హైదరాబాద్

వీడిన యువకుడి హత్యకేసు మిస్టరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్‌సుఖ్‌నగర్, జనవరి 21: మూడురోజుల క్రితం హత్యకు గురైన రహీమ్ కేసును చైతన్యపురి పోలీసులు ఛేదించారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను శనివారం చైతన్యపురి పోలీస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎల్‌బినగర్ ఎసిపి వేణుగోపాల్‌రావు వెల్లడించారు. న్యూమారుతీనగర్‌లో నివాసముండే రహీమ్(25) వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
ఇసామియా బజార్‌లో నివాసముండే నవీన్(23) ఫేస్ బుక్ ద్వారా రహీమ్‌కు పరిచయమయ్యాడు. దీంతో వీరిద్దరూ నిత్యం కలుసుకుంటూ మద్యం సేవించే వారు. ఈక్రమంలో నవీన్ ఈనెల 16న రహీమ్ నివాసముంటున్న గదికి వచ్చి ఇరువురూ మద్యం సేవించారు. నవీన్ ఆ సమయంలో రహీమ్ ప్రియురాలిని దూషించాడు. దీంతో వారిద్దరి మద్య ఘర్షణ నెలకొంది. రహీమ్ అతడిని దుర్భాషలాడి రోజులాగే నిద్రించాడు. రహీమ్‌పై కోపం పెంచుకున్న నవీన్ అతని వద్దనున్న డబ్బులను కాజేసి హత్య చేసేందుకు నిర్ణయించుకున్నాడు.
ఈ క్రమంలో గదిలో ఉన్న బండరాయితో రహీమ్ తలపై మోదాడు. అతను కదులుతుండగా దగ్గరలో ఉన్న వ్యాయామ డంబెల్‌తో తలపై చితకబాది హతమార్చాడు. అనంతరం దుర్వాసన వెదజల్లకుండా ఉప్పుచల్లి పరారయ్యాడు. రంగంలోకి దిగిన చైతన్యపురి పోలీసులు పెయింటర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా పేస్‌బుక్ ద్వారా నవీన్ పోలీసులను గుర్తించారు. సెల్‌ఫోన్ కాల్స్ ఆధారంగా అతని ఆచూకీని కనిపెట్టి శనివారం ఇసామియా బజార్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించారు. దీంతో నవీన్‌ను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ సమావేశంలో సిఐ గురురాఘవేంద్ర, ఎస్‌ఐ కోటయ్య తదితరులు ఉన్నారు.

స్వచ్ఛయాత్రలు మొదలు

పలు ప్రాంతాల్లో
మేయర్ పర్యటన

హైదరాబాద్, జనవరి 21: స్వచ్ఛ్భారత్ మిషన్ దేశవ్యాప్తంగా 500 నగరాల్లో చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంకును సాధించుకునేందుకు పాలక మండలి స్వచ్ఛయాత్రలు మొదలుపెట్టింది. శనివారం నుంచే ఈ యాత్రలను మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభించారు.
నగరంలోని వెంకటరమణ కాలనీ డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించి పలు ఇళ్లకు నేరుగా వెళ్లి కుటుంబ సభ్యులను కలిసి ఇప్పటికే ప్రతి ఇంటికి పంపిణీ చేసిన రెండు డస్ట్‌బిన్లలో ఒకదానిలో తడి, మరోదానిలో పొడి చెత్తను వేయాలని వివరించారు. ఈ సందర్భంగా మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ ఈ అంశంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు కొద్ది నెలలుగా విస్త్రృతంగా కార్యక్రమాలను చేపట్టామన్నారు. వచ్చే నెల 2వ తేదీ నుంచి మూడురోజుల పాటు నగరంలో స్వచ్ఛసర్వేక్షణ్‌లో భాగంగా పర్యటించనున్న కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖకు చెందిన అధికారుల బృందాన్ని ఆకట్టుకునేందుకు, ప్రజల్లో అవగాహనను పెంపొందించేందుకే ఈ యాత్రలను ప్రారంభించినట్లు తెలిపారు. అన్ని డివిజన్లలో కార్పొరేటర్లు స్వచ్ఛ యాత్రలు నిర్వహించి, ప్రజల్లో అవగాహనను పెంపొందించే అంశాన్ని బాధ్యతాయుతంగా తీసుకుని శ్రమించాలని సూచించారు.
జిహెచ్‌ఎంసి తరపును కూడా విస్తత్ర ప్రచారం కల్పించేందుకు గాను సుమారు 200 జిహెచ్‌ఎంసి హోర్డింగ్‌లను ప్రచారం కోసం వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేగాక, మాస్ జనాన్ని కూడా చైతన్యవంతులను చేసేందుకు గాను 25 లక్షల కరపత్రాలను ముద్రించాలని జిహెచ్‌ఎంసి భావిస్తున్నట్లు తెలిపారు.