క్రైమ్ కథ

ఆమె ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను ఎన్నడూ చూడకూడదని ఆశించిన దృశ్యం అది. మా ఇంటి తలుపు బార్లా తీసి ఉంది. బయట బెకీ నిలబడి ఉంది. మా కారు చూడగానే ఆమె బయటకి పరిగెత్తుకు వచ్చింది.
ఇంట్లో ఏదైనా అపాయం సంభవించిందని నేను అనుమానించలేదు. అలాంటిది ఏదైనా జరిగి ఉంటే బెకీ నా మొబైల్‌కి ఫోన్ చేసి ఉండేది. కాని సినిమా హాల్లోంచి బయటకి వచ్చాక మళ్లీ దాన్ని నేను స్విచాన్ చేయలేదని గుర్తొచ్చింది. టిమోథీ హేండ్ బ్రేక్ వేయగానే నేను కారు దిగి అడిగాను.
‘అలెక్స్ కులాసానా?’
‘నిద్రపోతున్నాడు. బానే ఉన్నాడు’
‘మంచిది. మరి ఇక్కడ నిలబడ్డావేం? ఇంకేం జరిగింది?’ బేబీ సిట్టర్ బెకీని ప్రశ్నించాను.
‘ఏదో చెప్పలేను. కాని మీరు చూడాల్సింది ఒకటి ఉంది’ చెప్తూంటే బెకీ మొహంలో ఆందోళన కనిపించింది.
పైకి వెళ్లి నిద్రపోయే అలెక్స్‌ని చూడాలని అనిపించినా బెకీ చెప్పేది ముఖ్యమైంది అనుకుని ఆగాను.
మా ఫొటో ఆల్బమ్స్ అన్నీ హాల్లోని కార్పెట్ మీద పరిచి కనిపించాయి. కొన్ని తెరిచీ, కొన్ని మూసీ ఉన్నాయి. బెకీ ఇంట్లో వేటినీ అలా చిందర వందరగా ఉంచదు. కాబట్టి ఫొటోలకి చెందిన సమస్య అయి ఉండచ్చని నాకు అనిపించింది.
ఆమె చక్కటి బేబీ సిట్టర్. మేమిద్దరం అలెక్స్‌ని వెంట తీసుకెళ్లకుండా బయటకి వెళ్లినప్పుడల్లా అలెక్స్‌ని చూసుకోడానికి బెకీని ఉంచి వెళ్తూంటాను. ఇంట్లోని ఏమైనా పోవడం లాంటివి, ఫ్రిజ్‌లో పదార్థాలు మాయం అవడం లాంటివి ఎన్నడూ జరగలేదు. వెళ్లే ముందు బెకీకి కాలక్షేపంగా మా తాజా ఆల్బంని ఇచ్చాను.
‘ఇది చూడండి’ బాసింపట్టు వేసుకుని కూర్చుని బెకీ నాకో ఫొటోని చూపించింది.
నేను ఆమె పక్కన కుర్చీలో కూర్చుని ఆ ఫొటోని చూశాను. అది అలెక్స్, నేను కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేసే ఫొటో. సైప్రస్ నగరంలోని హోటల్ టెర్రేస్‌లో తీసిందిగా గుర్తించాను. బ్రెడ్ నించి రాలిన తునకలు కూడా నీలం రంగు టేబిల్ క్లాత్ మీద ఆ ఫొటోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. టిమోథీ తీసిన ఆ ఫొటోలో మేం ఇద్దరం నవ్వుతూ కెమెరా వంక చూస్తున్నాం.
‘ఇందులో ఏమిటి?’ అడిగాను.
‘మీ టేబిల్ వెనక కూర్చున్న బంగారు రంగు జుట్టు అమ్మాయిని చూశారా?’ బెకీ అడిగింది.
నేను చూశాను. ఆమె మొహం ప్రొఫైల్‌లో కనిపిస్తోంది. ఆమె జుట్టు పోనీ టైల్‌గా కట్టి ఉంది. సముద్రపు నీలం రంగు షర్ట్ వేసుకుని ఉంది. ఆమె చేతిలో పైకి లేపిన తెల్లటి కప్పు ఆమె ముందున్న బల్ల, నోటి మధ్య ఉంది.
