హైదరాబాద్

విక్రమ్‌గౌడ్ కాల్పుల కేసులో ఇద్దరి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 20: మాజీ మంత్రి తనయుడు, కాంగ్రెస్ యువ నేత విక్రమ్‌గౌడ్ ఇంట్లో జరిగిన కాల్పుల కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం అరెస్టయిన వారిలో అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం తూపల్లి గ్రామానికి చెందిన మంచింటి వెంకటరమణ (38), కదిరి మండలం నిజాముల్ కాలనీకి చెందిన షేక్ మహమ్మద్ గౌస్ (44)లు ఉన్నారు. గత నెల 12న విక్రమ్‌గౌడ్‌పై ఆయన ఇంట్లోనే కాల్పులు జరిగిన సంఘటన తెలిసిందే. అయితే కాల్పులు జరిగిన రోజు నుంచి వీరిద్దరూ పరారీలో ఉన్నారని, వీరిని పట్టుకునేందుకు రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు ఎట్టకేలకు బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.

పారిశ్రామిక వేత్తకు బెదిరింపు కాల్స్

హైదరాబాద్, సెప్టెంబర్ 20: హైదరాబాద్‌కు చెందిన ఓ పారిశ్రామిక వేత్తకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. గుర్తు తెలియని దుండగుడు రూ. 80 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. పారిశ్రామిక వేత్త, అతని కుటుంబీకులకు చెందిన బాత్‌రూమ్‌లోని చిత్రాలు తన వద్ద ఉన్నాయని, తాను డిమాండ్ చేసిన రూ. 80 లక్షలు ఇవ్వకపోతే.. వీడియో చిత్రాలను వాట్సాప్, ఇంటర్నెట్‌లో పెడతానని బెదిరిస్తూ బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నాడు. అదనపు టాస్క్ఫోర్స్ కమిషనర్ శశిధర రాజు తెలిపిన వివరాలిలావున్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఓ పారిశ్రామిక వేత్త ముంబయి ప్రధాన కార్యాలయం నుండి చాలా కాలంగా వ్యాపారం చేస్తున్నాడు. అతనికి దేశవ్యాప్తంగా క్లయింట్‌లున్నారు. ఫోన్ ద్వారా ఆర్డర్ ఇస్తే సరుకులు సరఫరా చేస్తాడు. అయితే గత రెండురోజులుగా ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. నీ బాత్‌రూంలో సిసికెమెరాలు అమర్చానని, నీవు, నీ కుటుంబ సభ్యుల బాత్రూమ్ వీడియో చిత్రాలు నా వద్ద ఉన్నాయని, రూ. 80 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయసాగాడు. దీంతో సదరు పారిశ్రామిక వేత్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం నిందితుడు శరత్‌కుమార్ సాహు (33)ను జూబ్లిబస్ స్టేషన్ వద్ద అరెస్టు చేశారు.
ఫోన్ కాల్ ఎందుకు చేశాడంటే...
ఒరిస్సాకు చెందిన శరత్‌కుమార్ సాహు 2001లో హైదరాబాద్‌కు వచ్చి సెంట్రింగ్ లేబర్‌గా పనిచేస్తున్నాడు. 2008 నుంచి నగరంలోని ఎస్‌ఎంఆర్ కన్‌స్ట్రక్షన్స్‌లో ఎలక్ట్రిషియన్‌గా కూడా పనిచేస్తున్నాడు. 2012లో మనోజ్ వి పర్మార్‌తో పరిచయం ఏర్పడింది. కాగా అతను శరత్‌కుమార్‌కు ఎలక్ట్రిషియన్ వర్కు కాంట్రాక్టుకు ఇచ్చాడు. రూ. 1,60,000లకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. రెండు నెలల్లో పని పూర్తి చేయగా మనోజ్ అతనికి రూ. 1,30,000 ముట్ట జెప్పాడు. మిగతా రూ. 30,000లకు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాడు. కాగా డబ్బుల కోసం శరత్‌కుమార్ ఓ పథకం వేశాడు. తన ఫోన్ నెంబర్ 7329942821తో తనకు రూ. 80 లక్షలు ఇవ్వాలని, లేనిపక్షంలో మీ కుటుంబానికి చెందినవారి బాత్ రూమ్ వీడియో చిత్రాలు తన వద్ద ఉన్నాయని అసభ్య భాషణలో మెస్సేజ్ పెడుతూ, బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా టాస్క్ఫోర్స్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసినట్టు డిప్యూటి టాస్క్ఫోర్స్ కమిషనర్ శశిధర్ రాజు తెలిపారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితడు శరత్‌కుమార్‌ను రాంగోపాల్‌పేట్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.
పాతబస్తీలో షా (షే)క్
ఆగని ఒప్పందపు పెళ్లిళ్లు తాజాగా వెలుగు చూసిన మరో దారుణం

