కారు కనపడకపోవడంతో అతను అనుమానిస్తాడా?’ఫ్రేంక్ అడిగాడు.
ఎర్ల్ మాట్లాడలేదు.
‘మీరు అతన్ని ఎందుకు చంపాలని అనుకుంటున్నారు?’ ముసలాయన అడిగాడు.
‘చేయకూడని ఓ పని చేశాడు కాబట్టి’
ఆ గదిలో ఫేన్ తిరిగే శబ్దం, ఆ పిల్ల ఏడుపూ తప్ప ఇంకే శబ్దాలూ లేవు. బాగా వేడిగా ఉండటంతో జాక్‌కి బాగా చెమట పట్టి, నాలిక మళ్లీ ఎండిపోయింది. ఎర్ల్ రిబ్స్‌ని తింటూంటే ఫ్రేంక్ వాళ్లని రివాల్వర్‌తో అప్రమత్తంగా చూడసాగాడు.
అతన్ని చంపాక వాళ్లు సాక్షులైన తమని బతకనివ్వరు. ఆ ఆలోచన రాగానే జాక్‌లో మొదటిసారి భయం కలిగింది. ఎర్ల్ తినడం పూర్తయ్యాక ఫ్రేంక్ లేచి స్టోర్ రూం దగ్గరికి వెళ్లి తొంగి చూసి చెప్పాడు.
‘ఎర్ల్! నువ్వు ఈ గదిలో కిటికీలోంచి గూడ్సు బండి కోసం చూడు’
ఎర్ల్ మిగిలిన బీర్‌ని తాగి స్టోర్‌రూంలోకి వెళ్లి వాళ్లు కనపడేలా తలుపు తెరిచే ఉంచి కిటికీలోంచి ఎడారిలోకి చూడసాగాడు. ఆమె ఏడుపు తగ్గడంతో పది నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాయి. మరో ఐదు నిమిషాలు గడిచాక రైలు చప్పుడు వినిపించింది. ఎర్ల్ అరుపు లోపల నించి ఉత్సాహంగా వినిపించింది.
‘రైలు వస్తోంది’
జాక్ కిటికీలోంచి ఆ రైలుని చూశాడు.
‘కనిపించాడా?’ ఫ్రేంక్ గట్టిగా అరిచాడు.
‘ఇంకా లేదు’
గూడ్స్ బండి వెళ్లిపోయింది.
‘అడుగో. అవతలి వైపు దూకాడు’ ఎర్ల్ అరిచాడు.
బట్టలు దులుపుకుంటూ పట్టాలు దాటి ఆ భవంతి వైపు పరిగెత్తుకుంటూ వచ్చే అతన్ని జాక్ చూశాడు. ఎర్ల్ తిరిగి ఆ గదిలోకి వచ్చాడు.
‘అతనికి పార్కింగ్‌లో కారు కనపడకపోతే ఎండలో నిలబడలేక లోపలకి వస్తాడు. మీరు వెళ్లి ఆ కౌంటర్ వెనక నిలబడండి. మా గుళ్లు మీకు తాకడం మాకు ఇష్టం లేదు’ ఫ్రేంక్ చెప్పాడు.
ముసలాయన తక్షణం కౌంటర్ వెనక్కి నడిచాడు. ఆయన్ని జాక్, ఆ అమ్మాయి అనుసరించారు. జాక్‌కి జరగబోయేది అర్థమైంది. ఓ మనిషిని చంపుతూంటే అతన్ని కాపాడకుండా తాము చూస్తూ నిలబడాలి!
‘కళ్లు మూసుకో. చూడలేవు’ జాక్ తన చేతిని భయంగా పట్టుకున్న ఆమెతో చెప్పాడు.
‘నిశ్శబ్దం’ ఫ్రేంక్ కోపంగా అరిచాడు.
జాక్ ముసలాయన వంక చూశాడు. బర్నర్‌కి దగ్గరగా నిలబడ్డ ఆయన చెయ్యి కాఫీ కెటిల్ పిడికి దగ్గరగా ఉండటంతో ఆయన పథకం చూచాయగా అర్థమైంది. కాని ఇద్దరు ఉన్నారు. ఎర్ల్ చాలా దూరంగా అవతల కిటికీ దగ్గర ఉన్నాడు. ముసలాయన జాక్ వంక చూసి కళ్లతో కేష్ బాక్స్ వైపు సైగ చేశాడు. దాని కింద ఓపెన్ షెల్ఫ్‌లో సిగరెట్ పెట్టెలు కనిపించాయి. నెమ్మదిగా చేతిని పోనించి తడిమాడు. చేతికి రివాల్వర్ బేరల్ అంచు తగిలింది. తన గుండె కొట్టుకునే చప్పుడు జాక్‌కి వినిపిస్తోంది. చూపుని ఫ్రేంక్ వైపు ఉంచి వేళ్లతో దాన్ని అందుకున్నాడు. ముసలాయన కళ్లు ప్రతిఘటించమన్నట్లుగా సూచిస్తున్నాయి.
