క్రైమ్ కథ

పొగమంచులో అపరిచితుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమాధి కోసం గోతిని తవ్వడాన్ని పూర్తి చేశాక, పొగ మంచులో ఓ నల్లటి ఆకారం తన దగ్గరికి రావడం గమనించి హనీగాన్ ఉలిక్కిపడ్డాడు. పసిఫిక్ మహాసముద్రం బీచ్ వైపు నించి వచ్చిన ఆ వ్యక్తి హనీగాన్ చేసే పని చూసి అల్లంత దూరంలో ఆగాడు. హనీగాన్ లాంతరు వెలుగు అతని మీద పడటం లేదు.
‘ఎవరు మీరు?’ హనీగాన్ అడిగాడు.
అతను హనీగాన్ పాదాల దగ్గర కుప్పగా ఉన్న ఇసుకతో కూడిన మట్టిని, కేన్వాస్‌ని చూసి చెప్పాడు.
‘నేనూ అదే ప్రశ్న అడుగుతున్నాను’
‘నేను ఇక్కడే నివసిస్తున్నాను. ఇది ప్రైవేట్ బీచ్’ హనీగాన్ చెప్పాడు.
‘ప్రైవేట్ శ్మశానం కూడానా?’ అతను నవ్వుతూ ప్రశ్నించాడు.
‘నా కుక్క ఇవాళ సాయంత్రం పోయింది.’
‘అది చాలా పెద్ద కుక్కయి ఉండాలి’ అతను గోతిని చూస్తూ చెప్పాడు.
‘అవును. గ్రేట్ డేన్ జాతికి చెందింది. మీకేమైనా కావాలా? లేక పొగమంచులో ఊరికే నడుస్తూంటారా?’ మొహానికి పట్టిన చెమటని తుడుచుకుంటూ హనీగాన్ అడిగాడు.
‘మీ ఇంట్లో ఫోన్‌ని నేను ఉపయోగించుకోవచ్చా?’ ఆ అపరిచితుడు ప్రశ్నించాడు.
‘దాన్ని మీరు ఎలా వాడతారు అన్న దాన్నిబట్టి ఉంటుంది.’
‘నా కారు పాడైందనే కథ చెప్పచ్చు. కాని నేను హైవే నించి ఇంత దూరం ఎలా వచ్చానా అని మీకు అనిపించచ్చు’
‘నాకు అదే అనిపించింది’
‘ఇక్కడ భద్రత ఉంటుందని ఇటు వచ్చాను’ అతను చెప్పాడు.
‘నాకు అర్థం కాలేదు’ హనీగాన్ చెప్పాడు.
‘మీరు రేడియో వినరా? టీవీ చూడరా?’
‘మీ నించి తప్పించుకోగలిగితే వినను, చూడను’
‘ఐతే టెస్కాడెరో పిచ్చాసుపత్రి నించి ఓ పిచ్చివాడు తప్పించుకున్నాడని మీకు తెలీదా?’
‘తెలీదు’
‘ఇవాళ మధ్యాహ్నం తప్పించుకున్నాడు. హాస్పిటల్‌లో ఓ అటెండెంట్‌ని, వంట కత్తితో పొడిచి చంపాడు. నిజానికి ముగ్గుర్ని. అతను ఉత్తరం వైపు పారిపోయాడని భావిస్తున్నారు. ఎందుకంటే, అతని స్వగ్రామం అటు వైపే. లేదా దక్షిణం వైపు కూడా వెళ్లి ఉండచ్చు’
‘టెస్కాడెరో ఇక్కడికి పనె్నండు మైళ్ల దూరంలో ఉంది. ఈ పొగమంచులో మీరు ఏం చేస్తున్నారన్న నా ప్రశ్నకి జవాబు చెప్పలేదు?’
‘నేను వీకెండ్‌కి శాన్‌ఫ్రాన్సిస్కో నించి నా గర్ల్‌ఫ్రెండ్‌తో ఇక్కడికి వచ్చాను. వ్యాపారం పని మీద. నిజానికి ఆమె భర్త లాస్‌ఏంజెలెస్‌లో ఉండాలి. కానీ ముందుగానే ఇంటికి తిరిగి వచ్చాడు. ఆమె ఇంట్లో లేకపోవడంతో, ఆమె ఇక్కడికి వచ్చి ఉంటుందనే అనుమానంతో ముందుగా ఫోన్ చేయకుండా వచ్చాడు. ఆయన చూసేలోగా ఆమె నన్ను బయటకి పంపేసింది’
‘ఇంత చలిలోనా?’
