హైదరాబాద్

ఎక్కడా ఆగే పనేలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 20: తరుచూ ట్రాఫిక్ సమస్యతో సతమతమయ్యే జంటనగరవాసులు ఎపుడెపుడా అని ఎదురుచూస్తున్న మెట్రోరైలు ప్రారంభానికి కౌంట్‌డౌన్ మొదలైంది. ఇప్పటికే అక్టోబర్ మూడో వారంలోపు పనులన్నీ పూర్తి చేయాలని సర్కారు గడువు విధించగా, అన్ని మెట్రో స్టేషన్లలో ప్రయాణికులకు ఆధునిక వౌలిక వసతులు కల్పించాలని చీఫ్ సెక్రటరీ ఎస్పీ సింగ్ అధికారులను ఆదేశించారు. అంతేగాక, నగరంలో ప్రస్తుతమున్న ఆర్టీసి బస్సుల, ఎంఎంటిఎస్ రైళ్ల వేళలను కూడా మెట్రోరైల్ వేళలతో అనుసంధానం చేయాలని, అలాగే ఈ మూడు ప్రజారవాణ వ్యవస్థల్లో చెల్లుబాటు అయ్యేలా పాస్‌లు, స్మార్ట్ కార్డులను జారీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒకవైపు కారిడార్లు, మెట్రో స్టేషన్ల నిర్మాణ పనులను చేపడుతూనే మెట్రోరైలు రాకపోకలు వేళలకు అనుకూలంగా స్టేషన్ల నుంచి కాలనీలు, బస్తీలకు ఇకో ఫ్రెండ్లీ వాహనాలు నడిపే అంశంపై కసరత్తు వేగవంతమైంది. స్టేషన్లకు సమీపంలోని కాలనీలు, బస్తీల నుంచి మెట్రో స్టేషన్లకు ఫీడర్ బస్సులను నడపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకు ఇప్పటికే ప్రత్యేక అధ్యయనం నిర్వహించిన మెట్రోరైలు అధికారులు తొలి దశగా 791 బస్తీలు, కాలనీల నుంచి స్టేషన్ వరకు ఫీడర్ బస్సులను నడపాలని నిర్ణయించింది. మూడు మెట్రోరైలు కారిడార్లలోని అన్ని స్టేషన్లకు నాలుగు నుంచి ఆరు కిలోమీటర్ల దూరం ఉన్న ప్రాంతాలకు చెందిన ప్రజలు మెట్రోరైలు సేవలను సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా వారి అవసరాలను బట్టి మెట్రో స్టేషన్లకు తీసుకురావాలని నిర్ణయించారు.
ఎలా వీలైతే అలా...
ముఖ్యంగా నగరంలోని రోడ్ల పరిస్థితి, మలుపుల ఆధారంగా ఆటో రిక్షాలు, మినీ బస్సుల్లో ప్రయాణికులను ఎలాంటి అడ్డంకుల్లేకుండా త్వరగా స్టేషన్‌కు చేర్చేందుకు ఏది వీలైతే అది నడపాలని మెట్రో అధికారులు భావిస్తున్నారు. ఈ రకంగా నడిపే ఫీడర్ బస్సులను ఇకో ఫ్రెండ్ కాలుష్య రహిత వాహనాలను నడిపాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే పలు ఆటోమోబైల్ కంపెనీలు బ్యాటరీలతో నడిచే వాహనాలను తయారు చేస్తున్నందున, తొలి నుంచి పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తున్న మెట్రోరైలు అధికారులు బ్యాటరీ వాహానాలను నడపాలని భావిస్తున్నారు. ఇందుకు సర్కారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రస్తుతం మెట్రో స్టేషన్ల వారీగా, ఆ స్టేషన్ కు సమీపంలోని కుడి, ఎడమ వైపున్న పరిసర ప్రాంతాలకు నడపాల్సిన ఫీడర్ బస్సుల సర్వీసులపై అధికారులు చేపట్టన అధ్యయనం సైతం ముగిసింది.
