సబ్ ఫీచర్

మహిళకు గౌరవం మాటలకే పరిమితమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘భజగోవిందమ్’ ముగింపు శ్లోకం మానవ జీవనానికి సరైన దిశానిర్దేశం చేస్తుంది. అందులోని అర్థాన్ని గ్రహించి ఆచరించగలిగితే మానవజన్మ చరితార్థం అవుతుంది. సుఖాలను ఆశించి మానవులు ఇంద్రియలోలురవుతారు. ఫలితంగా శరీరం రోగాలతో నిండిపోతుంది. మరణమే చివరకు శరణమైనా చాలామంది పాపాలు చేయడం మానరు. దేహాన్ని కేవలం భోగాలకే పరిమితం చేసి, జీవితాన్ని పాపాల పుట్టగా మార్చేస్తే అది మన పురోగతికి ప్రతిబంధకమవుతుంది. ఇక్కడ మానవ శబ్దానికి బదులుగా పురుష శబ్దాన్ని ఉంచి చూద్దాం. స్ర్తికి ప్రాధాన్యత, పవిత్రమైన పూజార్హతను కల్పించిన దేశం మన భారతదేశం. వేదాది ధర్మశాస్త్రాల్లో, ఉపనిషత్తుల్లో స్ర్తిమూర్తికి మహనీయమైన స్థానముంది. పరస్ర్తిని మాతృమూర్తితో సమానంగా చూడాలని అనాదిగా మన పెద్దలు చెబుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా మహిళలందరి పట్ల మర్యాద చూపాలన్నది శాస్తవ్రచనం. అయితే- నేటి ఆధునిక యుగంలో దేశం ఏ దిశలో పయనిస్తోంది? మహిళలకు ఎంతవరకూ గౌరవం దక్కుతున్నది? అని ఆలోచించవలసిన తరుణం ఇది. నైతిక విలువలకు ప్రాధాన్యం ఇచ్చినంతకాలం మన దేశం ఉన్నత శిఖరాలను అధిరోహించింది.
గతంలో తల్లులు ఉగ్గుపాలతో పిల్లలకు ఉన్నత విలువలను బోధించేవారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు బాలబాలికలను మంచి నడవడితో తీర్చిదిద్దేవారు. బ్రిటిష్ పరిపాలనలో మెకాలే విద్యా విధానానికి మన దేశంలో ప్రాధాన్యత ఇచ్చారు. విదేశీ పద్ధతితో నేర్పే చదువుల ద్వారా పిల్లలకు పరాయి సంస్కృతులే అబ్బుతాయి. వేప విత్తనం వేస్తే తీయని మామిడిపండ్లు లభిస్తాయా? వినయాన్ని, సౌహార్ర్దాన్ని, సమాజ శ్రేయాన్ని ఇచ్చే విద్య నేటితరం పిల్లలకు ఎంతో అవసరం. ‘డాలర్లను ఆర్జించే సాధనం విద్య’ అని మనం పసి మనసులను కలుషితం చేస్తున్నాం. అందువల్ల నేటి సమాజంలో నైతిక విలువలు మంటగలిసిపోతూ అనేక విపరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
భారత రాజ్యాంగం స్ర్తిలకు సమాన అవకాశాలను ప్రసాదించింది. మహిళల్లో అక్షరాస్యత పెరగడంతో నేడు అన్ని రంగాల్లోనూ వారికి కొంతమేరకు అవకాశాలు దక్కుతున్నాయి. సంపన్నవర్గాలు, చదువుకున్న మహిళలకు హోదా పెరిగింది. కానీ, వాస్తవ కోణంలో విశే్లషిస్తే ‘స్ర్తిని హింసించడం’ అనే ప్రవృత్తి ఇంకా పూర్తిగా సమసిపోలేదు. ఇందుకు కారణం- ‘స్ర్తిలను గౌరవించాలి’ అని చాలామంది పురుషులు భావించడం లేదు. మగువను కేవలం భోగ వస్తువుగా పరిగణిస్తున్నారు. మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యలు, గృహహింస వంటివి అధికమవుతున్నాయి. విద్యాధికులైన పురుషులు సైతం ఆడవారి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్న ఉదంతాలు అనేకం. బాలికలను అపహరించే సంఘ వ్యతిరేక శక్తులు విజృంభిస్తూనే ఉన్నాయి. మహిళల పట్ల అమర్యాదగా ప్రవర్తించడం నేరమని చాలామంది అనుకోవడం లేదు. మానవీయ గుణాలు అంతరించి, రాక్షస ప్రవృత్తులు ఎంతో బలంగా నాటుకున్నాయని అర్థం కావడం లేదా? ఇలాంటి విపత్కర పరిస్థితులను చట్టాలు మాత్రమే అరికట్టలేవని