‘ఈమె మీకు తెలుసా?’ బెకీ నన్ను, టిమోథీని చూస్తూ సీరియస్‌గా అడిగింది.
‘తెలీదు. ఏం?’ అడిగాను.
‘తెలీదు’ టిమోథీ కూడా చెప్పాడు.
ఆమె ఆల్బం పేజీని తిప్పి ఇంకో ఫొటోని చూపిస్తూ చెప్పింది.
‘దీన్ని చూడండి’
అందులో టిమోథీ స్విమ్మింగ్ పూల్ పక్కన లాంజ్ ఛెయిర్‌లో కూర్చుని ‘యులిసిన్’ నవలని చదువుతున్నాడు. నాకు ఆనాటి మా సంభాషణ గుర్తుకు వచ్చింది. ‘సెలవులు గడిపే అందరిలా మీరూ జాన్ గ్రిషమ్ నవలని చదవచ్చుగా?’ అని అడిగాను. ఐతే నవలా ప్రియుడైన మా వారు అప్పటికే అవన్నీ చదివేశారు.
ఆ ఫొటోలో బెకీ వేలితో ఆ బంగారు రంగు జుట్టు అమ్మాయిని చూపించింది. ఆమె స్విమ్మింగ్ పూల్ పక్కన తన చేతులని వెనక్కి ఉంచుకుని నిలబడి ఉంది. ఒన్ పీస్ స్వీమ్ సూట్‌లోని ఆమె నీళ్లల్లోకి దిగబోయే ముందు తన పోనీ టైల్‌ని సవరించుకుంటోందని గ్రహించాను.
మళ్లీ ఆమే!
‘మీరు ఆమెతో మాట్లాడారా? మీకు తెలుసా?’ బెకీ అడిగింది.
‘లేదు. తెలీదు’ చెప్పాను.
‘అసలు నేను ఆమెని గమనించనే లేదు’ టిమోథీ చెప్పాడు.
‘ఇదంతా ఏమిటి బెకీ? ఆమె మా హోటల్‌లోని ఇంకో అతిథి మాత్రమే’ చెప్పాను.
బెకీ చిన్నగా నిట్టూర్చింది. బెకీ ఏదో భయంకరమైంది కనిపెట్టిందని స్ఫురించగానే నాలో స్వల్పంగా భయం మొదలైంది.
‘ఐతే ఆమె మీకు పరిచయం లేనే లేదా?’ బెకీ అడిగింది.
‘లేదు’ టిమోథీ జవాబు చెప్పాడు.
బెకీ మా సైప్రస్ ట్రిప్ ఆల్బంని మూసేసి ఇంకో ఆల్బం తెరిచింది. అది అలెక్స్ పుట్టక మునుపుది. కొన్ని పేజీలు తిప్పి ఓ ఫొటోని చూపించింది. అది మేము కేంబ్రిడ్జికి వెళ్లినప్పుడు తీసిన ఫొటోగా గుర్తించాను. కింగ్ కాలేజ్ బయట నేను, టిమోథీ, నా అన్న రిచర్డ్ ఓ గోడ మీద కూర్చుని తీయించుకున్న ఫొటో అది.
‘ఆమె మీ పక్కన కూర్చుంది’ బెకీ చెప్పింది.
నేను ఆమె బంగారు రంగు జుట్టు గల తల వంక చూశాను. బెకీ పొరబడి ఉండచ్చు అనుకున్నాను. ఎందుకంటే ఆమె తల ఆమె మిత్రుడి వైపు దిగి ఉంది. వాళ్లిద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నట్లుగా ఉందామె మొహం. వారి లోకంలో వారు ఉన్నట్లుగా కనిపించారు.
‘జుట్టు తప్ప ఆమె మొహం స్పష్టంగా లేదు’ చెప్పాను.
‘చెవి రింగులని చూడండి’
సైప్రస్‌లోని ఫొటోలో కూడా అవే రింగులు. ఆ చదరపు రింగులు అంతా ధరించే సామాన్యమైనవి కావు.