‘ఆమె భర్త కోటీశ్వరుడు. ఆమె కోరిన డబ్బిస్తూంటాడు’
‘ఆమె పేరేమిటి?’ హనీగాన్ అడిగాడు.
‘అది మీకు అవసరం లేదు’
‘ఐతే మీరు నిజం చెప్తున్నారని నేనెలా నమ్మాలి?’
‘నేను అబద్ధం ఎందుకు చెప్తాను?’ ఆ అపరిచితుడు ప్రశ్నించాడు.
‘అబద్ధం ఆడటానికి మీకు తగిన కారణాలు ఉండచ్చు’
‘నేను పారిపోయిన పిచ్చివాడ్ని అంటున్నారా?’
‘అవును’ హనీగాన్ చెప్పాడు.
‘మీరే ఆ పిచ్చివాడై ఉండచ్చు. అర్ధరాత్రి గొయ్యి తవ్వుతూ...’ అతను చెప్పాడు.
‘నా కుక్క మరణించిందని చెప్పాను. అయినా తను చంపిన వాడిని ఏ పిచ్చివాడైనా గొయ్యి తీసి పాతిపెడతాడా? ఆ పిచ్చివాడు పొడిచిన అటెండెంట్ కోసం గొయ్యి తవ్వాడా?’ హనీగాన్ ప్రశ్నించాడు.
‘సరే. మనిద్దరిలో ఎవరం పిచ్చివాళ్లం కాదు. మీ ఫోన్‌ని నేను ఓసారి ఉపయోగించుకోవచ్చా?’
‘మీరు ఎవరికి ఫోన్ చేయాలి?’
‘శాన్‌ఫ్రాన్సిస్కోలోని నా మిత్రుడికి. అతను కారులో వచ్చి నన్ను తీసుకెళ్తాడు. అతను వచ్చేదాకా నేను మీ ఇంట్లో ఉండచ్చా?’
హనీగాన్ కొద్ది క్షణాలు ఆలోచించి జవాబు చెప్పాడు.
‘సరే. నా పని పూర్తి చేశాక’
హనీగాన్ మోకాళ్ల మీద కూర్చుని కేన్వాస్‌లో చుట్టిన దేహాన్ని జాగ్రత్తగా గోతిలో ఉంచాడు. తర్వాత పారతో మట్టికుప్పని గోతిలో నింపసాగాడు. ఈ పని చేస్తున్నా అతని కళ్లు ఆ అపరిచితుణ్ని గమనిస్తూనే ఉన్నాయి. తర్వాత లాంతరు అందుకుని, తనని అనుసరించమని సైగ చేసి నడిచాడు. అవసరం వస్తే, మీదకి దూకే లేదా పారిపోయే జంతువులా ఆ అపరిచితుడిలో వొత్తిడి కనిపించింది.
‘మీకో పేరుందా?’ హనీగాన్ అడిగాడు.
‘పేరు లేనివారు ఎవరు ఉంటారు?’
‘నేను అడిగేది మీ పేరు’
‘ఆర్ట్‌వికరీ. మీకు దీని అవసరం ఉంటే’
‘నాకే అవసరం లేదు. కాకపోతే, నా ఇంట్లోకి ఎవర్ని అనుమతిస్తున్నానో నేను తెలుసుకోవాలి కదా’
‘నేనూ ఎవరింటికి వెళ్తున్నానో తెలుసుకోవాలి’ వికరీ చెప్పాడు.
హనీగాన్ తన పేరు చెప్పాక ఇద్దరూ వౌనంగా చీకట్లో సాగారు.
లాంతరు వెలుగు, పొగమంచు వల్ల ఆట్టే దూరం కనపడటంలేదు. కొద్ది దూరం వెళ్లాక దూరంగా ఓ ఇంటి దీపాల వెలుగులు కనిపించాయి. ఎర్ర కలప, గాజుతో నిర్మించబడ్డ ఆ ఇంటి బాల్కనీ సముద్రం వైపుంది. ఇద్దరూ చెక్క మెట్లెక్కి ఇంటి గుమ్మం దగ్గరికి చేరుకున్నారు. అక్కడి నించి, కింద హైవేలో వెళ్ళే కార్ల దీపాలు కనిపిస్తున్నాయి. ఇద్దరూ తలుపు ముందు ఆగారు.
