హైదరాబాద్

బోనాలకు రూ. 10 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ / బేగంపేట, జూన్ 19: ఆషాఢ మాసంలో తెలంగాణ ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకొనేందుకు వీలుగా ప్రభుత్వం ఈ సంవత్సరం రూ. పది కోట్లను మంజూరు చేసింది. తొలుత గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక అమ్మవారికి తొలి తొట్టెలను సమర్పించటంతో మొదలై, నెలరోజుల పాటు కొనసాగే ఈ జాతరకు భారీగా ఏర్పాట్లు చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. జంటనగరాల ప్రజలే గాక, ఇరుగుపొరుగు జిల్లాల నుంచి కూడా వేలాది మంది హజరయ్యే ఈ బోనాల పండుగ ఏర్పాట్ల కోసం ప్రభుత్వం రూ. పది కోట్లను మంజూరు చేసిందని, అవసరమైతే మరో పది కోట్లు మంజూరు చేయాలని సిఎం కెసిఆర్‌ను కోరనున్నట్లు మంత్రులు పద్మారావు, తలసాని శ్రీనివాసయాదవ్‌లు వెల్లడించారు. జాతరలో భాగంగా వచ్చే నెల 9, 10వ తేదీల్లో జరగనున్న సికిందరాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర ఏర్పాట్లపై మంత్రులు సోమవారం వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులతో మహంకాళి ఆలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు తలసాని, పద్మారావులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మూడు సంవత్సరాల నుంచి బోనాల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించి, అత్యంత వైభోపేతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇరవై సంవత్సరాల నుంచి ఉజ్జయినీ మహంకాళీ బోనాల జాతరను చూస్తున్నానని, ప్రతి సంవత్సరం ఎలాంటి ఆటుపోట్లు, లోపాల్లేకుండా అమ్మవారి అనుగ్రహం ఫలితంగా ఉత్సవాలు ప్రశాంతంగా జరుగుతున్నాయని మంత్రి పద్మారావు వివరించారు. ఊరేగింపులకు డిజెలను అనుమతించే విషయాన్ని మరోసారి పరిశీలిస్తామని ఆయన వివరించారు. ఈ విషయానికి సంబంధించి త్వరలోనే ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసి చర్చించనున్నట్లు తెలిపారు. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ ఈ సారి సకాలంలో వర్షాలు కురవటం వల్ల అమ్మవారికి మొక్కలు తీర్చుకునేందుకు, అమ్మవారి ఆశీస్సులు తీసుకునేందుకు గత సంవత్సరం కన్నా ఈ ఈసారి భక్తులు మరింత అత్యధిక సంఖ్యలో వచ్చే అవకాశముందని, అధికారులు కాస్త ముందుగానే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రెండురోజుల పండుగలో బోనాల, ఫలహారం బండ్ల ఊరేగింపులు, అంబారీపై అమ్మవారి ఊరేగింపులు నిర్వహించనున్నట్లు, ఇప్పటికే ఊరేగింపునకు సంబంధించి అధికారులతో చర్చించినట్లు తెలిపారు. బోనాల రోజు గర్భగుడిలో సేవలందించేందుకు పదిహేను మంది వలంటీర్ల బృందాన్ని నియమించనున్నట్లు తెలిపారు. ఈ సమీక్షలో జోనల్ కమిషనర్ విజయరాజ్, ఆలయ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ అన్నపూర్ణ, డిసిపి సుమతి, స్థానిక కార్పొరేటర్లు అరుణగౌడ్, ఆకుల రూప, హేమలత తదితరులు హాజరయ్యారు. జాతరలో భాగంగా 8వేదికలను ఏర్పాటు చేసి ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలను నిర్వహించనున్నట్లు తెలిపారు.

యశస్వినిశ్రీ కూచిపూడి నృత్య సౌరభం
హైదరాబాద్, జూన్ 19: అభినయానికి ప్రాధాన్యత కలిగిన తెలుగువారి అపురూప కూచిపూడి నృత్యం పామరులను సైతం రంజింపకలిగే విధంగా భామా కలాపం అంశంపై పరిశోధన చేసి పిహెచ్‌డి పొందిన డాక్టర్ మద్దాళి ఉషా గాయత్రి నృత్య శిక్షణాలయం ‘నృత్య కినె్నర’ 33వ వార్షికోత్సవ నృత్యోత్సవంలో భాగంగా సోమవారం సాయంత్రం రవీంద్రభారతిలో యశస్వినిశ్రీ తన హస్త పాద విన్యాసాల అభినయ మందారాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆరభి రాగంలో ఉత్తుకాడే వెంకట సుబ్బయ్య కృతి ‘మరకత మణిమయ చేలా..’ కార్యక్రమానికి హైలెట్. ఈ అంశంలో నర్తకి పళ్లెంలో కాళ్లు ఉంచి జతులను లయబద్ధంగా నర్తించి ప్రేక్షకుల అభినందనలు అందుకుంది. నాట రాగంలో ముత్తుస్వామి దీక్షితార్ కృతితో ప్రారంభించి మంగళంపల్లి బాల మురళీకృష్ణ విరచిత పదవర్ణాన్ని షణ్ముఖ ప్రియ రాగంలో గాయని వెంపటిటి శ్రీవల్లీ శర్మ ఆలపించగా గురువు ఉషా గాయత్రి నట్టువాంగానికి అనువైన పద విన్యాసంతో యశస్వినిశ్రీ న ర్తించింది. కరహర ప్రియ రాగంలో పెద్దతిరుమలాచార్య రచన ‘ఒకపరి ఒకపరి...’ అంశంతో పాటు బాల మురళీ కృష్ణ విరచిత థిల్లాన అంశాన్ని బృందావని సారంగి రాగంలో సాహిత్యానికి లయబద్ధంగా చిన్నారి నృత్యం చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తమిళనాడు పూర్వ గవర్నర్ కొణిజేటి రోశయ్య యశస్వినిని ఆశీర్వదించారు. ఎంతోమంది శిష్యులను పరిచయం చేస్తూ ప్రదర్శనలు ఇప్పించి చిన్నారులను కళాకారులుగా తీర్చిదిద్దుతున్న నాట్యాచారిణి ఉషాగాయత్రిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య ఎన్.గోపి, పారిశ్రామిక వేత్త లయన్ విజయకుమార్‌లు పాల్గొని చిన్నారి యశస్వినిని అభినందించగా సంస్థ అధ్యక్షులు ఆర్.ప్రభాకరరావు స్వాగతం పలికారు.
కృష్ణం కలయ సఖి
కూచిపూడి నృత్య విభావరికి ప్రారంభంలో శివప్రియ, శ్రీచక్రి తీర్థ, హర్షిత, శిరీషలు ప్రదర్శించిన స్వాగత నృత్య కదంబం ప్రేక్షకులను అలరించింది. ముఖారి రాగంలో నారాయణ తీర్థుల తరంగం ‘కృష్ణం కలయసఖి..’ అంశం ప్రేక్షకులను రంజింప చేసింది. ఈ అంశం ‘కస్తూరి తిలకం లలాట ఫలకే అంటూ ప్రారంభమై ‘కృష్ణం కలయసఖీ సుందరం’ అనే సాహిత్యంతో శృంగార రస సంగీత సాహిత్య అంటూ రమ్యంగా నర్తించారు. ధన్యాసి రాగంలో ‘నమశ్శివాయతే’ అంటూ ఆధ్యాత్మ రామాయణ కీర్తనతో పాటు బిళహరి రాగంలో రామదాసు కీర్తనను చిన్నారులు అభినయించి అతిథుల ఆశీర్వాదం అందుకున్నారు.