‘ఇది కాకతాళీయం అయి ఉండచ్చు. ఈ ఇద్దరూ వేరు వేరు మనుషులై ఉంటారు’ చెప్పాను.
‘లేదా బెకీ చెప్పినట్లుగా ఒకరే అయి ఉండచ్చు. బహుశ కేంబ్రిడ్జ్‌లో, సైప్రస్‌లో మనం ఉన్న సమయంలోనే ఆమె కూడా కాకతాళీయంగా ఉండి ఉంటుందని అనుకోవచ్చుగా? కాని ఈ ఇద్దరూ వేరనే నా నమ్మకం కూడా’ టిమోథీ చెప్పాడు.
బెకీ తల అడ్డంగా ఊపి చెప్పింది.
‘ఒకరే. నేను సైప్రస్‌లోని ఫొటోల్లోని ఆమెని చూడగానే ఇదివరకు ఎక్కడో చూసిన ఆమె అని అనిపించింది. తర్వాత గుర్తొచ్చింది. నేను డివిడి కోసం వెదుకుతూంటే, ఫొటో ఫ్రేంలోని ఫొటోలో ఈమె ఉంది’
మా ఇద్దరి కళ్లూ డివిడి షెల్ఫ్ వైపు మళ్లాయి. అక్కడ ఫ్రేంలోని ఫొటోలో నేనూ, టిమోథీ ఉన్నాం. ఓ అపరిచితుడు తీసిన ఫొటో అది. ఎడింబరో లోని ఓ పెద్ద భవంతి ముందు గల విశాలమైన ప్రదేశంలో తీసిన ఫొటో అది. అక్కడ బుక్ ఫెస్టివల్ జరుగుతోంది. ఏటా వారం పాటు జరిగే దానికి మేం వెళ్తుంటాం. మా వెనక ఓ హోటల్ డైనింగ్ రూం కిటికీలు రెండు కనిపిస్తున్నాయి. వాటిలో స్పష్టంగా కనిపించే ఓ వ్యక్తి సైప్రస్ ఫొటోలోని యువతిగా గుర్తు పట్టాను.
ఆమె సముద్రపు నీలం రంగు షర్ట్ ధరించి ఉంది. మళ్లీ చదరపు బంగారు చెవి పోగులు. మా ఫొటోల్లోకి ఆమె ఎలా వస్తోందో నాకు అర్థం కాలేదు. దీని వెనక ఏదో ఉంది అనుకోగానే నాకు స్వల్పంగా భయం వేసింది.
‘ఈ ఫొటోని నేను మీ ఇంట్లో వేల సార్లు చూశాను కాబట్టి ఆమె మిగిలిన అన్ని ఫొటోల్లో తేలిగ్గా గుర్తు పట్టగలిగాను. దాదాపు మీ అన్ని ఫొటోల్లోను ఆమె ఉంది. కావాలంటే చూడండి’
నేను బెకీ అందించిన ఆల్బమ్‌లని తెరచి చూశాక ఆమె చెప్పేది నిజం అని గ్రహించాను. ఆ అంతుపట్టని వ్యక్తి సియోల్‌లోని ఓ టేవరిన్‌లో, మొరాకోలోని ఓ మార్కెట్లో నా వెనక నడుస్తూ, లిస్బన్‌లోని ఓ నాటక శాలలో...
‘జీసస్; ఎంతటి కాకతాళీయం!’ టిమోథీ ఆశ్చర్యంగా చెప్పాడు.
‘కాని ఇది ఎంత మాత్రం కాకతాళీయం కాదు అని నాకు అనిపిస్తోంది’ చెప్పాను.
మిగిలిన ఇద్దరూ నాతో ఏకీభవించారు. అన్ని ఫొటోలూ చూశాక నాలో భయం అధికమైంది.
‘దీని అర్థం ఏమిటి?’ టిమోథీ బెకీని అడిగాడు.
అతను ఎవర్నైనా అలా అడగడం అరుదు. ముఖ్యంగా తన వయసులో సగం ఉన్న బేబీ సిట్టర్ని.