అధ్యయన సారాంశం
మెట్రో స్టేషన్లకు ఫీడర్ బస్సులను నడిపే అంశంపై అధికారులు చేపట్టిన సర్వేకు సంబంధించిన నివేదికలోని ప్రధానంశాలిలా ఉన్నాయి. సుమారు నాలుగు నుంచి ఆరు కిలోమీటర్ల మార్గంలో ఈ ఫీడర్ బస్సులను నడపాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రతి అయిదు నుంచి పది నిమిషాలకో బస్సును నడపాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి మెట్రో స్టేషన్‌కు సమీపంలో ఉండే కమర్షియల్, రెసిడెన్షియల్ ప్రాంతాలు, పార్కులు, షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లు వంటి జన సంచారమెక్కువగా ఉండే ప్రాంతాల నుంచి స్టేషన్ వరకు ఈ బస్సులను నడపాలని నిర్ణయించారు.
ప్రతి 90 సెకన్లకు ఓ రైలు
మెట్రోస్టేషన్ నుంచి ప్రతి 90 సెకన్లకు ఓ రైలును నడిపేందకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంటే గంటకు 45 రైళ్లు ఒక్కో స్టేషన్ నుంచి రాకపోకలు సాగించే అవకాశాలున్నాయి. అంతేగాక, మెట్రో అందుబాటులోకి వచ్చిన తొలి రోజుల్లో ప్రయాణికుల సంఖ్య పోటెత్తే అవకాశముండటంతో ఫీడర్ బస్సుల సిట్టింగ్ సామర్థ్యాన్ని 20 నుంచి 40 మధ్య ఉండాలని నిర్ణయించారు. ఒక్కో రైలు వెయ్యి మందిని తీసుకెళ్లే సామర్థ్యం ఉన్నందున 50వేల మంది ప్రయాణికులు స్టేషన్లకు రాకపోకలు సాగించే అవకాశముండటంతో నాలుగు రకాల ఫీడర్ బస్సులు, మినీ బస్సులు, ట్యాక్సీలను అందుబాటులోకి తేవటంతో పాటు వీటిలోని సిట్టింగ్ సామర్థ్యం 40 మందికి ఉండే వాహనాలను వినియోగించనున్నారు.
నాలుగు రకాలుగా ఫీడర్ సర్వీసులు
కేవలం మెట్రోరైల్ ద్వారానే గాక, అనుబంధ ప్రాంతాల ప్రజలు ఎలాంటి అడ్డంకులు, ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రయాణించాలన్న ప్రధాన సంకల్పంతోనే ఫీడర్ బస్సులను నడపాలని మెట్రోరైలు అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. మెట్రో స్టేషన్లకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు నాలుగు రకాల ఫీడర్ రవాణా వ్యవస్థలను అందుబాటులోకి తేనున్నారు.
* కాలుష్య రహిత ఫీడర్ ట్రాన్స్‌పోర్టు సర్వీసు అంటే, ఓ భారీ అపార్ట్‌మెంట్‌కు గానీ, షాపింగ్ మాల్‌కు గానీ మెట్రో స్టేషన్ నుంచి ప్రత్యేకంగా స్కైవేలు, వాక్‌వేలు ఏర్పాటు చేసి, లేక సైక్లింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేసి ప్రయాణికులకు సైకిళ్లను అందుబాటులో ఉంచటం * ఇంటర్మీడియట్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు అనే మరో ఫీడర్ రవాణా వ్యవస్థను కూడా ఎంచుకున్నారు. ఈ వ్యవస్థ ద్వారా చిన్న చిన్న కాలనీలు, బస్తీల నుంచి ప్రయాణికులు స్టేషన్లకు చేరుకునేందుకు వీలుగా బ్యాటరీలతో నడిచే ఆటో రిక్షాలు, ట్యాక్సీలను అందుబాటులోకి తేనున్నారు. ఇప్పట్లో కాకపోయినా మున్ముందు ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చే అవకాశముంది. * షేర్ రైడ్ సర్వీసుల ద్వారా కూడా మధ్య తరగతి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని అందించాలని భావిస్తున్నారు. ఈ వ్యవస్థ ద్వారా మెట్రో స్టేషన్‌కు బ్యాటరీ ద్వారా నడిచే షేరింగ్ ఆటోలు, ట్యాక్సీలను నడిపాలని యోచిస్తున్నారు. * స్టేషన్‌కు సమీపంలోని ప్రాంతాల నుంచి స్టేషన్ వరకు బ్యాటరీతో నడిచే మినీ బస్సుల ద్వారా కూడా ఫీడర్ ట్రాన్స్‌పోర్టు సేవలు అందించనున్నారు. ఇవి కనిష్ఠంగా 20 మంది గరిష్ఠంగా 40 మంది ప్రయాణికుల సామర్థ్యం కల్గి ఉంటేనే మలుపుల వద్ధ ఎలాంటి ఇబ్బందుల్లేకుండా నిర్ణీత సమయంలో స్టేషన్‌కు చేరుకునే అవకాశముంటుందని అధికారులు గుర్తించారు.
‘కిస్ అండ్ మూవ్’తో పార్కింగ్ ఇక్కట్లకు చెక్
కాలనీలు, బస్తీల నుంచి మెట్రో స్టేషన్లకు ప్రయాణికులను తీసుకువచ్చే నాలుగు రకాల ఫీడర్ ట్రాన్స్‌పోర్టు వాహనాలు మెట్రో స్టేషన్ ఆవరణలో గానీ, బస్తీలు, కాలనీల్లో గానీ ఎక్కుపు ఆపకుండా ‘కిస్ అండ్ మూవ్’ విధానం ద్వారా వీటిని ఆపరేట్ చేస్తారు. కేవలం ప్రయాణికులను ఎక్కించుకుని మెట్రో స్టేషన్ ఆవరణలో ఇవి ఆగేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక పాయింట్ వద్దే వారిని డ్రాప్ చేసి వెళ్లిపోవటం, మళ్లీ స్టేషన్ దిగి, పాయింట్ వచ్చే వారిని ఎక్కించుకోవటం వంటి విధులు నిరంతరంగా కొనసాగుతూనే ఉంటాయి.
రాత్రి కేవలం రెండు నుంచి మూడు గంటల పాటు మెట్రోరైలు రాకపోకలు లేని సమయంలో వీటిని పార్కింగ్ చేసేందుకు ప్రత్యేకస్థలాలను ఏర్పాటు చేస్తున్నారు.
నో వెయిటింగ్..బీ సేఫ్!
ప్రయాణికులు కేవలం మెట్రోరైల్‌లోనే గాక, స్టేషన్‌లో, ఫీడర్ ట్రాన్స్‌పోర్టు వాహనాల్లోనూ సురక్షితంగా ప్రయాణించే ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా కాలనీకి వచ్చిన ఫీడర్ వాహనం ఎక్కగానే రైలు క్యాచ్ చేసే సరైన సమయానికి స్టేషన్‌లో దింపుతోంది. దిగువ ప్రయాణంలో కూడా స్టేషన్‌లో దిగగానే, ఫీడర్ వాహనాలు రెఢీగా ఉంటాయి. అవి నేరుగా కాలనీలో,బస్తీల్లో డ్రాప్ చేయటంతో ప్రయాణికుడు ఎక్కడా కూడా వెయింటింగ్ చేయాల్సిన పని లేకుండా, సురక్షితంగా ప్రయాణించేందుకు వీలుగా వీటి రాకపోకల వేళలను నిర్ణయించనున్నారు.