జాక్ యుద్ధంలో ఉండగా తుపాకీని పేల్చాడు. డిశ్చార్జ్ అయ్యాక మళ్లీ దాన్ని ముట్టలేదు. యుద్ధంలో ఎవర్నీ చంపలేదు కాని ఈ రోజు చంపాల్సి వస్తోంది అనుకున్నాడు. దాన్ని కౌంటర్ కింద ఉన్న కుడి చేతిలో తయారుగా పట్టుకున్నాడు. ఎర్ల్‌కి గుండు తగలగానే నాలుగు అడుగులు వేగంగా వెనక్కి వేసి, గోడకి గుద్దుకుని, దానికి అనుకునే నేల మీదకి జారాడు. సరిగ్గా ఆ సమయంలో ముసలాయన కెటిల్ మూత తెరిచి వేడి కాఫీని సమీపంలోని ఫ్రేంక్ మొహం మీదకి బలంగా చల్లాడు. అతను కెవ్వున అరుస్తూ రెండు చేతులతో మొహాన్ని కప్పుకున్నాడు. చేతిలోని రివాల్వర్ జారిపోయింది. ఆమె ఏడుపు పెరిగింది.
రివాల్వర్ పేలిన శబ్దం వినగానే బయటి వ్యక్తి వంగొని ఆ భవంతి వెనక వైపు పరిగెత్తాడు.
‘ఓ మైగాడ్! నేనో మనిషిని చంపాను’ జాక్ చెప్తూంటే అతని చేతులు వణకసాగాయి.
ముసలాయన అతని చేతిలోని రివాల్వర్‌ని తీసుకుని కదులుతున్న ఎర్ల్ వైపు మరోసారి కాల్చాడు.
‘డాక్టర్‌కి ఫోన్ చేసి వెంటనే పిలిపించండి. నా మొహం మండిపోతోంది’ ఫ్రేంక్ అరిచాడు.
ముసలాయన ఫ్రెంక్ దగ్గరికి పరిగెత్తి కిందపడ్డ అతని రివాల్వర్‌ని అందుకుని చెప్పాడు.
‘మేండీ! పోలీసులకి ఫోన్ చెయ్యి’
ఆమె వణికే చేతులతో రిసీవర్ని తీసుకుని డయల్ చేసి చెప్పింది. పారిపోయే మనిషిని కిటికీలోంచి చూసిన ముసలాయన గట్టిగా అరిచాడు.
‘ఆగు. రా. నీకేం కాదు’
కాని అతను ఆగకుండా హైవే వైపు పరిగెత్తాడు.
‘అతను దేన్నించో పారిపోతున్నాడు. పోలీసులు వచ్చేలోగా దూరంగా వెళ్లాలనుకుంటున్నాను’ జాక్ చెప్పాడు.
తనే ఆ పారిపోయే మనిషి అనే ఆలోచన కలిగింది. తను, అతనూ చేసే పని ఒకటే. గతంలోని దేనికో తామిద్దరికీ భయం ఉంది. భవిష్యత్‌లో దేని మీదో అతనికి భయం ఉంది. కాని అది తనకి లేదు. తామిద్దరిలో తను అదృష్టవంతుడు. అవును. తను పారిపోనక్కర్లేదు. తను పారిపోయి కరెన్‌ని బాధిస్తున్నాడు అనుకున్నాడు. కాని నిజానకి ఈ నాలుగు నెలలూ బాధపడింది తనే. ఆ ఆలోచనతో జాక్ మనసులోని ఏదో పెద్ద బరువు తీసేసినట్లుగా అనిపించింది. చాలాకాలంగా ఎరగని శాంతి అతనికి కలిగింది. ఇక్కడ జరిగింది చూశాక తన గురించి తనకి గత ముప్పై ఒక్క ఏళ్లకన్నా ఎక్కువ తెలిసిందని అనిపించింది.
కదలకుండా పడి ఉన్న ఎర్ల్‌ని, మొహం కాలిన ఫ్రేంక్‌ని చూశాడు. ఆమె అతని దగ్గరికి వచ్చి మృదువుగా అతని చేతులని తాకింది. ముసలాయన చెప్పాడు.
‘్థంక్స్ సన్’
జాక్ మెల్లిగా తల ఊపాడు. ఇరవై నిమిషాల తర్వాత ఇద్దరు డెప్యూటీలు, ఓ అంబులెన్స్‌తో షెరీఫ్ వచ్చాడు. ఆ ఇద్దర్నీ అంబులెన్స్‌లోకి ఎక్కించారు. షెరీఫ్ అడగాల్సిన ప్రశ్నలు అన్నిటినీ అడిగి తర్వాత బయటకి వెళ్లిపోయాడు.
జాక్ తన ఎయిర్‌బేగ్‌ని అందుకుని ముసలాయనతో కరచాలనం చేసి, ఆ పదహారేళ్ల పిల్ల నుదుటి మీద తండ్రి తన కూతుర్ని ముద్దు పెట్టుకున్నట్లుగా చుంబించి బయటకి వెళ్లాడు.
‘నాకు లిఫ్ట్ ఇస్తారా?’ కార్ స్టార్ట్‌చేసే షెరీఫ్‌ని అడిగాడు.
‘ఎక్కడికి వెళ్లాలి?’ షెరీఫ్ అడిగాడు.
‘ఇంటికి. నేను ఇంటికి వెళ్తున్నాను’ జాక్ చెప్పాడు.
‘ఇంటికా?’
‘అవును. ఎందుకంటే ఇక నాకు ఇంటి నించి పారిపోయే అవసరం లేదు’
ఆ మాటలు అర్థం కాని షెరీఫ్ కూర్చోమన్నట్లుగా సైగ చేశాడు. కదిలే కారు వంక చూస్తూ మేండీ చేతిని ఊపసాగింది.
**
బిల్ ప్రాంజినీ కథకి స్వేచ్ఛానువాదం

మల్లాది వెంకట కృష్ణమూర్తి