‘ఆమె మిమ్మల్ని అనుసరిస్తోంది’
‘గత పదేళ్లుగా?’
‘అవును. అందుకు ఫొటోలే రుజువు కదా?’ బెకీ ప్రశ్నించింది.
‘నాకు ఇది నచ్చలేదు. పోలీసులకి ఫిర్యాదు చేస్తాను’ టిమోథీ కోపంగా చెప్పాడు.
‘మీరు పిచ్చి వాళ్లని వాళ్లు భావిస్తారు’ అడ్డుపడ్డాను.
‘అంటే?’
‘ఆమె ఇంత దాకా మనకి ఎలాంటి హానీ చేయలేదు. మనల్ని ఎప్పుడూ పలకరించలేదు కూడా. ఏ ఫొటోలో అయినా ఆమె అసలు మన వంకే చూడటం లేదు. మనం ఆమె సమీపంలో ఉన్నామనే ఎరుకే ఆమెలో కనపడటం లేదు’ చెప్పాను.
‘అది నిజమే. కెమెరా కనపడగానే ఆమె అమాయకురాల్లా నటించి ఉండచ్చు. ఆమె మనల్ని వెంటాడుతోంది’ టిమోథీ చెప్పాడు.
నేను బెకీ వైపు తిరిగి అడిగాను.
‘మిగిలిన ఆల్బమ్‌లలోని ఫొటోల్లో కూడా ఆమె ఉందన్న మాట?’
వాటిని చూసే ధైర్యం నాకు లేకపోయింది.
‘దాదాపు అన్ని ఫొటోల్లో ఉంది’ బెకీ తల ఊపి చెప్పింది.
‘మైగాడ్! ఇప్పుడు మేము ఏం చేయాలి? ఆమె మమ్మల్ని ఎందుకు వెంటాడుతున్నట్లు?’ అడిగాను.
టిమోథీ చెప్పింది సబబైంది అనిపిస్తోంది. ఏదైనా జరక్క మునుపే మీరు పోలీసులకి ఫిర్యాదు చేయాలి’ బెకీ సూచించింది.
బెకీ వెళ్లాక నేను టిమోథీ వంక సీరియస్‌గా చూస్తూ చెప్పాను.
‘అలా కూర్చోండి’
‘ఏమిటి?’ కూర్చుంటూ అడిగాడు.
‘ఆమెతో మీకు పరిచయం ఉందా?’
‘అంటే?’ అదిరిపడ్డాడు.
‘శారీరక సంబంధం. ఆమె మీ ప్రియురాలు కదా?’ అడిగాను.
‘నీ తోడు. లేదు’
‘లేదా మీ మాజీ గర్ల్‌ఫ్రెండా? ఆమె మనల్ని వెంటాడడానికి అదే కారణమై ఉంటుంది’
‘కాదు. నా మాజీ గర్ల్‌ఫ్రెండ్ కానే కాదు’ టిమోథీ కోపంగా చెప్పాడు.
‘అది నిజమైతే మీరు ఇప్పుడు ఒప్పుకుని తీరాలి’ అరిచాను.
‘నేను ఎప్పుడైనా అలాంటిది ఏదైనా చేసానా?’ బాధగా అడిగాడు.
‘నాకు తెలిసి లేదనుకోండి. కాని...’ అర్ధోక్తిగా ఆపేశాను.
‘అలెక్స్ మీద ఒట్టు. నాకు ఈమెతో శారీరక సంబంధం లేకపోవడమే కాక అసలు ఎన్నడూ ఈమెతో నేను మాట్లాడనే లేదు’
ఆ ఒట్టు వల్ల టిమోథీ చెప్పేది నిజమని నమ్మాను. మా ఇద్దరికీ అలెక్స్ అంటే ప్రాణం. మా ఫొటోల్లో ఉన్న ఆ ఆడదంటే నాకు భయం వేయసాగింది.
‘నేను గాలికి అలా బయటకి వెళ్లొస్తాను’ చెప్పి టిమోథీ బయటకి వెళ్లాడు.
