బిజినెస్

జైపూర్ ప్లాంట్‌లో ఏప్రిల్ నాటికి 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 21: ఆదిలాబాద్ జిల్లా జైపూర్ వద్ద నిర్మితమవుతున్న సింగరేణి ధర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టు ఈ ఏడాది ఏప్రిల్ నాటికి 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ ఎన్.శ్రీధర్ సింగరేణి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన జైపూర్ థర్మల్ విద్యుత్ ప్లాంటు నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో ప్రాజెక్టు పనులపై జరిగిన సమీక్షలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆకాంక్ష మేరకు ఈ ఏడాది ఏప్రిల్ నాటికి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించేందుకు అవసరమైతే మూడు షిఫ్టుల్లో రేయింబవళ్లు పని చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మార్చి నెల నాటికి మొదటి యూనిట్ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కావాలని అన్నారు. ప్లాంట్‌కు వినియోగించే నీటి రిజర్వాయర్ పనులను సిఎండి తనిఖీ చేశారు.
గోదావరి నది నుంచి సెట్‌పల్లి ద్వారా ఒక టిఎంసి నీరు సేకరణకు సంబంధించిన పైపులు వేసే పనులు పూర్తవడంపై చైర్మన్ సంతృప్తిని వ్యక్తం చేశారు. 14 ఎ.బి కనే్వయర్ బెల్టు పనిని పరిశీలించారు. ఇంకా సివిల్, మెకానికల్ పనులను కూడా ఆయన సందర్శించారు. థర్మల్ పవర్ ప్లాంటు ఆవరణలో తారు రోడ్ల నిర్మాణాన్ని సత్వరమే పూర్తి చేయాలని అన్నారు. బిహెచ్‌ఇఎల్ ఆధ్వర్యంలో పూర్తయిన బాయిలర్, టర్భైన్, జనరేటర్ పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కంట్రోల్ రూంను పరిశీలించి సింక్రనైజేషన్‌కు సంబంధించిన విషయాలపై అధికారులతో చర్చించారు. రోజూ వారీ లక్ష్యాలను చేసుకుని పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ విభాగాల అధికారులు సిఎండితో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.

కొవ్వాడ అణుపార్కుకు
రూ.300 కోట్లు విడుదల

శ్రీకాకుళం, జనవరి 21: శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేయనున్న అణువిద్యుత్ పార్క్ కోసం తొలి విడతగా 300 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారు. రణస్థలం మండలం కొవ్వాడలో అణువిద్యుత్ పార్క్ ఏర్పాటుకు సంబంధించి అన్ని సర్వేలు పూర్తయ్యాయి. గతంలో అణువిద్యుత్ పార్క్ ఏర్పాటుకు స్థానికుల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చినా ప్రస్తుతం అక్కడ అభివృద్ధి కుదుటపడటంతో స్థానికులు సానుకూలంగానే ఉన్నారు. ఈ పరిస్థితిలో వారికి పునరావాసం, నష్టపరిహారం త్వరితగతిన చేపడితే నిర్మాణం పనులు వేగంగా చేపట్టవచ్చునని అధికారులు భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో అణు ఇంధన సంస్థ అధికారులు కూడా కొవ్వాడకు ఆనుకొని ఉన్న గ్రామాల్లో సామాజిక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇటువంటి సమయంలో నిధులు మంజూరు చేస్తే అందరూ సహకరించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఇక్కడ నష్టపరిహారం, పునరావసానికి సంబంధించి అరకొరగా నిధులు విడుదల చేస్తే ఉపయోగకరంగా ఉండదని భావించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ పి లక్ష్మీనృసింహం.. మొత్తం 1200 కోట్ల రూపాయలు విడుదల చేయాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలు ఇచ్చారు. ఇది జరిగి సుమారు ఆరు నెలలు కావస్తున్నా నేటికీ ఒక్క పైసా కూడా విడుదల కాలేదు. సంక్రాంతి తరువాత నిధులు విడుదలవుతాయని కొవ్వాడ అణువిద్యుత్ పార్క్ ప్రాజెక్టు డైరెక్టర్ జి వెంకటరమేష్ పలుమార్లు చెప్పారు. నిధులు విడుదలకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని వారు చెప్పుకుంటూ వచ్చారు. అయితే గతంలో కలెక్టర్ ప్రతిపాదించిన రూ.1200 కోట్లకు గాను ముందస్తుగా 300 కోట్ల రూపాయలను విడుదల చేసినట్టు ఇక్కడి అధికారులకు సమాచారం వచ్చింది. ఇంకా ఎక్కువ మొత్తంలో నిధుల విడుదలకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పిడి వెంకటరమేష్ ‘ఆంధ్రభూమి’కి తెలిపారు. వీలైనంత త్వరలో నిధులు తెప్పించి నష్టపరిహారం, పునరావాసం పనులు పూర్తిచేస్తామని వెల్లడించారు. అయితే కొవ్వాడ, చిన్నకొవ్వాడ, రామచంద్రాపురం, గూడెం, టెక్కలి ప్రాంతాల్లో ప్రజలు మాత్రం 23 ఏళ్లుగా జరుగుతున్న ఈ తంతు ఎప్పటికీ కొలిక్కి వస్తుందోనని ఎదురుచూస్తున్నారు. కొవ్వాడలో అణువిద్యుత్ పార్క్ ఏర్పాటు చేస్తారో.. లేకపోతే పూర్తిగా విమరించుకుంటారో.. తేల్చి చెపితే తమ పనులు తాము చేసుకుంటామని ఇక్కడి మత్స్యకారులు అంటున్నారు.