హైదరాబాద్

ముంచుకొస్తున్న ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 24: నగరానికి మళ్లీ వరద ముప్పు ముంచుకొస్తోంది. పదిహేడేళ్ల క్రితం నగరాన్ని వరదలు ముంచెత్తినపుడు మున్ముందు ఇలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తకుండా కిర్లోస్కర్ కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయటంలో కూడా జిహెచ్‌ఎంసి అధికారులు మీన మేషాలు లెక్కిస్తున్నారు. ముఖ్యంగా స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత స్వపరిపాలనలో నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దటంలో భాగంగా వరద ముప్పు లేకుండా నాలాలపై వెలసిన ఆక్రమణలను తొలగించి, వాటిని విస్తరించేందుకు చర్యలు చేపడుతామని ప్రకటించి నెలలు గడుస్తున్నా, నేటికీ అతీగతీలేదు. సర్వే సమయంలో చేసిన హడావుడి ఆక్రమణలను తొలగించేందుకు కనబర్చటం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కొద్దినెలల క్రితం నగరాన్ని వర్షాలు ముంచెత్తినపుడు నగరంలోని నాలాలపై వెలసిన ఆక్రమణలను తొలగించేందుకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ప్రత్యేకంగ సర్వే చేయించిన ప్రభుత్వం నాలాలను గుర్తించినా, నేటికీ వాటిలో ఒక్కటి కూడా తొలగించలేదు. ఆక్రమణలను యుద్దప్రాతిపదికన తొలగించేందుకు నీటిపారుదల, జోన్ జిహెచ్‌ఎంసి, రెవెన్యూ అధికారులు కలిసి ఆగమేఘాలపై సర్వే నిర్వహించి నగరంలోని 173 ప్రధాన నాలాలపై మొత్తం 12వేల 182 ఆక్రమణలున్నట్లు గుర్తించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా డ్రోన్ కెమెరాలను వినియోగించి, పది మీటర్ల కన్నా ఎక్కువ విస్తీర్ణం కల్గిన నాలాలకు ఇరువైపులా మూడు మీటర్ల చొప్పున వర్కింగ్ విడ్త్ ఆధారంగా, పది మీటర్ల విస్తీర్ణం ఉన్న నాలాకు ఇరువైపులా రెండుమీటర్ల వర్కింగ్ విడ్త్ ప్రాతిపదికన ఈ సర్వే నిర్వహించారు. దీంతో పాటు గుర్తించిన ఆక్రమణలను వివరాలను భధ్రపరిచేందుకు గాను జిఐఎస్ విభాగం, ఆటోక్యాడ్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి, నాలా మొత్తం పొడువును భాగాలుగా విభజించి కొలతలు నమోదు చేశారు. అంతేగాక, నాలాల టోపోశీట్స్, రిమోట్ సెన్సింగ్ శాఖ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఉపగ్రహా చిత్రాలను ఉపయోగించి ఎంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేసిన సర్వే మున్నాళ్ల ముచ్చటగానే మారిందని చెప్పవచ్చు. ఆక్రమణలను గుర్తించిన వెంటనే తొలగించనున్నట్లు మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె. తారకరామారావు ప్రకటించినా, నేటికీ ఒక్క ఆక్రమణను కూడా తొలగించలేదు. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఎంతో విలువైన తమ సమయాన్ని వెచ్చించి చేసిన సర్వే నివేదిక కూడా అటకెక్కిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేగాక, ఈ సర్వేకు ముందు నాలాలను గుర్తించే అంశంపై వివిధ జిహెచ్‌ఎంసిలోని టౌన్‌ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగం అధికారులకు ప్రత్యేకంగా శిక్షణను కూడా ఇప్పించి హడావుడి చేసిన అధికారులు ఇపుడు ఆక్రమణల తొలగింపు అంశాన్ని పట్టించుకోకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. మరోవైపేమో ఇపుడు ఎండలు దంచికొట్టిన మాదిరిగానే మున్ముందు వర్షాకాలం ప్రారంభంలోనే భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హెచ్చరికలొస్తున్నాయి. సుమారు 390 కిలోమీటర్ల పొడువున్న ఈ నాలాలపై ఆక్రమణలు తొలగించలేదన్న విమర్శలు వెల్లువెత్తుతుండగా మరో వైపు స్వచ్ఛ్భారత్‌లో భాగంగా ఈ ఆక్రమణల్లో మరుగుదొడ్లను కూడా నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.