క్రైమ్ కథ

మళ్లీ వస్తాను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ కారు వచ్చి చీకటి సందులో ఆగింది. అందులోంచి ఓ శవాన్ని బయటకి పడేసాక కారు వెళ్లిపోయింది. రోడ్ల మీద నివసించే నేథన్ కారు వెళ్లాక చూస్తే శవం కనిపించింది. వెంటనే దాని దగ్గరికి వెళ్లి జేబులు వెతికాడు. ఖాళీ. శవానికి ఉన్న తెల్లటి బూట్లు అతన్ని ఆకర్షించాయి. తన చిరిగిపోయిన బూట్లని విప్పి వాటిని తొడుక్కున్నాడు.
అక్కడ నించి సరాసరి ఓ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో, మొదటి అంతస్థులోని ఓ తలుపు తెరుచుకుని లోపలికి వెళ్లాడు. పేకముక్కలతో పేషన్స్ ఆట ఆడే ఓ యువతి కాలి బూట్ల వంక మాత్రమే చూసి చెప్పింది.
‘డేన్! నువ్వా?’ తల ఎత్తి నేథన్‌ని చూసి వెంటనే లేచి భయంగా అడిగింది.
‘ఎవరు నువ్వు? బయటకి వెళ్లు’
అతను ఆమెని పక్కకి నెట్టి, అల్మైరా లోంచి ఓ సీసాని అందుకుని అందులోని విస్కీని తాగాడు.
‘అది డేన్ సీసా’ ఆమె చెప్పింది.
‘తెలుసు. అది అక్కడ ఉందని కూడా తెలుసు’
‘అతను వచ్చే సమయం అయింది. నిన్నిక్కడ చూస్తే చంపేస్తాడు’
బదులుగా అతను నవ్వాడు.
‘విల్మా! ఇప్పుడే వస్తాను’ చెప్పి పడక గదిలోకి వెళ్లి క్లోజెట్ లోంచి ఓ కోట్‌ని తీశాడు. తర్వాత డ్రెస్సర్ డ్రాయర్లోంచి రెండు రివాల్వర్లని తీసి పక్క మీద ఉంచాడు. బాత్‌రూంలోకి వెళ్లి గడ్డం గీసుకున్నాడు. ఈలోగా విల్మా రిసీవర్ అందుకుని, ఓ నంబర్ డయల్ చేసి చెప్పింది.
‘బెర్నీ! విల్మాని. అక్కడ డేన్ ఉన్నాడా?.. తిరిగి రాగానే వెంటనే ఇక్కడికి రమ్మని చెప్తావా?.. ఓకే.. థాంక్స్’ రిసీవర్ని పెట్టేసింది.
స్నానం చేయబోయే ముందు నేథన్ బూట్లని విప్పగానే చుట్టూ చూశాడు. అతనికి అంతా కొత్తగా అనిపించింది. తను అక్కడికి ఎలా వచ్చానా? అనే అయోమయంలో పడ్డాడు. తలుపు తెరవగానే విల్మా రివాల్వర్ గురి పెట్టి అడిగింది.
‘చెప్పు. డేన్ ఏడి?’
‘నాకు తెలీదు’
‘ఇవి డేన్ బూట్లు. లండన్‌లో మాత్రమే ఇవి ఈ ఊళ్లో ఎవరికీ లేవు’
‘ఓ! బూట్లా! ఇవి నాకు దొరికాయి’
‘ఎక్కడ?’
‘దొంగిలించాను’
‘క్లబ్ నించా? అక్కడ నువ్వు ఏం చేస్తున్నావు?’
‘మీ ప్రశ్నకి నాకు జవాబు తెలీదు. నిజానికి నేను ఇక్కడ ఎలా ఉన్నానో నాకు అర్థం కావడంలేదు’ నేథన్ జవాబు చెప్పాడు.
‘నీకు తెలిసింది చెప్పు’ ఆమె ఆజ్ఞాపించింది.
‘నాకేం తెలీదు’
చెప్పి అతను మెయిన్ డోర్ దగ్గరికి వెళ్తూంటే ఆమె అడ్డుపడి ఆపింది.
‘నా ఇంట్లోకి జొరబడ్డ నిన్ను చంపినా నేరం కాదు’
‘దయచేసి ఆ పని చెయ్యకు. కావలాంటే బూట్లు తీసుకో. కాని చంపకు’ అర్థించాను.