అలెక్స్ పుట్టాక ఆయన ఇంట్లో సిగరెట్ తాగడం మానేశారు. నేను పైకెళ్లి అలెక్స్‌ని చూశాను. గాఢ నిద్రలో ఉన్నాడు. నేను వాడి నుదుటి మీద ముద్దు పెట్టుకుని కిందకి వచ్చి, గుండె దిటవు చేసుకుని ఒకో ఫొటోని నిశితంగా చూడసాగాను. ఆ చదరపు రింగుల నీలపు షర్ట్‌లోని ఆమె దాదాపు అన్ని ఫొటోల్లో ఆ షర్ట్‌తోనే కనిపించింది. పెద్ద పడవ మీద. పార్క్‌లో. కాలువ ఒడ్డున నడిచే మార్గంలో. ఒకోసారి మా వెనకే. ఒకోసారి దూరంగా ఎక్కడో ఉంది. ఆమె ఎవరు? మమ్మల్ని ఎందుకు అనుసరిస్తున్నట్లు? ఆ ప్రశ్నలకి జవాబు నాకు తెలీలేదు.
పోలీసులు తెలుసుకోగలరా? అనే అనుమానం నాకు కలిగింది. అవసరం అనుకుంటే వారు ఆమెని కనుక్కోగలరు. మేము బస చేసిన హోటల్స్‌లో అతిథుల జాబితాలో ఆమె పేరు, వివరాలు తప్పక ఉంటాయి. కాని నేరం ఏదీ జరగకుండా వారా పరిశోధనని చేయరు. ఎవరి వెంటైనా పడటం చట్టవిరుద్ధం. కాని తాము వెంటాడే వారిని వారు బాధించారనే రుజువు అవసరం. అందుకు ఈ ఫొటోల్లో ఎక్కడా అలాంటి రుజువు లేదు.
బెకీ భూతద్దం కళ్లు ఆమెని గుర్తించకపోతే, మేము ఇద్దరం ఎన్నడూ ఆమెని గుర్తించలేక పోయేవాళ్లం అన్నది నిశ్చయం. ఆమె మనిషి కాక దెయ్యం అని నాకు అనిపించింది. ఆమె కనపడచ్చు అనిపించడంతో, వెంటనే నా కళ్ల చుట్టూ నేల నించి సీలింగ్ దాకా చూసాయి. కాని కనపడలేదు. నేను ఆమె మొహం గుర్తుంచుకోడానికి ఆమె వంక చాలాసేపు చూస్తూండిపోయాను. కాని సాధారణంగా ఉన్న ఆ మొహం గుర్తుంచుకోడానికి కష్టమైన మొహం అనిపించింది.
ఓ ఫొటోలో ఆమె నన్ను తాకుతూ కనిపించింది. అది రద్దీగా ఉన్న వైన్‌బార్. ఆమె భుజం నా భుజాన్ని తాకుతోంది. ఏం బార్ అది? ఛెలైన్‌హేంలోనా అది? నా చేతిలో పొడుగు కాక్‌టైల్ గ్లాస్ ఉంది. నేనా గ్లాస్ వంక ఎవరికో వేలితో చూపిస్తున్నాను. ఆమె చేతిలో ఓ పుస్తకం ఉంది. అందులోని కొంత భాగమే కనిపిస్తోంది. భూతద్దం తీసుకుని దాని మీద కనిపించే అక్షరాలని చదివాను. ఆక్టొపస్... అంతవరకే కనిపించింది.
వెంటనే నా ఒళ్లు జలదరించింది. ఆక్టొపస్ నెస్ట్? అది ఓ నవల. టిమోథీ దగ్గర ఆ నవల ఉండేది. బహుశ ఇంకా ఉందేమో? అతను దాన్ని నా చేత చదివించాలని విఫల ప్రయత్నం చేయడంతో నాకా నవల పేరు గుర్తుంది. ఆ నవల మొదటి పేజీలో రాసింది తర్వాతి పేజీల్లోకి లాక్కెళ్లలేదు అని గుర్తు. లేదా చివరి దాకా చదివి ఉండేదాన్ని. టిమోథీ ఏ పుస్తకమైనా చదువుతాడు. ఆ నవల గురించి ఎవరితో మాట్లాడాలి? మిగిలిన ఫొటోల్లో ఆమె చేతులు ఖాళీగా ఉన్నాయి.