హైదరాబాద్, సెప్టెంబర్ 20: రోజుకి రెండు పూటలు కడుపు నిండా తినే ఆర్థికస్తోమత లేని కుటుంబాల్లో అందంగా జన్మించటమే పాతబస్తీ అమ్మాయిల పాలిట శాపంగా మారుతోంది. విప్లవాత్మక మార్పులతో సాంకేతిక పరిజ్ఞానం శేరవేగంగా అభివృద్ధి చెందుతున్నా, పాతబస్తీ మాత్రం అభివృద్ధికి ఇంకా చాలా దూరంలోనే ఉంది. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నామంటూ పాలకులు చేసే ప్రకటనలు అవాస్తవాలని చెప్పేందుకు పాతబస్తీ ప్రజల ఆర్థిక స్థితిగతులే ఇందుకు నిదర్శనం.
కుటుంబ పోషణ మోయలేని బరువుగా మారటం, నిరక్షరాస్యత పెరగపోవటం కూడా ఈ ఒప్పంద పెళ్లిళ్లకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. దాదాపు ఆరుపదుల వయస్సు నిండిన ఎనిమిది మంది అరబ్ షేక్‌లు ఒప్పందపు పెళ్లిళ్లు చేసుకునేందుకు పాతబస్తీకి వచ్చి పోలీసులకు చిక్కిన సంఘటన సంచలనాన్ని సృష్టించింది. వారికి సహకరించిన వారు సైతం కటకటాలపాలయ్యారు. ఈ అరబ్ షేక్‌లు ఎక్కువగా పధ్నాలుగేళ్ల నుంచి ఇరవై, ఇరవై రెండేళ్ల వయస్సు కలిగిన అమ్మాయిలను వివాహం చేసుకుని, గల్ఫ్ తీసుకెళ్తారు. ఆ తర్వాత వారి చేతుల్లో అమ్మాయిలు అనేక రకాల చిత్రహింసలకు గురవుతున్న సంఘటనలెన్నో ఉన్నాయి. గతంలో కూడా ఇదే రకంగా కాంట్రాక్టు మ్యారేజీ కోసం యత్నించిన మరో షేక్‌ను రెయిన్ బజార్ పోలీసులు పట్టుకున్నారు. సుమారు నాలుగైదు దశాబ్దాలుగా పాతబస్తీని పట్టి పీడిస్తున్న ఈ బాల్య వివాహాలు, గల్ఫ్ షేక్‌లకు అమ్మాయిలను అమ్ముకోవటం వంటి విష సంస్కృతి మరో సారి బయట పడింది. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు బాల్య వివాహాలు, కాంట్రాక్టు మ్యారేజీలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేసిన కృషి ఫలించి, పాతబస్తీలో గడిచిన దశాబ్దం నుంచి పరిస్థితి కొంత మెరుగుపడుతున్నా, ఎప్పటికపుడు దళారులు పుట్టుకొస్తూ, వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతోంది.
దళారులదే కీలక పాత్ర
పాతబస్తీలో నివసించే వారిలో ఆర్థికంగా వెనకబడి ఉన్న వారిని, పెద్ద కుటుంబం పోషణ భారమైన వారిని టార్గెట్ చేసుకుని పెళ్లిళ్ల పేరిట అమాయకమైన అమ్మాయిలను అరబ్ షేక్‌లకు విక్రయించటంతో దళారులదే కీలక పాత్రగా కన్పిస్తోంది. తాజాగా చిక్కిన ఎనిమిది అరబ్ షేక్‌లకు సైతం ఎనిమిది మంది సహకరించటం ఇందుకు నిదర్శనం. ఆర్థిక స్తోమత లేని కుటుంబాల్లో జన్మించిన అభాగ్యపు అమ్మాయిలకు వారి అందమే ఓ శాపంగా మారుతోంది. కొద్ది నెలల క్రితం శివార్లలోని ఓ రిసార్ట్‌లో మైనర్ బాలికను వివాహం చేసుకునేందుకు యత్నించిన షేక్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తాజాగా మరో షేక్‌ను పట్టుకున్నారు. గల్ఫ్ షేక్‌లు, సొమిలియన్లు ఇక్కడి ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుని మైనర్ బాలికలను తమ కోర్కెలు తీర్చే వస్తువులుగా వినియోగించుకుంటున్నారు. డబ్బున్న షేక్‌లు తమ అమ్మాయిని వివాహం చేసుకుని తీసుకెళ్లి, అక్కడ సాంప్రదాయబ్దంగా కాపురం చేస్తారని ఇష్టంలేకున్నా, ఈ కాంట్రాక్టు మ్యారేజీలకు ఒప్పుకుంటున్న తల్లిదండ్రులు భావిస్తున్నారు. జీవితాంతం భాగస్వామిగా చూసుకుంటానని నమ్మబలికిన కొందరు షేక్‌లు కాంట్రాక్టు మ్యారేజీలు చేసుకుని వారి దేశానికి తీసుకెళ్లిన యువతుల జీవితాలను బుగ్గిపాలు చేస్తున్నారు. వీటిని అరికట్టేందుకు పోలీసులు తొలుత తల్లిదండ్రులకు ప్రత్యేకంగా కౌనె్సలింగ్ చేయటంతో పాటు సొంత ప్రయోజనాల కోసం ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న దళారుల ఆటకట్టించాలని పాతబస్తీ ప్రజలు కోరుతున్నారు.
ఉక్రెయిన్ సముద్రం మింగేసింది