ఆమె అతన్ని కొద్ది క్షణాలు పరిశీలనగా చూసి చెప్పింది.
‘బూట్లు తొడుక్కుని ఇక్కడ నించి వెళ్లు’
వాటిని తొడుక్కున్న అతనిలో మార్పు వచ్చింది. ఆమె దగ్గరికి వెళ్లి ఆమె చేతిలోని రివాల్వర్‌ని అందుకుని చెప్పాడు.
‘నాకో డ్రింక్ కలుపు’
గదిలోకి వెళ్లి కొత్త సూట్ వేసుకుని బయటకి వచ్చిన అతను విల్మాని అడిగాడు.
‘డ్రింక్ ఏది?’
‘ఏం తాగుతావు?’ బార్ కౌంటర్ వెనక్కి వెళ్లి అడిగింది.
‘ఎప్పుడూ తాగేదే’
‘అది నాకెలా తెలుస్తుంది?’ అతని వంక పరిశీలనగా చూస్తూ అడిగింది.
‘టెకీలా. చక్కెర కూడా వెయ్యి’
ఆమె అతనికి గ్లాస్‌ని అందించి అడిగింది.
‘నువ్వెవరో నాకు నిజం చెప్తావా?’
‘నువ్వే చెప్పు’
‘ఇంకొద్ది సేపట్లో డేన్ ఇక్కడికి వస్తున్నాడు. నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కాదు’ చెప్పింది.
‘నాకేది మంచిదో నాకు తెలుసు’
‘నన్ను ముట్టుకోకు’ తనని దగ్గరికి తీసుకోవడంతో అరిచింది.
‘నేనెవర్ని?’ ఆమెని చుంబించాక అడిగాడు.
‘డేన్? కాదు. నువ్వు డేన్ కాదు..’
‘వెళ్తున్నాను. నేను చేయాల్సిన పని ఒకటి ఉంది. నేను తిరిగి వచ్చేదాకా ఇక్కడే ఉండు’ చెప్పి నేథన్ బయటకి నడిచాడు.
* * *
నేథన్ ఆ బార్లోకి అడుగుపెట్టగానే ఓ చోట కూర్చున్న ఓ వ్యక్తి అతని దృష్టిని ఆకర్షించాడు.
‘ఏం కావాలి?’ బార్ మేన్ అడిగాడు.
‘టెకీలా. షుగర్, ఐస్ క్యూబ్స్‌తో’
ఆ మాట వినగానే ఆ వ్యక్తి నేథన్ వంక చూశాడు. నేథన్ సన్నగా నవ్వి బార్ స్టూల్ మీది తన కాళ్లని కావాలని ఆడించగానే ఆ వ్యక్తి దృష్టి అతని తెల్లటి బూట్ల మీద పడింది. వెంటనే లేస్తూ తన పక్కన కూర్చున్న రిచీని అడిగాడు.
‘నీకు అతను తెలుసా?’
‘నేను ఎప్పుడూ చూడలేదు. కాని అతను మన వంక బాగా పరిచయస్థుడిలా చూస్తున్నాడు’ రిచీ జవాబు చెప్పాడు.
‘అతన్ని నా గదిలోకి తీసుకురా’
రిచీ లేచి నేథన్ దగ్గరికి వెళ్లి చెప్పాడు.
‘మిస్టర్ బేగెట్ మిమ్మల్ని పిలుస్తున్నాడు’
నేథన్ లేచి వెళ్లి బేగెట్ పక్కన కూర్చుని పలకరించాడు.
‘హలో బెర్నీ’
‘నేను నీకు తెలుసా?’ బేగెట్ అడిగాడు.
‘తెలుసు. మీకున్న కీర్తి వల్ల’
‘ఓ! నువ్వెప్పుడూ టెకీలాని షుగర్ క్యూబ్ వేసుకునే తాగుతావా?’
‘అవును’
‘ఇది చాలా కాకతాళీయం’
‘ఎలా?’
‘నా మంచి మిత్రుడు ఒకడు ఇలాగే తాగుతాడు. నీ పేరేమిటి?’ బేగెట్ అడిగాడు.
‘కిల్‌రాయ్’
‘నువ్వేం చేస్తూంటావు?’
‘సందేశాలు ఇస్తూంటాను. నీకో సందేశం తెచ్చాను బెర్నీ’
‘ఏమిటది?’