సమస్యల నీడలో ‘కెసిఆర్ నగర్’

చినుకుపడితే చిత్తడే * గతుకుల రోడ్లతో నిత్యం
అవస్థలే * పట్టించుకోని పాలకులు, ఆందోళనలో ప్రజలు

ఉప్పల్, సెప్టెంబర్ 20: రామంతాపూర్‌లోని కెసిఆర్‌నగర్ సమస్యలకు నిలయంగా తయారైంది. ఇక్కడ చినుకుబడితే చాలు రోడ్లన్నీ చిత్తడిగా మారిపోతున్నాయ. పక్కనే ఉన్న బాలకృష్ణకాలనీ, సాయినగర్, కురుమనగర్ కాలనీల పరిస్థితి ఇలాగే ఉండటంతో నివసిస్తున్న ప్రజలు సమస్యలతో దుర్భర జీవనం గడుపుతున్నారు. కాలనీలు ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా ఇక్కడ కనీస సౌకర్యాలు కల్పించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంతలతో అధ్వాన్నంగా తయారైన మట్టిరోడ్లు, అపరిశుభ్రత, విద్యుత్ లైట్లు లేక అంధకారంలో కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గెలిస్తే కనీస సౌకర్యాలను కల్పిస్తామని హామీలు గుప్పించిన ప్రజాప్రతినిధులు మురికి వాడలైన కాలనీల కనె్నత్తి చూడటంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో మూసీ దుర్వాసనతో ఇబ్బందులు పడుతుండగా కనీస సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వౌలిక వసతుల కల్పనలో ప్రత్యేక దృష్టి పెట్టేందుకు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.

అయోధ్యలో శతకోటి రామనామ జప సహిత
విశ్వశాంతి యజ్ఞం
ఖైరతాబాద్, సెప్టెంబర్ 20: విశ్వశాంతిని కాంక్షిస్తూ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అయోధ్యలో అక్టోబర్ 5 నుంచి 15వ తేదీ వరకు శతకోటి రామనామ జపసహిత విశ్వశాంతి యజ్ఞాన్ని నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలోఎన్‌ఆర్‌ఐ హిందూ సంస్థ ప్రతినిధులు గిరిప్రసాద్, గీతామూర్తి, భారతీయం సత్యవతి యజ్ఞ వివరాలను వెల్లడించారు. ఎన్‌ఆర్‌ఐ హిందు సంస్థ, విశ్వహిందు పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ యజ్ఞానికి దేశంలోని ప్రముఖ పీఠాధిపతులు, స్వామీజీలు హాజరౌతారని చెప్పారు. వందలాది మంది వేదపండితుల మంత్రోచ్చరణల విశ్వశాంతి, లోకకళ్యాణార్ధం నిర్వహిస్తున్న మహాయజ్ఞానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

ఆడపడుచులకు కల్యాణలక్ష్మి ఒక వరం

బాలానగర్, సెప్టెంబర్ 20: పేద, మధ్య తరగతి ఆడపడుచులకు కల్యాణలక్ష్మి పథకం ఒక వరమని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బుధవారం డివిజన్ పరిధిలోని రాజీవ్‌గాంధీనగర్‌లో ఆయనతో పాటు స్థానిక కార్పొరేటర్ కాండూరి నరేంద్ర ఆచార్య పాల్గొని ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదింటి ఆడపడుచుల వివాహాలు చేయడం భారం కాకుడదనే ఉద్దేశ్యంతో సి ఎం కెసీ ఆర్ కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాన్ని అమలు చేశారన్నారు. పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక పథకాలను అమలు పరిచారన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టిఆర్‌ఎస్ అద్యక్షులు ఎడ్ల మోహన్‌రెడ్డి, నాయకులు మందడి సుధాకర్‌రెడ్డి, వార్డు కమిటీ సభ్యులు గౌస్, రాజుసాగర్, యండి. మోయిజ్, యండి.సోఫీ, గోపయ్యగౌడ్, లక్ష్మీ, దుర్గేష్, వెంకట్‌రెడ్డిలు పాల్గొన్నారు.