నగర విద్యార్థి దుర్మరణం
కుంట్లూర్‌లో విషాద ఛాయలు

హయత్‌నగర్, సెప్టెంబర్ 20: ఉక్రెయిన్‌లో కుంట్లూరు వైద్య విద్యార్థి మృతి చెందాడు. ఉన్నత చదువులకు ఉక్రెయిన్ వెళ్లిన యువకుడు శివకాంత్ రెడ్డి ప్రమాదవశాత్తు సముద్రంలో దుర్మరణం పాలయ్యాడు. విద్యార్థి మృతితో హయత్‌నగర్ మండలం కుంట్లూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. నగరశివారులోని పెద్దఅంబర్‌పేట్ నగర పంచాయతీ కుంట్లూర్‌కు చెందిన పిన్నింటి జంగారెడ్డి, పద్మ దంపతుల కుమారుడు శివకాంత్‌రెడ్డి ఎంబిబిఎస్ చదివేందుకు ఉక్రెయిన్ వెళ్లాడు. మంగళవారం స్నేహితులతో కలిసి సముద్రం వద్ద బీచ్‌లో వాలిబాల్ ఆడుతుండగా బాల్ సముద్రంలో పడిపోయింది. దానిని తీసుకునే ప్రయత్నంలో శివకాంత్‌రెడ్డి స్నేహితుడు సముద్రంలో పడిపోయాడు. అతణ్ని రక్షించేందుకు శివకాంత్ రెడ్డి కూడా సముద్రంలో గల్లంతై ఇద్దరు మృతి చెందారు. సమాచారం తెలిసిన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో ముగినిపోయారు. మెడిసిన్ చదివేందుకు వెళ్లిన శివకాంత్‌రెడ్డి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

అడగక ముందే జీతాలు పెంచటం అదృష్టం

టిఆర్‌ఎస్‌కెవి జిహెచ్‌ఎంఈయు
అధ్యక్షుడు ఊదరి గోపాల్

హైదరాబాద్, సెప్టెంబర్ 20: జిహెచ్‌ఎంసి పరిధిలో కాంట్రాక్టు, అవుట్ సోర్సు ప్రాతిపదికన కీలకమైన విధులు నిర్వహిస్తున్న వివిధ విభాగాల్లోని కార్మికులు అడగకపోయినా ప్రభుత్వం జీతాలు పెంచటం వారి అదృష్టమని టిఆర్‌ఎస్‌కెవి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు ఊదరిగోపాల్ హర్షం వ్యక్తం చేశారు. పారిశుద్ద్య, ఎంటమాలజీ తదితర విభాగాలకు చెందిన కార్మికుల జీతాలను పెంచుతూ ప్రభుత్వం జివో జారీ చేసిన సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ కేవలం సంవత్సర కాలంలో మూడుసార్లు జీతాలు పెంచటం ప్రభుత్వానికి కార్మికులపై ఉన్న అభిమానానికి నిదర్శనం అని వ్యాఖ్యానించారు. మళ్లీ తాజాగా దసరా పండుగకు ముందు జీతాలు పెంచటం పట్ల కార్మికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని ఆయన వివరించారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్ నగరం అగ్రస్థానంలో నిలపటానికి ప్రధాన కారణమైన పారిశుద్ద్య కార్మికులకు జీతాల పెంపుతో ముఖ్యమంత్రి వారికి సరైన గుర్తింపునిచ్చారని వ్యాఖ్యానించారు. వారు కూడా వచ్చే సంవత్సరం నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జిహెచ్‌ఎంసిని అగ్రస్థానంలో నిలిపేందుకు తమవంతు కృషి చేస్తారని గోపాల్ వ్యాఖ్యానించారు. జిహెచ్‌ఎంసి పరిధిలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ఆరోగ్యభద్రత కల్పించేందుకు గాను హెల్త్ ఇన్స్యూరెన్స్ కార్డులు కల్పించాలని ఇటీవలే కమిషనర్ జనార్దన్ రెడ్డిని కలిసి కోరినట్లు, అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు ఆయన వివరించారు. ఉద్యోగులు, కార్మికుల సమస్యలను పరిష్కరించటంలో ఎపుడూ ముందుండే తమ యూనియనే త్వరలో జరగనున్న గుర్తింపు ఎన్నికల్లో గెలుస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
తహశీల్ కార్యాలయంలో పాము కలకలం
కొందుర్గు, సెప్టెంబర్ 20: తహశీల్దార్ కార్యాలయంలో పాము కలకలం సృష్టించింది. బుధవారం కొందుర్గు తహశీల్దార్ కార్యాలయంలోకి పాము ప్రవేశించడంతో తహశీల్దార్ ప్రమీలరాణితోపాటు సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. దాంతో రెండు గంటల పాటు బయట ఉండిపోయారు. విఆర్‌ఏలు కార్యాలయంలో వెళ్లి పాము ఉన్న గదిని గుర్తించి అందులోకి వెళ్లి వేతికి చంపేశారు. దాంతో ఊపిరిపీల్చుకున్న రెవిన్యూ అధికారులు కార్యాలయంలోకి వెళ్లారు. కార్యాలయం చట్టూ కంపచెట్లు ఉండటం వల్లే పాము వచ్చి ఉండవచ్చునని తహశీల్దార్ ప్రమీలరాణి వివరించారు. పామును చంపివేసినప్పటికీ కార్యాలయ సిబ్బందిలో మాత్రం భయాందోళన తగ్గలేదు. ఏది ఏమైనప్పటికీ పాము కార్యాలయంలోకి వచ్చి ఒక్కసారిగా కలకలం సృష్టించింది.
అటవీ అధికారులకు
నెమలి అప్పగింత
కొడంగల్, సెప్టెంబర్ 20: అనారోగ్యంతో బాధ పడుతున్న జాతీయపక్షిని రైతులు కొడంగల్ అటవీ అధికారులకు బుధవారం అప్పగించారు. బొంరాస్‌పేట మండలం దుద్యాల గ్రామంలోని రైతుల పొలాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న నెమలి కనిపించింది. దీంతో రైతులు అటవీ అధికారులకు సమచారం అందించారు. సెక్షన్ అధికారి చక్రధర్‌గౌడ్ సిబ్బంది కలిసి అనారోగ్యంతో ఉన్న నెమలిని కొడంగల్ పశు వైద్యశాలలో చికిత్స అందించారు. అనంతరం నెమలిని అడవిలో వదిలిపెట్టారు.

ప్రజా వ్యతిరేక విధానాలపై
ఉద్యమించాలి: చాడ
కీసర, సెప్టెంబర్ 20: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తీవ్ర స్ధాయిలో ధ్వజమెత్తారు. బుధవారం కీసరలోని లలిత ఫంక్షన్‌హాల్‌లో సిపిఐ మేడ్చల్ జిల్లా జన సేవాదళ్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరగనున్న తెలంగాణ రాష్ట్ర స్ధాయి శిక్షణా శిభిరాలను చాడ వెంకట్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన వాగ్దానాల్లో కేసీఆర్ ఏఒక్క హామీ నెరవేర్చలేదని అన్నారు.
దళితులకు మూడు ఎకరాలు భూమి, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు కల్పిస్తామన్న కేసీఆర్ మాట తప్పారన్నారు. మిషన్‌భగీరధ, మిషన్‌కాకతీయ పేర్లతో కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయలు దోచిపెడుతున్నారని ఆరోపించారు. ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సిపిఐ పార్టీ ఉద్యమిస్తుందన్నారు. సంక్షేమ పధకాల్లో అవినీతి చోటు చేసుకుంటుందని విమర్శించారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్. బాలమల్లేశ్, డాక్టర్ సుధాకర్, సిపిఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి జి.ఐలయ్య, సహాయ కార్యదర్శి ధశరధ్, నాయకులు సాంబశివరావు, జ్యోతి, విఎస్. బోస్, సుధాకర్, నర్శింహ, సాయిలుగౌడ్, రాములుగౌడ్, నర్సింహలు పాల్గొన్నారు.