‘ఇది ఏకాంతంగా, రహస్యంగా చెప్పాల్సింది’
‘అది ఎవర్నించి?’
‘అదీ ఇక్కడ చెప్పకూడదు’
‘అతను ఎలా ఉంటాడు?’
వాళ్ల సంభాషణని పక్కనే ఉన్న రిచీ జాగ్రత్తగా వింటున్నాడు.
‘బెర్నీ. నా వృత్తి మర్చిపోవడం తప్ప గుర్తుంచుకోవడం కాదు’ నేథన్ నవ్వుతూ చెప్పాడు.
‘సరే. పద’
రిచీ కూడా లేవడంతో నేథన్ చెప్పాడు.
‘ఇది వ్యక్తిగతం అన్నాను’
‘వ్యక్తిగతమే అవుతుంది. రానీ’ బేగెట్ చెప్పాడు.
అంతా అతని ఆఫీస్ గదిలోకి వెళ్లారు.
రిచీ నేథన్‌ని వెదికి అతని కోటు జేబులోని రివాల్వర్ని బయటకి తీశాడు.
‘సరే. ఇప్పుడు చెప్పు’ బేగెట్ కోరాడు.
‘తర్వాత నా రివాల్వర్ నాకు వెనక్కి ఇవ్వాలి’ దాంతో రిచీ బయటకి వెళ్తూంటే నేథన్ కోరాడు.
అతను బయటకి వెళ్లాక నేథన్ అడిగాడు.
‘ఇంత త్వరగా ఎలా శుభ్రమైంది బెర్నీ?’
‘ఏమిటది?’
‘ఇక్కడ కార్పెట్ మీది రక్తం’
‘నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు’
‘నీకు చాలా డబ్బు సంపాదించే నీ భాగస్వామి భాగాన్ని కూడా కొట్టేయాలనుకున్నావు. భాగస్వామ్యాన్ని అమ్మమని అతన్ని కోరావు. అతను తిరస్కరించడంతో ఇక్కడే, కొన్ని గంటల ముందే చంపేసావు’
‘నువ్వెవరు?’ బేగెట్ అతని వంక ఆసక్తితో కూడిన భయంతో చూస్తూ అడిగాడు.
‘చెప్పాగా? మెసెంజర్ని. ఇదే సందేశం. రిచీకి ఓ రివాల్వర్ కనపడగానే ఇంకో దాని కోసం వెదకడని నాకు తెలుసు’
పేంట్ వెనక దోపుకున్న రివాల్వర్ని తీసి బేగెట్ ఛాతీకి గురిపెట్టాడు.
సరిగ్గా ఆ సమయంలో రివాల్వర్ పేలిన శబ్దం వినిపించింది. తక్షణం నేథన్ నేల మీది కార్పెట్ మీద పడిపోయాడు. బేగెట్ పుస్తకాల షెల్ఫ్‌లా అమర్చిన తలుపుని పక్కకి నెట్టిన రిచీ చేతిలోని రివాల్వర్ పొగలు కక్కుతోంది. బేగెట్ నేల మీద పడ్డ నేథన్ చేతిలోని రివాల్వర్ని తీసుకున్నాడు.
‘నేను మళ్లీ వస్తాను బెర్నీ. నిన్ను చంపడానికి మళ్లీ మళ్లీ వస్తూంటాను’ చెప్పి నేథన్ తుదిశ్వాసని విడిచాడు.
‘ఇతను ఎవరు?’ రిచీ అడిగాడు.
‘నాకు తెలీదు’ బేగెట్ చెప్పాడు.
* * *
మళ్లీ కారు చీకటి సందులో ఆగింది. ఓ శవాన్ని బయట పారేసి కారు వెళ్లిపోయింది. చెత్త డబ్బా పక్కనించి వచ్చిన ఓ బీదవాడు ఆ శవాన్ని చూసి చెప్పాడు.
‘ఓ నేథన్! నువ్వేనా?’
అతని దగ్గరికి వెళ్లి చూసి మరణించాడని గ్రహించగానే అతని బూట్లని విప్పాడు. తర్వాత తన పాత బూట్లని విప్పి వాటిని తొడుక్కుంటూ చెప్పాడు.
‘ఇప్పుడు నీకు వీటి అవసరం లేదు నేథన్’

(్ఛర్లెస్ బ్యూమాంట్ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి