హైదరాబాద్

చెరువులకు జలకళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 12: మహానగరంలో కొద్దిరోజులుగా కురుస్తున్న అతిభారీ వర్షాల కారణంగా జిహెచ్‌ఎంసి పరిధిలోని చెరువులు జలకళను సంతరించుకున్నాయి. మొత్తం గ్రేటర్ పరిధిలో 185 చెరువులుండగా, వాటిలో 119 చెరువులు పూర్తిస్థాయి మట్టాన్ని దాటి పొంగి ప్రవహిస్తున్నాయి. ఫలితంగా వీటికి దిగువన ఉన్న ప్రాంతాలు ముంపునకు గురికాకుండా ఉండేందుకు వీలుగా బల్దియా అధికారులు ముందస్తు పరిరక్షణ చర్యలు చేపట్టారు. మొత్తం 26 చెరువుల్లో నీటి మట్టం వంద శాతానికి నిండగా, 23 చెరువుల్లో 75 శాతానికి పై చిలుకు నిండాయి. మిగిలిన 17 చెరువుల్లోకి వాటి ఎఫ్‌టిఎల్‌ను బట్టి సుమారు 50 శాతం నిండినట్లు అధికారులు గుర్తించారు. వంద శాతం నిండిన 119 చెరువుల్లో 70 చెరువులు కొద్దిరోజులుగా నిరంతరంగా అలుగు పోస్తున్నాయి. ఈ చెరువుల్లో అధిక శాతం కబ్జాలకు గురి కావటం, అక్రమంగా నిర్మాణాలు చేపట్టడం ద్వారానే నిండిన చెరువులతో దిగువ ప్రాంతాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా మీరాలం ట్యాంక్, ఆర్కేపురం, సఫిల్‌గూడ, బండచెరువు, ఫాక్స్‌సాగర్, దుర్గంచెరువు, రామంతాపూర్ పెద్ద చెరువు తదితర చెరువుల సమీపంలోని కాలనీలు ఇప్పటికే జలమయమైన సంగతి తెలిసిందే! రామంతాపూర్ పెద్ద చెరువు ఆక్రమణకు గురై, నాలాను మూసివేయటం వల్లే ఆయా గృహాల్లో చేరిన నీటిని తొలగించేందుకు అధికారులు ఆహర్నిశలు కృషి చేస్తున్నారు. అలాగే, సఫిల్‌గూడ, ఆర్కేపురం చెరువు మత్తడితో నీరు బండ చెరువులోకి చేరటం, ఆ నీరు బయటకు ప్రవహించేందుకు వీలుగా ఉన్న నాలాలు కుచించుకుపోవటంతో లోతట్టు కాలనీలు జలమయమైనట్లు అధికారులు గుర్తించారు. మొత్తం 22 అడుగుల పూర్తి నీటి సామర్థ్యం గల ఫాక్స్ సాగర్ ఇప్పటికే 28 అడుగుల మేరకు నీరు చేరుకోవవటంతో హెచ్‌ఎండిఏ పరిధిలోని హరిచంద్రకాలనీ ముంపునకు గురైంది. ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యగా ఆయా ప్రాంతాల్లోని చెరువుల వారీగా ప్రత్యేకాధికారులను నియమించి, రెవెన్యూ శాఖతో సమన్వయం చేసుకుంటూ నిండిన చెరువుల నుంచి కిందకు ప్రవహిస్తున్న నీటి తీరును పర్యవేక్షిస్తున్నారు. దశాబ్ద కాలం నుంచి గ్రేటర్ హైదరాబాద్‌లో నీరు లేక ఎండిపోయిన ఎన్నో చెరువులు ఈ అతి భారీ వర్షాల కారణంగా నిండిపోయాయి. ఆగస్టు 17వ తేదీ నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు నగరంలో గరిష్టంగా 21 సెంటీమీటర్ల నుంచి కనిష్టంగా ఐదు సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు నిర్థారించారు.
పరిరక్షణ దిశగా చర్యలు
నగరంలోని అన్ని చెరువుల పూర్తి స్థాయి నీటి మట్టాలను నిర్థారించే ప్రక్రియను జిహెచ్‌ఎంసి చేపట్టింది. మొత్తం 185 చెరువులకు గాను 85 చెరువుల్లో దాదాపు 1887 ఎకరాల విస్తీర్ణంలో గుర్రపు డెక్క వ్యాపించినట్లు గుర్తించిన అధికారులు, దాన్ని తొలగించేందుకు దాదాపు రూ. 18.45 కోట్ల వరకు ఖర్చు కానున్నట్లు అంచనాలు వేశారు. కానీ ఇంత పెద్ద మొత్తంలో వెచ్చించే సామర్థ్యం జిహెచ్‌ఎంసికి లేకపోవటంతో కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ప్రైవేటు సంస్థల నుంచి సమకూర్చుకోవాలా? లేక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆర్థిక సహాయం తీసుకోవాలా? అన్న ఆలోచనలో బల్దియా ఉన్నట్లు సమాచారం. ఇదివరకే జిహెచ్‌ఎంసి ఈ ప్రతిపాదనలను ప్రభుత్వాలకు పంపించింది. అంతేగాక, చెరువులను దత్తతకు తీసేందుకు ముందు వచ్చే కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు కూడా బల్దియా సిద్ధమైంది. ఇందుకు గాను చెరువులకు సంబంధించిన సమాచారాన్ని వెబ్‌సైట్‌లో పొందుపర్చింది.