టిమోథీ బహుశ ఇంకో ఇరవై నిమిషాల దాకా రాకపోవచ్చు. ఏడేళ్ల క్రితం ఓ బంగారు రంగు జుట్టు ఆమె ఓ బార్లో నా పక్కనే, టిమోథీ బాగా మెచ్చుకున్న నవలతో నా పక్కన నించుని ఉందంటే దాని అర్థం ఏమిటి? అది వారిద్దరి మధ్యా సంబంధాన్ని రుజువు చేస్తుందా? కాని ఆ నవల డజన్ల కొద్దీ బంగారు రంగు జుట్టు గల బ్రిటీష్ అమ్మాయిల దగ్గర ఉంటుంది. కాబట్టి అది బలమైన ఆధారం కాదని నిశ్చయించాను.
నేను లేచి పుస్తకాల షెల్ఫ్‌ని వెదికాను. ది ఆక్టొపస్ నెస్ట్ అనే ఆ నవల ఎక్కడా కనపడలేదు. నేను టిమోథీ సెల్‌కి మళ్లీ డైల్ చేశాను. అది స్విచ్ఛ్ఫా చేసిందనే జవాబు వచ్చింది. సినిమా హాల్లోంచి బయటకి వచ్చాక దాన్ని స్విచ్ఛాన్ చేయాలని ఆ పెద్ద మనిషికి తెలీదా? నాకో ఆలోచన రావడంతో వెంటనే నేను టిమోథీ గదిలోకి వెళ్లి లాప్‌టాప్‌ని ఆన్ చేశాను. ఆమెజాన్ ఆన్‌లైన్ బుక్‌షాప్‌లో ది ఆక్టొపస్ నెస్ట్ అనే పుస్తకం దొరుకుతుందా అని వెదికాను. దాన్ని ఎవరు రాశారో, ఏ విషయం మీద రాసారో తెలుసుకోవాలని అనుకున్నాను. అందువల్ల ప్రయోజనం ఉండదని అనిపించినా నేను ప్రస్తుతానికి చేయగలిగింది అదే.
అమెజాన్‌లో ది ఆక్టొపస్ నెస్ట్ నవల ఉంది. డెలివరీకి ఆరు వారాలు పడుతుంది. కాని దాన్ని కొనే ఆలోచన నాకు లేకపోవడం వల్ల అది నేను పట్టించుకోలేదు. దాని రచయిత పేరు కె వి హేమండ్. ఆ పేరు కోసం గూగుల్‌లో వెదికాను. ఆ రచయిత వెబ్ సైట్ సెర్చ్‌లో యుఆర్ ఎల్స్‌లో కనిపించింది. దాని మీద క్లిక్ చేశాను. ఆ సైట్లో నెమ్మదిగా తెర మీద ఓ ఫొటో పైనించి కిందకి దిగసాగింది. నీలి ఆకాశం. ఓ చెట్టు. ఓ గడ్డి టోపీ. బంగారు రంగు జుట్టు. బంగారు చదరపు చెవిరింగులు. ఆశ్చర్యంగా నేను కుర్చీలోంచి సగం లేచాను.
ఆమే!
ఆమె సైట్లోకి స్వాగతం చెప్పే ఉత్తరంలో ఆమె సంతకం ఉంది. ఆమె పేరు కేథరిన్ అని తెలుసుకున్నాను. ఓ నిమిషం క్రితమే ఆమె ఎవరో తెలుసుకోవడం కష్టం అనుకున్నాను. ఇంటర్నెట్‌ని ఎవరూ తిట్టకూడదు. నేను కనుక్కొన్నది చెప్పాలనే ఉత్సాహంతో మళ్లీ టిమోథీ నంబర్ని డయల్ చేశాను. మళ్లీ స్విచ్ఛ్ఫా.