మహిళలకు అవమానమే..!

బతుకమ్మ చీరలపై న్యాయవిచారణ * బిజె మహిళా మోర్చా డిమాండ్

హైదరాబాద్, సెప్టెంబర్ 20: బంగారు బతుకమ్మ పేరుతో నాసిరకం చీరలను పంచి ప్రభుత్వం మహిళలను అవమానపరిచిందని, ఈ వ్యవహారంపై న్యాయవిచారణ జరిపించాలని బిజెపి మహిళ అధ్యక్షురాలు ఆకుల విజయ డిమాండ్ చేశారు. బుధవారం నాడు ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ బంగారు బతుకమ్మ కాదని తమకు కావల్సింది తంగేడుపూల బతుకమ్మ కావాలని అన్నారు. బంగారు తెలంగాణ, బంగారు బతుకమ్మ అంటే చీరలు పంచడం కాదని, బంగారు బతుకమ్మ రోజురోజుకీ గడీలకే పరిమితం అవుతోందని ఎద్దేవా చేశారు. గోల్కొండలో భారీ ఎత్తున బిజెపి బతుకమ్మ నిర్వహించనుందని అన్నారు. 2017 బతుకమ్మ మరిచిపోలేని బాధాకరమైన పండుగగా ప్రభుత్వం మార్చేసిందని ఆరోపించారు. మద్యం అమ్మకాలపై ఉన్న ఆలోచన ప్రభుత్వానికి మహిళల చీరలపై లేకపోవడం దారుణమని అన్నారు.
బిజెపి అంటే గుబులు
టిఆర్‌ఎస్ పార్టీకి బిజెపి అంటే గుబులు పుడుతోందని బిజెపి అధికార ప్రతినిధి ఎన్ వి సుభాష్ పేర్కొన్నారు. నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గానికి గుత్తా సుఖేందర్‌రెడ్డితో రాజీనామా చేయిస్తామని పత్రికలకు లీకు ఇచ్చిన తర్వాత సర్వే చేయించుకుంటేద టిఆర్‌ఎస్ ఓటమి ఖాయమని తేలిందని దాంతో టిఆర్‌ఎస్‌కు బిజెపి ఫోబియో పట్టుకుందని పేర్కొన్నారు. నల్గొండ ఎన్నికలు ఎపుడు జరిగినా బిజెపి విజయం ఖాయమని చెప్పారు. టిఆర్‌ఎస్ నేతలు అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని, రాష్ట్రప్రభుత్వం అమలుచేస్తున్న అన్ని పథకాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం వాటా ఉందన్న విషయాన్ని మరువరాదని అన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి అక్కున చేర్చుకుంటున్న టిఆర్‌ఎస్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. జాతీయ స్థాయి నాయకుల గురించి మాట్లాడేటపుడు విజ్ఞత అవసరమని, సంస్కారంతో జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉన్నా అదేమీ లేకుండానే టిఆర్‌ఎస్ నేతలు మాట్లాడుతున్నారని అన్నారు.
నేడు కొత్తగూడెం పర్యటన
అక్టోబర్ 5వ తేదీన జరిగే సింగరేణి కార్మికుల సంఘం ఎన్నికల్లో భారతీయ మజ్దూర్ సంఘ్‌కు మద్దతుగా బిజెపి శాసనసభాపక్ష నాయకుడు జి కిషన్‌రెడ్డి 21, 22 తేదీల్లో భద్రాద్రి -కొత్తగూడెం జిల్లాలో పర్యటిస్తారు. 21న సాయంత్రం కొత్తగూడెంలో బిజెపి- బిఎంఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. 22న ఉదయం కార్యకర్తలతో సమావేశం అయిన తర్వాత రాత్రి కార్మికులను ఉద్ధేశించి మాట్లాడతారు. సాయంత్రం 3 గంటలకు వర్కుషాప్ గేట్ వద్ద సమావేశంలో పాల్గొంటారు.