ఆ తలుపు తోస్తే తెరుచుకుంటుందని హనీగాన్ చెప్పేలోపలే పొగ మంచులోంచి మరో కొత్త వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. ముందుగా హనీగాన్ అతన్ని చూశాడు. నలిగిన సూట్, టై లేదు. జుట్టు చెదిరి ఉంది. అతన్ని చూసిన వికరీ కొద్దిగా కంగారుపడ్డాడు.
అతను అడిగాడు.
‘మీ ఇద్దరిలో ఒకరు ఈ ఇంటి యజమానా?’
‘అవును. నేనే. మీరెవరు?’ హనీగాన్ తన పేరు చెప్పాడు.
‘లెఫ్ట్‌నెంట్ మేక్లిన్. హైవే పెట్రోల్. ఈ సాయంత్రం అంతా మీరు ఇక్కడే ఉన్నారా? మిస్టర్ హనీగాన్?’ ప్రశ్నించాడు.
‘అవును’
‘ఎలాంటి ఇబ్బందీ ఎదురవలేదుగా?’
‘లేదు. ఎందుకడుగుతున్నారు?’
‘టస్కాడెరో పిచ్చాసుపత్రి నించి పారిపోయిన రోగి గురించి మీరు విన్నారా?’
హనీగాన్ తల ఊపాడు.
‘అతను ఈ చుట్టుపక్కల ఉండచ్చని మాకు సమాచారం అందింది’
హనీగాన్ వెంటనే వికరీ వైపు తల తిప్పి చూశాడు.
‘మీరు హైవే పెట్రోల్‌లో పని చేస్తూంటే మరి యూనిఫాంలో ఎందుకు లేరు?’ వికరీ వెంటనే ప్రశ్నించాడు.
‘నేను మఫ్టీలో ఉండే పరిశోధనా విభాగానికి చెందినవాడిని’
‘పోలీసులు జంటగా ఉంటారని విన్నాను. మీరు ఒక్కరే ఉన్నారే? అదీ కాలినడకన వచ్చారే?’
‘మేము ఈ మొత్తం ప్రాంతాన్ని వెదకడానికి విడిపోయాం. నా కారు ఫేన్ బెల్ట్ తెగిపోయింది. నేను వైర్లెస్ ద్వారా సహాయం కోరి ఇటువైపు వచ్చాను’
వెంటనే హనీగాన్‌కి ఇందాక వికరీ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ‘నా కారు పాడైందనే కథ మీరు చెప్పచ్చు’
‘మీ ఐడెంటిఫికేషన్‌ని నేను చూడచ్చా?’ వికరీ అడిగాడు.
మేక్లిన్ వెంటనే కోటు జేబులోంచి ఓ బేడ్జ్‌ని తీసి చూపించాడు. దాని మీద ఫొటో లేదు.
‘ఆ పారిపోయిన పిచ్చివాడి ఫొటో మీ దగ్గర ఉందా?’ హనీగాన్ ప్రశ్నించాడు.
‘అతను గత పదహారేళ్లుగా ఆ హాస్పిటల్‌లో ఉన్నాడు. తన ఫైల్‌ని నాశనం చేసి పారిపోయాడు అని తెలిసింది’
‘ఎలా ఉంటాడు?’
‘నల్లజుట్టు. మిగతావన్నీ ఉత్తర కేలిఫోర్నియాలోని లక్షల మందికి సరిపోయే పోలికలు’
‘అవి మన ముగ్గురిలో ఎవరికైనా సరిపోతాయన్న మాట’ వికరీ చెప్పాడు.
‘అవును. హాస్పిటల్ వాళ్లు చెప్పిన దాన్నిబట్టి తను పిచ్చివాడు అనే అనుమానం రాకుండా వర్తించగలడు’ మేక్లిన్ చెప్పాడు.
‘ఐతే మరీ ప్రమాదం’ హనీగాన్ చెప్పాడు.
‘అవును. ఇక్కడ చలిగా ఉంది. మనం లోపలకి వెళ్లి మాట్లాడుకుంటే బావుంటుంది’ మేక్లిన్ చెప్పాడు.