నాలోకి భయం. ఎక్సయిజ్‌మెంట్ ఒకేసారి ప్రవేశించాయి. నేను వెంటనే ఏదైనా చేయాలి? నాకు కొంత సమాచారం లభ్యమైంది కాబట్టి పోలీసులకి ఫిర్యాదు చేయడంలో తప్పు లేదు అనిపించింది. నేను ఫొన్లో కాక ఈ కథంతా వ్యక్తిగతంగా చెప్పాలని అనుకోవడంతో పోలీసులకి ఫోన్ చేసి, నన్ను వెంటాడి వేధించే వ్యక్తి మీద ఫిర్యాదు చేస్తానని, ఆ వ్యక్తి ఎవరో నాకు తెలుసని, నా దగ్గర అందుకు సాక్ష్యం ఉందని చెప్పాను. నా ఫిర్యాదు అందుకున్న మహిళ ఓ పోలీస్ ఆఫీసర్ని నా దగ్గరికి పంపుతున్నానని చెప్పింది.
ఆమె వెబ్‌సైట్‌లోని ఓ విభాగంలోంచి ఇంకో విభాగానికి వెళ్తూ, ఆ నవల తర్వాత ఆమె మరి కొన్ని నవలల్ని కూడా ప్రచురించిందని, ఆమె తర్వాతి నవల ఓ వెంట్రిలాక్విస్ట్ డమీ ఏభై ఏళ్ల జీవితం గురించి అని, వచ్చే ఫిబ్రవరిలో తన సోదరితో కలిసి సిసిలీకి సెలవులు గడపడానికి వెళ్తున్నానని తన ఫేన్స్‌కి రాసిన తాజా ఉత్తరంలో ఉంది. నేను వెంటనే ఉలిక్కిపడ్డాను. నా గుండె కొట్టుకునే వేగం పెరిగింది. మేం కూడా సిసిలీకే వెళ్తున్నాం! అదీ ఫిబ్రవరిలోనే! కేథరిన్, ఆమె సోదరి బస చేసే హోటల్ పేరు బెర్నెబీ. మా బస కూడా అందులోనే అనే భయంకరమైన అనుమానం నాలో ప్రవేశించింది. వెంటనే నా భయం రెట్టింపైంది.
నేను లేచి టిమోథీకి ట్రావెల్ ఏజెంట్ నించి వచ్చిన హోటల్ కన్ఫర్మేషన్ ఉత్తరం కోసం వెదికాను. లేదు. నేను ఇంట్లోని అన్ని అలమార్లని, డ్రాయర్లని, పుస్తకాల షెల్ఫ్‌లని వెదికాను. అది ఎందుకు కనపడలేదో నాకు అర్థం కాలేదు. ఇంట్లో అది తప్పక ఉండి తీరాలి.
టిమోథీకి కారు గేరేజ్‌లో ఓ ఫైలింగ్ కేబినెట్ ఉందని నాకు అకస్మాత్తుగా గుర్తొచ్చింది. ఆ చవక కేబినెట్‌ని నేను ఇంట్లో ఉంచడానికి ఇష్టపడక పోవడంతో గేరేజ్‌లో ఉంచాడు. నేను గేరేజ్‌లోకి వెళ్లాను. పోలీస్ ఆఫీసర్ వచ్చేలోగా నేను మా హోటల్ రిజర్వేషన్ కన్ఫర్మేషన్ లెటర్ని, మమ్మల్ని వెంటాడే కేథరిన్ వెబ్ లింక్‌ని అతనికి చూపించాలి అనుకున్నాను. వారు అంతకంటే రుజువు అడుగుతారని అనుకోను. అయితే ఓ నవలా రచయిత్రి సిసిలీకి సెలవులు గడపడానికి వెళ్లడం చట్టవిరుద్ధం కాదు అంటారు. ఆమె మీద ఫిర్యాదు చేయకపోతే ఆమె మమ్మల్ని వెంటాడటం తన జీవిత కాలంలో ఆపకపోవచ్చు.
