మెయిన్ ఫీచర్

హోదాను వదులుకొని ...గుడిసెలో నివాసం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నగరంలో విలాసవంతమైన జీవనం గడపడానికి అవకాశం ఉన్నా.. ఇవేమి ఆమెకు సంతృప్తినివ్వలేదు. కొండకోనల్లో నివసించే గిరిజనుల జీవన స్థితి గతులను మెరుగుపరచడానికి తన వంతు ఏం చేయాలన్న తపన ఆమెలో కలిగింది. దీంతో ఎన్నో కష్టనష్టాలను ఒనర్చి కొండలు ఎక్కి గిరిజనుల స్థితిగతులను తెలుసుకొని వారికి విద్యా బుద్ధులు నేర్పేందుకు అవసరమైన గిరిజన భాష లిపిని కనుగొంది. ఇలా ఒకటి కాదు...రెండు కాదు ఏకంగా 18 గిరిజన భాషలకు ఆమె లిపిని రూపొందించింది. ఆమె చేసిన కృషికి ఇటీవల లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సులో ఆమె స్ధానం సంపాదించుకుంది. ఆమె ఎవరో కాదు..... ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇంగ్లీషు విభాగంలో లింగ్విస్టిక్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ప్రసన్నశ్రీ.
స్వాతంత్య్రం సిద్ధించి 70 ఏళ్లు గడచినా నేటికి గిరిజనుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. మన రాష్ట్రంలో మొత్తం జనాభాలో గిరిజనులు 7.8 శాతం మంది ఉండగా, తెలంగాణాలో 12 శాతం మంది ఉన్నారు. ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాల్లో మొత్తం 21 రకాల గిరిజనుల జాతులు ఉన్నాయి. ఇక్కడ గిరిజనుల జీవన స్థితిగతులను తెలుసుకునేందుకు, వారి సంప్రదాయాలను తెలుసుకోడానికి అమెరికా, జెకోస్లోవేకియా, ఈజిప్ట్ వంటి దేశాల నుంచి విదేశీయులు వచ్చి ఇక్కడ గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకుంటున్నారు. కాగా, ఇక్కడి ప్రభుత్వాలు మాత్రం వీటిపై అంతగా ఆసక్తికనబరచడం లేదు. గిరిజనుల సంక్షేమానికి కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నామని ప్రభుత్వాలు కాకి లెక్కలు చెప్పడం మినహా ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం గిరిజనుల ఆలోచనా విధానంలో మార్పులు తీసుకురావడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని చెప్పవచ్చు. ఏ ప్రాంతం వారికైనా వారి మాతృభాషలో బోధించాలని చట్టాలు చెబుతున్నా గిరిజనుల విషయానికి వచ్చే సరికి ఆ పరిస్థితి కన్పించడం లేదు. గిరిజనులకు తెలుగులో భోదిస్తుంటే ఆ విద్యా విధానంలో ఇమడలేక మధ్యలోనే చదువును నిలిపివేస్తున్నారు. ఇప్పటికీ కొండ ప్రాంతాల్లో చదువుపై ఆసక్తి చూపుతున్న వారి సంఖ్య బహు స్వల్పంగా ఉంది. అందువల్లనే కేంద్ర ప్రభుత్వం 1972లో గిరిజన విద్య విధానం గురించి చట్టం చేసింది. ఆ చట్టం ప్రకారం మూడో తరగతి వరకు గిరిజనులకు అదే భాషలో బోధించాలన్నదీ దాని సారాంశం. ఆ మేరకు ఎక్కడా అమలు చేసిన దాఖలాలు లేవు. ఇంత వరకు గిరిజన లిపిని కనుగొనాలన్న ఆలోచనలపై ప్రభుత్వం దృష్టిసారించలేదు. ప్రభుత్వ సాయం లేనప్పటికీ ఆమె మాత్రం వెనుకంజ వేయలేదు. గిరిజనులు మాట్లాడే భాషను తెలుసుకొనేందుకు ఎన్నో కష్టాలను ఒనర్చింది. ఆమె ఎదుర్కొన్న పరిస్థితులు చూస్తే ఒళ్లు గగుర్పొడచక మానదు. ఆమె ఒక గిరిజన స్ర్తి అయినప్పటికీ నగరం నుంచి వెళ్లి కొండల్లో పర్యటిస్తుంటే మావోలకు అనుమానం కలిగింది. ఈమె మావోల ఆచూకీ తెలుసుకునేందుకు వచ్చిందన్న అనుమానంతో ఆమెను చితక్కొట్టి చెట్టుకు కట్టేసి పాము పుట్టపై పడేసారు. ఆ పాము పుట్టపై ఉన్నప్పుడు తేళ్లు, జెర్రెలు పాకడం.. ఒళ్లంతా బొబ్బలెక్కడం వంటి భయానక పరిస్థితిని అనుభవించింది. అయినప్పటికీ మొక్కవోని దీక్షతో ఆమె గిరిజనుల భాషలను తెలుసుకునేందుకు అనేక ప్రాంతాలను పర్యటించింది. ఆ విధంగా ఆమెగిరిజనుల స్థితిగతులపై అనేక మంది అధ్యయనాలు చేసి ప్రభుత్వానికి నివేదికలు అందజేసింది. అంతేగాకుండా ఆమె గిరిజన తెగలు ఎరుకుల, కొటియా, బుగత, గడబ, జాతాపు, కోయ, కోయదొర, కోలాం, సంగలి, పూర్జ, గొండు, గౌడు, మూకదొర, సవర, మాలి, రాణా, కుమ్మర వంటి భాషలకు లిపులను రూపొందించింది. ఆమె చేసిన కృషికిగాను ఇటీవల లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సులో ఆమెకు చోటు దక్కింది. ఏది ఏమైనా అనుకున్న పనిని సాధించడానికి ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా అలుపెరుగని పోరాటం సలిపి ఆమె విజేతగా నిలిచింది. (చిత్రం) ప్రసన్నశ్రీ

- బొండా రామకృష్ణ