మనీ సర్క్యులేషన్ స్కీం పేరుతో మోసం

హైదరాబాద్, సెప్టెంబర్ 20: మనీ సర్క్యులేషన్ పేరుతో మోసానికి పాల్పడుతున్న ఇద్దరు నిందితులను వెస్ట్‌జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు సెల్‌ఫోన్లు హెల్త్ ప్రాడక్ట్సుకు సంబంధించి బ్రోచర్లు, విజిటింగ్ కార్డులు, హెల్త్ ప్రాడక్ట్సు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ ఎర్రగడ్డకు చెందిన సుదాం శ్రీనివాసరావు, బాలానగర్ ఐడిపిఎల్ కాలనీకి చెందిన మహమ్మద్ ఖాజాలు కలసి నగరంలో ‘అరైజింగ్ డైరెక్ట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో మనీ సర్క్యులేషన్, హెల్త్ ప్రాడక్ట్సు వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఒక సభ్యుడు రూ. 4000లు చెల్లించి తమ ప్రాడక్ట్సు కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన వ్యక్తి మరో ఇద్దరిని తమ కంపెనీ సభ్యులుగా చేర్చాలని స్కీం పెట్టారు. దాదాపు 15 వందల నుంచి 2000 మందిని సభ్యులుగా చేర్పించుకున్నారు. ఈ వ్యాపారంలో మరో వ్యక్తి పి చంద్రశేఖర్‌ను భాగస్వామిగా చేర్చుకున్నారు. అయితే తమ సంస్థలో రూ. 4000లు చెల్లించి సభ్యుడిగా చేరిన తరువాత మరో ఇద్దరిని చేర్పిస్తే రూ. 1000 కమిషన్ ఉంటుందని చెప్పారు. దీంతో వందలాది మంది సర్క్యులేషన్ స్కీంలో చేరారు. ప్రాడక్ట్సులో నాణ్యత లేదని, నాసిరకం ఉత్పత్తులను అంటగడుతున్నారని పలువురు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరైజింగ్ డైరెక్ట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌పై దాడి చేశారు. హెల్త్ ప్రాడక్ట్సు పల్స్ మాక్య్ ప్రొటీన్‌కు చెందిన 155 బాక్సులు, విటో మ్యాక్స్ అరైజింగ్ 17 బాక్సులు, 56 గార్సినిలా కాంబోజియా ఎక్స్‌ట్రాక్స్, 17 బెల్లెజా సోప్ బాక్సులు, అస్తాజెన్ 75 బాక్సులు సీజ్ చేశారు. కేసు నమోదు చేసినట్లు టాస్క్ఫోర్స్ కమిషనర్ శశిధర్‌రాజు తెలిపారు.

బీసీల్లో చైతన్యం తీసుకురావాలి

*బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న

కాచిగూడ, సెప్టెంబర్ 20: బిసిలు ఐక్యంగా ఉంటు జాతిని చైతన్యం చేయాల్సిన అవసరం ఎంతైన ఉందని తెలంగాణ రాష్ట్ర బిసి సంక్షేమశాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. బిసి యువజన సంఘం రాష్ట్ర మహాసభ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ అధ్యక్షతన బుధవారం బాగ్‌లింగపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జోగు రామన్న మాట్లాడుతూ.. బిసిలు ఆగ్ర కులాలకు వ్యతిరేకం కాదని, కేవలం జనాభా పతిపాదికన చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలని పేర్కొన్నారు.
బిసిల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా ఉందని వారికి కావాల్సిన బడ్జెట్ దామాషా పద్దతిలో కేటాయిస్తామని ముఖ్యమంత్రి కేసి ఆర్ చెప్పడం జరిగిందన్నారు. హైదరాబాద్‌లో బిసి భవన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి త్వరలో పరిష్కరిస్తామని వివరించారు. బిసిలలో రాజకీయ చైతన్యం రావాలన్నారు. బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ మాట్లాడుతూ.. బిసిలలో రాజకీయ చైతన్యం తీసుకురావడానికి యువత నడుంబిగించాలని పిలుపునిచ్చారు. నల్ల ధనం పూర్తిగా రాజకీయాల్లో రాణిస్తుందని తెలిపారు. బిసిలు ఓటును సద్వినియోగం చేసుకుంటే బిసిల అభివృద్ధి సాధ్యవౌతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, బిసి నాయకులు తాడూరి శ్రీనివాస్, వీరేందర్ గౌడ్, దుర్గయ్య, నీరంజన్, మానస చెన్నప్ప, ప్రభాకర్ పాల్గొన్నారు.