ఆ కేబినెట్‌కి తాళం వేసి ఉంది. ఆ తాళం చెవి గోడకి వేలాడుతూ కనిపించింది. తెరిచి పై డ్రాయర్ని లాగి తెరిచి లోపల కనపడ్డది చూసి నిర్ఘాంతపోయాను. ది ఆక్టొపస్ నెస్ట్ నవల పైనే ఉంది. దాన్ని అందుకోగానే దాని ఫ్రెంచ్ అనువాదం దాని కింద కనిపించింది. మిగిలిన నవలల మీద జపనీస్, హీబ్రూ అక్షరాలు కనిపించాయి. బొమ్మని బట్టి అవి అనువాదాలుగా గుర్తించాను. డజన్ల కొద్దీ పుస్తకాలు కనిపించాయి.
కింది డ్రాయర్ని తెరిచాను. ది ఆక్టొపస్ నెస్ట్ పేపర్ బేక్, హార్డ్ బౌండ్, బ్రెయిలీ భాషలో ముద్రించింది. బుక్ క్లబ్ ఎడిషన్, లార్జ్ ప్రింట్ ఎడిషన్ కనిపించాయి.
‘అవి మొత్తం ఏభై రెండు’
టిమోథీ మాటలు వినపడగానే నేను భయంగా చిన్నగా అరిచి వెనక్కి తిరిగాను. గుమ్మం దగ్గర నిలబడ్డ టిమోథీని చూసి అడిగాను.
‘టిమోథీ! ఏమిటిది?’
అతను కొద్దిసేపు నా వంక ఉదాసీనంగా చూస్తూ నిలబడ్డాడు. తర్వాత నా వైపు అడుగులు వేస్తూ చెప్పాడు.
‘నీకు నిజమే చెప్పాను. నేను ఆమెతో ఎన్నడూ మాట్లాడలేదు. ఆమె నాకు తెలీదు. నేనంటూ ఒకరంటూ ఉన్నారని కూడా ఆమెకి తెలీదు. ఈ సంగతి నీకు తెలీకపోయి ఉంటే బావుండేది. ఆమె కాదు. నేనే ఆమెని వెంటాడుతున్నాను’
అతను నా వైపు అడుగులు వేస్తూంటే అతని మొహంలోని మార్పుని గమనించాను. అంతదాకా అతని అలాంటి భావాలుగల మొహాన్ని నేను ఎన్నడూ చూసి ఎరుగను.
‘నీకు ఇది తెలీకపోతే నువ్వు జీవించేదానివి’
కెవ్వున అరుస్తున్న నాకు వెనక గోడ అడ్డం రావడంతో ఆగిపోయాను. అతని చేతులు నా మెడని చుట్టాయి.
‘ప్లీజ్ టిమోథీ! ప్లీజ్. వద్దు’
అతని చేతులు నా కంఠం చుట్టూ బిగుసుకోసాగాయి.
‘అలెక్స్ కోసం వొద్దు. నువ్వు ఒక్కడివే వాడిని పెంచలేవు’
అలెక్స్ పేరు విన్నాక అతని చేతుల్లోని బిగుతు తగ్గింది. నేను గట్టిగా ఊపిరి తీసుకుని వదిలాను. మళ్లీ అతని చేతులు నా కంఠం చుట్టూ బిగుసుకున్నాయి.
నాకు స్పృహ వచ్చాక ఓ కొత్త వ్యక్తి చెప్పాడు.
‘మీ వెంట పడి వేధించే వ్యక్తి మీద రుజువులతో సహా మీరు ఫిర్యాదు చేస్తానంటే వచ్చాను. మీ డోర్ బెల్ మోగిస్తే మీ ఆయన తలుపు తెరిచారు. మీరు ఇంట్లో లేరని చెప్తూ ఆయన బెదిరిపోవడం గమనించాక ఇల్లు వెదికితే స్పృహలో లేని మీరు కనిపించారు. ఏమిటి? చెప్పండి’ అడిగాడు.
‘మా వారు.. ఆయన్ని పట్టుకున్నారా? ఆయన నన్ను చంపబోయాడు..’
నేను చెప్పేది అతను తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేసుకోసాగాడు.
అలెక్స్‌ని నేను ఇక జీవితాంతం ఒంటరిగా పెంచాలి. కాని అది నాకు కష్టమైన విషయం కాదు. *

(సోఫీ హన్నా కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి