హైదరాబాద్

అణచివేత ఆపకపోతే ప్రజా ఉద్యమాలు తప్పవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, అక్టోబర్ 18: ప్రజాస్వామ్య ఉద్యమాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో నానాటికి అణచివేతలు పెరిగిపోవడం ఆవేదన కలిగిస్తుందని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. కెసిఆర్ ప్రభుత్వం అణచివేతలు ఆపకపోతే ప్రజా ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశానికి హరగోపాల్ హాజరై మాట్లాడారు. ప్రభుత్వం బేషరతుగా అక్రమ అరెస్టు చేసిన తెలంగాణ విద్యార్ధి వేదిక అధ్యక్షుడు మహేష్, క్రాంతిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్వేచ్ఛాయుత పాలనలో నిరసలు, ఉద్యమాలు ఉండవని, అణచివేతలు ఎంతగా పెరిగితే అంతగా ప్రజా ఉద్యమాలు వస్తాయన్న విషయాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. తెలంగాణ ఉద్యమం జరిగిందే అణచివేతలకు వ్యతిరేకంగా అనే విషయం కూడా మరచిపోవడం విచారకరమని అన్నారు. ఆనాడు ఎన్‌టిఆర్, చంద్రబాబు అణచివేతలను ఉద్ధృతం చేయడంతో తెలంగాణలో వ్యతిరేకతలు ప్రారంభం అయ్యాయని, అణచివేతలు పెరిగే కొద్ది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం మరింత పెరిగి రాష్ట్ర ఏర్పాటుకు దారి తీసిందని చెప్పారు. ఆనాడు ఉద్యమ నాయకుడిగా ఉన్న కెసిఆర్.. ప్రభుత్వం చేజిక్కించుకోగానే అన్ని మరిచి నియంతలా వ్యవహరించడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి ప్రజలు ఏమి కోరుకుంటున్నారో వివరిస్తున్న కోదండరామ్ లాంటి వారిని సైతం మాట్లాడనివ్వకుండా అరెస్టులు చేయడం ఏ మేరకు సమర్ధనీయమో ప్రభుత్వం ఆలోచించుకోవాలని అన్నారు. ప్రొఫెసర్ లక్ష్మినారాయణ మాట్లాడుతూ కార్పోరేట్ కాలేజీల్లో విద్యార్ధుల ఆత్మహత్యలపై మాట్లాడుతున్న మహేష్, క్రాంతిని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అరెస్టు చేసిందని, ఉచిత విద్యను అందిస్తానన్న కెసిఆర్ కుటుంబమే విద్యా వ్యాపారంలోకి దిగి కార్పొరేట్ విద్యా సంస్థలతో కుమ్మకై వారికి అండగా ఉంటున్నాయని ఆరోపించారు. మహేష్, క్రాంతిలను విడుదలచేసి, వారిపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అరుణాంక్, భద్రి, మద్దిరెడ్డి, స్వప్న పాల్గొన్నారు.
టివివి నాయకుల విడుదలకు డిమాండ్
షాద్‌నగర్ టౌన్: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమాలు చేస్తున్న తెలంగాణ విద్యార్థి వేదిక నాయకులను పోలీసులు అరెస్టు చేయడం సిగ్గుమాలిన చర్య అని టివివి షాద్‌నగర్ డివిజన్ అధ్యక్షుడు ప్రవీణ్ ఆరోపించారు. బుధవారం షాద్‌నగర్ పట్టణంలోని ఇన్‌స్పెక్షన్ బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ప్రవీణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు, రైతులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై 11 సంవత్సరాలుగా తెలంగాణ విద్యా వేదిక పోరాడుతోందని అన్నారు. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద టివివి రాష్ట్ర అధ్యక్షుడు మహేష్, సభ్యుడు క్రాంతిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం సిగ్గుమాలిన చర్యగా తెలిపారు. అక్రమంగా అరెస్టు చేసిన వీరిని వెంటనే విడుదల చేయాలని ప్రవీణ్ డిమాండ్ చేశారు. సమావేశంలో టిపిఎఫ్ జిల్లా అధ్యక్షుడు అర్జునప్ప, టిజెఎసి జిల్లా కన్వీనర్ టిజి శ్రీనివాస్, సిఎల్‌సి ప్రధాన కార్యదర్శి తిరుమలయ్య, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రవీంద్రనాథ్, ఎఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గిరి పాల్గొన్నారు.

బిసి కుల ఫెడరేషన్లను రద్దు చేస్తే ఉద్యమమే
చార్మినార్, అక్టోబర్ 18: రాష్ట్ర ప్రభుత్వం.. బిసి ఫెడరేషన్లకు బడ్జెట్ కేటాయించకుండా, వాటిని రద్దు చేయాలని భావించటం సరికాదని, దీనిని వ్యతిరేకిస్తూ ఉద్యమం చేస్తామని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ రాష్ట్ర బిసి యువజన సంఘం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కృష్ణయ్య మాట్లాడుతూ గడిచిన మూడేళ్ల నుంచి టిఆర్‌ఎస్ ప్రభుత్వం.. బిసి ఫెడరేషన్లకు బడ్జెట్ కేటాయించకుండా, వాటిని నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తుందని అన్నారు. ఫెడరేషన్లను రద్దు చేయాలని నిర్ణయించటం దుర్మార్గమైన చర్య అని అభివర్ణించారు. ఫెడరేషన్లను రద్దు చేసి ఎంబిసి కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పిస్తామని చెప్పటం సరైన కారణం కాదని అన్నారు. ఇది కేవలం బిసిలను మభ్యపెట్టే ప్రయత్నమేనని ఆయన వ్యాఖ్యానించారు. విశ్వబ్రహ్మణ, శాలివాహన, గీత, వడ్డెర, వాల్మీకి, ఉప్పర, మేధర, బట్రాజు, పూసల, మేర, రజక, నారుూ బ్రహ్మణ ఫెడరేషన్లను రద్దు చేయాలనే ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలతో అనేక పోరాటాలు చేసి ఈ ఫెడరేషన్లను సాధించుకున్నామని, ఆయా కులాల ఆత్మగౌరవానికి, అభివృద్ధికి ప్రతీకని అన్నారు. ఫెడరేషన్లను రద్దు చేస్తే ప్రభుత్వ నిర్ణయాన్ని ఈ కుల సంఘాలన్నీ గట్టిగా వ్యతిరేకిస్తాయని చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటనను గుర్తుతెచ్చుకుని ఫెడరేషన్ల రద్దును ఉపసంహరించుకుని, వీటికి బడ్జెట్‌ను కేటాయించి, మరింత పటిష్ట పర్చాలన్నారు. తెలంగాణ బిసి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీల వెంకటేశ్, జాతీయ బిసి సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, విశ్వబ్రహ్మణ సంఘానికి చెందిన వెంకటాచారి, వడ్డెర సంఘం ప్రతినిధి వేముల వెంకటేశ్, కుమ్మరి సంఘానికి చెందిన రామలింగం, మున్నూరుకాపు సంఘం ప్రతినిధి కోట్ల శ్రీనివాస్, నగర ఉప్పర సంఘానికి చెందిన ముత్యాల హరికిషన్, బిసి నాయకులు ఎర్ర సత్యనారాయణ, భూపేష్‌సాగర్, జి.రాంబాబు పాల్గొన్నారు.