హనీగాన్ తలుపు తీసి లోపలికి వెళ్తే, మిగిలిన ఇద్దరూ అతన్ని అనుసరించారు. చివరిగా వచ్చిన మేక్లిన్ తలుపు మూశాడు. అతను ఆ విశాలమైన హాల్‌ని, ఫైర్‌ప్లేస్‌ని, గోడకున్న చిత్రాలని చూసి అడిగాడు.
‘బావుంది. మీరిక్కడ వొంటరిగా ఉంటున్నారా హనీగాన్?’
‘లేదు. నా భార్యతో కలిసి. కానీ ఆమె ప్రస్తుతం ఇంట్లో లేదు. ఆమెకి జూదం ఇష్టం. లాస్‌వెగాస్‌కి వెళ్లింది. మీకు తాగడానికి ఏమైనా కావాలా?’ హనీగాన్ అడిగాడు.
‘నో థాంక్స్. నేను డ్యూటీ మీద ఉన్నప్పుడు తాగను’ మేక్లిన్ చెప్పాడు.
‘నేను తాగుతాను’ వికరీ ఆ గదిలోకి వచ్చాక, తన వంకే నిశితంగా చూసే మేక్లిన్‌ని ఇబ్బందిగా చూస్తూ చెప్పాడు.
కిటికీ పక్కన ఉన్న అలమరాలోంచి విస్కీ బాటిల్‌ని తీసి, హనీగాన్ గ్లాస్‌లో పోసిచ్చాడు.
‘మీ పేరేమిటి?’ మేక్లిన్ అడిగాడు.
‘ఆర్ట్ వికరీ. ఎందుకు నా వంకే అలా చూస్తున్నారు?’ అతను అడిగాడు.
‘మీరు మిస్టర్ హనీగాన్ మిత్రులా?’

ఆ ప్రశ్నకి వికరీ జవాబు చెప్పలేదు. హనీగాన్ చెప్పాడు.
‘లేదు. ఈ రాత్రే కొద్ది నిమిషాల క్రితం ఇతన్ని కలిశాను. నా ఫోన్‌ని ఉపయోగించుకోవాలని వచ్చారు’
‘ఐతే మీరు ఈ చుట్టుపక్కల ఉండరా మిస్టరీ వికరీ?’
‘అవును’
‘మీ కారు కూడా పాడైందా?’
‘కాదు. నేను ఓ యువతితో ఉన్నాను. పెళ్లైన యువతితో. అనుకోకుండా ఆమె భర్త వచ్చాడు. అది ఎలాంటిదో మీకు తెలుసనుకుంటా’
‘తెలీదు. ఆమె ఎవరు?’
‘మీరు చెప్పినట్లుగా మీరు హైవే పెట్రోల్ మనిషైతే, ఆమె పేరు మీకివ్వను’
‘నేను హైవే పెట్రోల్ మనిషైతే అనడంలో మీ ఉద్దేశం ఏమిటి? మీకు నా ఐడెంటిఫికేషన్ కూడా చూపించాను’ మేక్లిన్ కోపంగా అడిగాడు.
‘అది మీ దగ్గర ఉన్నంత మాత్రాన అది మీది కాదు’
‘మీరు చెప్పదల్చుకుంది సూటిగా చెప్పండి’
‘ఈ పొగమంచులో గుర్తు తెలియని ఓ పిచ్చివాడు తప్పించుకు తిరుగుతున్నాడు’ వికరీ చెప్పాడు.
‘అంటే మీరు పోలీస్ ఆఫీసర్ని కూడా నమ్మడం లేదు’ మేక్లిన్ చెప్పాడు.
‘నేను జాగ్రత్తగా ఉండదలచుకున్నాను’
‘అది మంచి పని. నేను కూడా జాగ్రత్త మనిషినే. మీరు ఎక్కడ ఉంటారు వికరీ?’
‘శాన్‌ఫ్రాన్సిస్కోలో’
‘ఈ రాత్రి ఇంటికి ఎలా చేరతారు?’
‘ఓ ఫ్రెండ్‌కి ఫోన్ చేసి వచ్చి పికప్ చేయమని కోరతాను’
‘ఇంకో లేడీ ఫ్రెండ్?’