ఇప్పటికే తేటతెల్లమైంది. సామాజిక సంస్కరణ ద్వారానే దీన్ని నివారించగలం. సంస్కరణ అన్నది విద్య వల్లనే సాధ్యమవుతుంది. పిల్లలను చిన్నపుడే సాన పెట్టవలసిన బాధ్యత తల్లిదండ్రులది, కుటుంబానిది. ఆ తరువాత ఆ బాధ్యతను విద్యాలయాలు తీసుకోవాలి. అయితే, నేడు చాలావరకూ ఆ బాధ్యతను ఎవరూ తీసుకోనందున ముఖ్యంగా మగపిల్లలు ఆకతాయిలుగా పెరుగుతున్నారు. క్రమశిక్షణ, నైతిక విలువలు లోపించడం వల్లనే కొంతమంది యువకులు విశృంఖలంగా ప్రవర్తిస్తున్నారు. విచక్షణ లోపించడంతో నేర ప్రవృత్తికి అలవాటు పడుతున్నారు. ఫలితంగా మహిళలకు రక్షణ కరవవుతోంది. ప్రాచీన సాహిత్యంలో కొన్ని సందర్భాల్లో స్ర్తిమూర్తుల పట్ల వివక్షతో కూడిన కొన్ని రాతలు కనిపిస్తాయి. అయితే, అది మన సంస్కృతిలో భాగం కాదు. పురుషాధిక్యత ఫలితంగా శాస్త్ర విరుద్ధమైన ఆంక్షలు విధించి మహిళల్ని అనాదిగా వేదనకు గురిచేసిన మాట వాస్తవం. దీనికి కొన్ని పరాయి సంస్కృతులు కారణం. అన్ని అవస్థల్లోనూ స్ర్తికి రక్షణ అవసరం అనే మనువాక్యానికి కొందరు వక్రభాష్యం చెప్పారు.
మన రుషులు వచించినదేమిటి? స్ర్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ హింసించరాదు. గృహంలో స్ర్తి మహారాజ్ఞి. ఆర్థిక వ్యవహారాల్లో ఆమెకు ప్రాధాన్యతనివ్వాలి. అన్నకోశం ఆమె అధీనంలో ఉండాలి. స్ర్తిని పూజించాలి. ఆమెకు సమాజంలో మాతృస్థానం ఉండాలి. స్ర్తిలో అమంగళ భాగమే లేదు. ఆమె ఆపాదమస్తకము మంగళ స్వరూపిణి. పురుషుడు సంస్కారక్రియలతో శుచి కావలసి ఉంది. స్ర్తిమూర్తి సహజ శుభ స్వరూపిణి. ఆమె ఉన్న చోట సిరిసంపదలు, కళలు కొలువై ఉంటాయి. స్ర్తిని సంపాదన కోసం హింసించరాదు.
పురుషులతో సమానంగా చదువుకున్న మహిళలు వంటింటికే పరిమితం కావాలా? సమాన అధికారాలున్నపుడు వారిపై ఆంక్షలు విధించడం సమంజసం కాదు. మహిళ విద్యావంతురాలైతే ఆ కుటుంబంతో పాటు సమాజం కూడా పురోగతి సాధిస్తుంది. నేటి కాలంలో దంపతులిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నా, పిల్లల సంరక్షణ బాధ్యత నుంచి వారు తప్పించుకోలేరు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగైపోతున్నప్పటికీ, పిల్లలకు నైతిక విలువల గురించి బోధించేందుకు తల్లిదండ్రులే చొరవ చూపాలి. కాగా, ఎంతో ఉన్నతమైన మన సంస్కృతిని నేడు పలు వికృత ధోరణులు చీడపురుగుల్లా దొలిచివేస్తున్నాయి. స్ర్తిల మనఃక్షోభ కూడా సంస్కృతి ఈ క్షీణదశకు కొంత కారణం అని చెప్పకతప్పదు. స్ర్తిలను భోగవస్తువుగా పరిగణించే కుశ్చితపు మనస్తత్వంలో మార్పు రావాలి. ప్రభుత్వ శాసనాల ద్వారా ఈ మార్పు రాదు. స్ర్తిని గౌరవించే సంస్కారం పురుషులలో రావాలి. రాక్షస ప్రవృత్తి వినాశనానికి స్ర్తి సంఘటిత శక్తి ఎంతైనా అవసరం. అరాచకాలను ఎదిరించి పోరాడాలి. స్ర్తి శక్తి జాగృతం కాకుంటే రామరాజ్యాన్ని కాంక్షించే మనకు రాక్షస రాజ్యమే మిగులుతుంది. మన సంస్కృతిలోని స్ర్తి ఔన్నత్యాన్ని తెలుసుకుని ప్రతి వ్యక్తి నైతిక విలువలను పరిరక్షిస్తూ జగన్మాతృరూపాన్ని ఆరాధించే సంస్కారాన్ని పెంచుకోవాలి. మహిళల పట్ల మర్యాద చూపాలన్న భావన ఇంటి నుంచే ప్రారంభం కావాలి. ఈ విషయంలో మాతృమూర్తుల పాత్ర మహత్తరమైనది.

-గుమ్మా నిత్యకళ్యాణమ్మ