హైదరాబాద్

రూ.5 భోజనం పేరు అన్నపూర్ణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 28: వృత్తి, విద్యా, ఉద్యోగానే్వషణతో పాటు వైద్యం కోసం నగరానికొచ్చే పేదలకు పట్టెడన్నం పెడుతున్న జిహెచ్‌ఎంసి రూ. 5ల భోజనం పేరును అన్నపూర్ణగా మార్చారు. అర్దాకలితో అలమటించే వారికి మధ్యాహ్నం కేవలం అయిదు రూపాయలకే భోజనం అందించాలన్న మహా సంకల్పంతో నాలుగేళ్ల క్రితం జిహెచ్‌ఎంసి ప్రారంభించిన ఈ స్కీం ఇపుడు 128 కేంద్రాలుగా విస్తరించింది. మొట్టమొదటి సారిగా నాంపల్లి సరాయిలో ఏర్పాటు చేసిన ఈ భోజన కేంద్రాలను క్రమంగా నిమ్స్ వంటి రోగులు ఎక్కువగా ఉండే ఆసుపత్రుల్లో, అలాగే అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయాల్లో పబ్లిక్ గార్డెన్స్‌లో కూడా ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం భోజనం కోసం ఎటు వెళ్లినా కనీసం రూ. 50 నుంచి వంద వరకు వెచ్చించాల్సి వచ్చేదని, నగరంలోని ఆసుపత్రులకు వైద్యం కోసం వచ్చిన తమకు ఒక రకంగా ఇది అదనపు ఆర్థిక భారమేనని, ఈ రూ. 5 భోజనం అందుబాటులోకి వచ్చిన తర్వాత తక్కువ ఖర్చుకే తాము చక్కటి ఆహారాన్ని ఆరగించగల్గుతున్నామని నిమ్స్ ఆసుపత్రిలోని కొందరు రోగుల సహాయకులు వ్యాఖ్యానించారు. ముఖ్యంగా జన సంచారమెక్కువగా ఉండే ప్రభుత్వ కార్యాలయాలు, రద్దీ కూడళ్లల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. గతంలో జిహెచ్‌ఎంసి నిర్ణయించిన విధంగా 50 కేంద్రాల్లో కొనసాగుతున్న ఈ భోజన కేంద్రాలను 150కి పెంచాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వీటి సంఖ్య అతి వేగంగా పెరుగుతోంది. తాజాగా మంగళవారం అంబర్‌పేట నియోజకవర్గంలోని అలీ కేఫ్, కాచిగూడ, చప్పల్‌బజార్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఈ భోజన కేంద్రాలను స్థానిక ఎమ్మెల్యే, బిజెపి శాసన సభ పక్ష నేత జి. కిషన్‌రెడ్డి ప్రారంభించారు. అంతేగాక, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్‌తో కలిసి అక్కడే భోజనం కూడా చేశారు. ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన 128 కేంద్రాల ద్వారా ప్రతిరోజు మధ్యాహ్నం దాదాపు 35వేల మందికి ఈ భోజనాన్ని అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇంత గొప్ప పథకాన్ని దేశంలో కేవలం జిహెచ్‌ఎంసి మాత్రమే అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. అంతేగాక, కేంద్రాల సంఖ్య, లబ్దిదారుల సంఖ్య ఎంత పెరిగినా భోజనంలో నాణ్యత ఏ మాత్రం తగ్గకుండా హరేరామ హరేకృష్ణామూవ్‌మెంట్ సరఫరా చేసేలా జిహెచ్‌ఎంసి ఒప్పందం చేసుకోవటం విశేషం.
త్వరలోనే మరో 22 కేంద్రాలు
ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు 150 భోజన కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన జిహెచ్‌ఎంసి మంగళవారం నాటికి 128 కేంద్రాలను ప్రారంభించింది. త్వరలో మరో 22 కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు జిహెచ్‌ఎంసి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. కేంద్రాలను ఏర్పాటు చేసే ప్రాంతాలకు ప్రత్యేక ప్రామాణికాలను నిర్ణయించి, ఆ బాధ్యతలను స్థానిక సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లకు అప్పగించారు. త్వరలోనే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ భోజన కేంద్రాల సంఖ్య 150కి పెరగనున్నట్లు అధికారులు తెలిపారు.