‘కాదు’
‘సరే. మీరు నాతో నా కారు దగ్గరికి వస్తే, పోలీసుస్టేషన్‌కి తీసుకువెళ్తాను. అక్కడి నించి మీరు ఫోన్ చేయచ్చు’
‘ఆ ఫోన్‌కాల్‌ని నేను ఇక్కడే చేయగలను’
‘కానీ మీరు మిస్టర్ హనీగాన్‌కి అసౌకర్యాన్ని కలిగిస్తారు. ఓ అపరిచితుడిని అలా ఇబ్బంది పెట్టడం భావ్యమా?’
‘ఈ పొగమంచులో నేను మీతో వొంటరిగా కాలినడకన రాను’ వికరీ చెప్పాడు.
‘బహుశా మీరు రావాల్సి ఉంటుంది’
‘రాను. మీ కళ్లు నాకు నచ్చలేదు. అవి ననే్న తదేకంగా చూస్తున్నాయి’
‘నాకూ మీ చర్యలు నచ్చలేదు. మీరు చెప్పిన కథకాని, మీరు కనపడే విధంకానీ’ మేక్లిన్ మృదువుగా చెప్పినా, అందులో కఠినత్వం ధ్వనించింది.
వికరీ అతని వైపు ఓ అడుగు వేశాడు. వెంటనే మేక్లిన్ హోల్‌స్టర్‌లోంచి రివాల్వర్ తీసి వికరీ ఛాతికి గురిపెట్టాడు. హనీగాన్ ఊపిరి బిగబట్టాడు.
‘బయటకి నడు మిస్టర్’ మేక్లిన్ ఆజ్ఞాపించాడు.
వికరీ మొహం పాలిపోయింది. చిరుచెమటలు పట్టాయి. అతను తల అడ్డంగా ఊపుతూంటే, మేక్లిన్ అతని వైపు నడిచాడు. వికరీ వెనక్కి అడుగువేస్తూ నిస్సహాయంగా హనీగాన్‌తో చెప్పాడు.
‘దయచేసి నన్ను అతను తీసుకెళ్లకుండా చూడండి’
‘నేనేం చేయలేను’ హనీగాన్ చెప్పాడు.
‘మిస్టర్ హనీగాన్. మీరు కల్పించుకోకండి. ఈ వ్యవహారాన్ని పరిష్కరించనివ్వండి’
మేక్లిన్ వికరీని హాల్‌లోంచి తలుపువైపు తీసుకెళ్లడాన్ని హనీగాన్ నివ్వెరపోతూ చూశాడు. వాళ్లిద్దరూ బయటికి వెళ్లాక, తలుపు చప్పుడు చేస్తూ మూసుకుంది.
హనీగాన్ జేబులోంచి చేతి రుమాలు తీసి నుదుటికి పట్టిన చెమటని తుడిచాడు. తర్వాత బయటకి నడిచాడు. దూరం నించి సముద్ర కెరటాల హోరు వినిపిస్తోంది. వికరీ, మేక్లిన్‌లు కనపడలేదు. అతను తలుపు పక్క గోడకి ఆనించిన లాంతరుని, పారని తీసుకుని మెట్లు దిగి ముందుకి నడిచాడు. వారిద్దరిలో వికరీ పిచ్చివాడా? లేక మేక్లినా? ఏది ఏమైనా వికరీ తను తవ్విన గొయ్యి గురించి ఎవరితోనైనా చెప్పచ్చు. కాబట్టి తను మళ్లీ తవ్వి, దేహాన్ని తీసి మరో చోట పాతిపెట్టాలి అనుకున్నాడు. ఇంకాస్త మంచి చోట్లో శాశ్వత సమాధి మంచిది అనుకున్నాడు. ఆ తర్వాత చాలా డబ్బుని ఖర్చు చేయడమే తన పని అని కూడా అనుకున్నాడు. ఉన్నదంతా కరెన్ జూదంలో నాశనం చేసేస్తోంది.
తవ్వి, గొంతు పిసికి చంపబడ్డ తన భార్య మృతదేహాన్ని లాంతరు వెలుగులో బయటకి తీశాడు.
అప్పుడే పొగమంచులో ఓ అపరిచిత వ్యక్తి చేతిలో పదునైన వంటకత్తితో పిల్లిలా హనీగాన్ వైపు అడుగులు వేశాడు.

(బిల్‌ప్రోంజినీ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి