హైదరాబాద్

కార్పొరేటర్లా మజాకా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 12: గ్రేటర్ కార్పొరేటర్లా మాజాకా..అక్రమార్జన కోసం వారి దారి అడ్డదారి..ఆ దారికి అడ్డొస్తే అంతే సంగతులు. వారు చేసేది తప్పని చెబితే కొన్ని సార్లు నేరుగా కార్పొరేటర్ చేతుల్లో, మరికొన్ని సందర్భాల్లో వారి బంధువుల చేతుల్లో దెబ్బలు తినాల్సిన దుస్థితి నెలకొంది. ప్రజాస్వామ్యానికి మారని మచ్చలా అధికార పార్టీకి చెందిన కొందరు గ్రేటర్ కార్పొరేటర్లు వ్యవహరిస్తున్నా, వారిని కనీస కట్టడి చేయటంలో అధిష్ఠానం విఫలమవుతోంది. ప్రజాసేవకులమని చెప్పుకుంటూ, ప్రజలను నానారకాలుగా దోచుకునేందుకు యత్నిస్తున్నారు. కొందరు బల్దియా కార్పొరేటర్లు అనుమతులు తీసుకుని ఇళ్లు కట్టుకున్నా, అడిగినంత ఇవ్వాలని డిమాండ్ చేసేవారు ఒకరైతే, తన ఏరియాలోని అక్రమ నిర్మాణాలకు నోటీసులిస్తే చేయిచేసుకునే వారు మరొకరు. ఈ రకంగా ఇప్పటి వరకు 17 మంది గ్రేటర్ కార్పొరేటర్లు వివిధ రకాల దారుణాలకు పాల్పడ్డారు. మరికొన్ని సందర్భాల్లో వారి బంధువులు సైతం ప్రజలను, అయోపాపం అన్నవారిని వదలటం లేదు. గతంలో ఇంటి వివాదం విషయంలో ఓ వృద్థుడ్ని కార్పొరేటర్ తండ్రి చితకబాదిన ఘటన సికిందరాబాద్‌లో కలకలం రేపగా, మరో కార్పొరేటర్ కుమారుడు టోల్‌గేట్ సిబ్బందిపై విచక్షణరహితంగా దాడి చేసిన ఘటన తెలిసిందే! అంతెందుకు ఈ నెల 8వ తేదీన సర్కిల్ 9లోని ఓ అక్రమ నిర్మాణానికి నోటీసు ఇచ్చేందుకు వెళ్లిన టౌన్‌ప్లానింగ్ మహిళా సెక్షన్ ఆఫీసర్‌పై కార్పొరేటర్ భర్త చేయిచేసుకున్న సంగతి తెలిసిందే! ఈ ఘటనకు ముందే ఇలాంటి ఆగడాలకు పాల్పడే కార్పొరేటర్లపై కఠిన చర్యలుంటాయని సాక్ష్యాత్తు మున్సిపల్ మంత్రి కె.తారకరామారావు చెప్పిన పాఠాలు కూడా బూడిదలో పోసిన పన్నీరే అయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇపుడు తాజాగా ఓ కార్పొరేటర్ తమ్ముడు అద్దెకున్న ఇంటినే నకిలీ డాక్యుమెంట్లలో కబ్జా చేసుకునేందుకు యత్నించటంతో ఆయనపై కూడా జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైనట్లు తెలిసింది. ఈ రకంగా రోజుకో కార్పొరేటర్ తనకు తోచిన రూట్‌లో అక్రమ సంపాదన కోసం అమాయకులను రకరకాల వేధింపులకు గురి చేస్తున్నారు. ఫలితంగా నిజాయితీగా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్న కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు సైతం ప్రజల్లో తలెత్తుకుని తిరగలేని పరిస్థితి దాపురించింది. నేరుగా ప్రజలతో సంబంధం కలిగి ఉండే కార్పొరేటర్ల ఆగడాలకు బ్రేక్ వేయకుంటే గ్రేటర్‌లో అధికారపార్టీకి ఆదరణ దెబ్బతినే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
కారణమేమిటీ?
బల్దియా కార్పొరేటర్లు రకరకాలుగా ఆగడాలకు గురి కావటానికి కారణమేమిటీ? అన్నదే చర్చనీయాంశంగా మారింది. బల్దియా ఎన్నికల సమయంలో ఆయా పార్టీల నుంచి కోట్లు, లక్షలు ఖర్చుపెట్టి కేవలం క్షణాల వ్యవధిలోనే టిఆర్‌ఎస్‌లో చేరి, టిక్కెట్ దక్కించుకుని గెలించేందుకు లక్షలు ఖర్చు పెట్టిన వీరికి వార్షిక బడ్జెట్ కేటాయించకపోవటమే వీరి ఆగడాలకు కారణమా? అన్న చర్చ లేకపోలేదు. నగరం గ్రేటర్‌గా రూపాంతరం చెందిన తర్వాత 2009లో అందుబాటులోకి వచ్చిన మొట్టమొదటి పాలక మండలికి 2010మార్చి వరకు రూ. 50లక్షల వార్షిక బడ్జెట్‌ను ఆ తర్వాత ఏటా రూ. కోటి, ఆ తర్వాత రూ. 2 కోట్ల వార్షిక బడ్జెట్‌ను కేటాయించేవారు. కానీ సంవత్సరం క్రితం అందుబాటులోకి వచ్చిన రెండు పాలక మండలికి ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి వార్షిక బడ్జెట్‌ను కేటాయించలేదు. పైగా ఆర్భాటం, మందీ మార్బలంతో తిరిగే కార్పొరేటర్లు తాము ఎన్నికల్లో పెట్టిన ఖర్చును రికవరీ చేసుకునేందుకు ఈ రకమైన ఆగడాలకు పాల్పడుతున్నారా? అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.