హైదరాబాద్

* రంజాన్ ముగిసే వరకు ఆగాల్సిందన్న మజ్లీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 19: మహానగర పాలక సంస్థ చేపట్టే అతి ముఖ్యమైన పారిశుద్ద్య పనులను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించే శానిటరీ పీల్డు అసిస్టెంట్ల బదిలీల వ్యవహారం వివాదాస్పదమైంది. అంతేగాక, గతంలో ఇదే తరహాలో పలువురు డిప్యూటీ కమిషనర్లకు స్థానం చలనం కల్గిస్తూ కమిషనర్ జనార్దన్ రెడ్డి జారీ చేసిన ఆదేశాలు అమలుకు నోచుకోకపోగా, పలువురు డీసీలు పైరవీలు చేసుకుని తమకు నచ్చిన చోట సీటును దక్కించుకున్న విధంగానే మరో సారి కమిషనర్ ఆదేశాలు క్షేత్ర స్థాయిలో అమలుకాలేకపోయాయి. ప్రస్తుతం నగరంలో ఔట్ సోర్సు ప్రాతిపదికన 940 మంది ఎస్‌ఎఫ్‌ఏలు విధులు నిర్వహిస్తుండగా, వీరిలో 936 మంది ఔట్ సోర్సింగ్ ఎస్‌ఎఫ్‌ఏలను ఒక సర్కిల్ నుంచి మరో సర్కిల్‌కు బదిలీ చేస్తూ రెండురోజుల క్రితం కమిషనర్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే! అయితే బదిలీలు చేపట్టే రోజు కూడా పలు కార్మిక సంఘాలు, ఎస్‌ఎఫ్‌ఏలు ఆందోళన చేపట్టగా, ఇపుడు తాజాగా ఈ బదిలీలపై మజ్లీస్ ఎమ్మెల్యేలు గళం విప్పటంతో మరింత వివాదాస్పదమైంది.
రంజాన్ పండుగ ముగిసే వరకు ఆగి ఆ తర్వాత బదిలీలు చేపట్టాల్సిందని కొందరు మజ్లీస్ ఎమ్మెల్యేలు వాదిస్తున్నారు. అంతేగాక, ఈ బదిలీ ఆదేశాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ వారు శనివారం కమిషనర్ జనార్దన్ రెడ్డిని కూడా కలిసినట్లు సమాచారం. సుదీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తున్న వీరిని బదిలీ చేయాలని ఇటీవలే కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు కోరటంతో వీరిని అంతర్గతంగా బదిలీలు చేశామని అధికారులు చెబుతున్నా, కొద్ది రోజుల క్రితం జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఒకరిద్దరు కార్పొరేటర్లు మినహా మిగిలిన కార్పొరేటర్లు, ఏ ఇతర ఎమ్మెల్యేలు కూడా వారిని బదిలీ చేయాలని కోరలేదని ప్రజాప్రతినిధులు వాదిస్తున్నారు. బదిలీలను అత్యంత పారదర్శకంగా చేసేందుకు వీలుగా అరుదైన ఆన్‌లైన్ విధానాన్ని అనుసరించామని అధికారులు చెబుతున్నా, క్షేత్ర స్థాయిలో ఈ ఆదేశాలు ఏ మాత్రం అమలు కాలేదని చెప్పవచ్చు.
ఎస్‌ఎఫ్‌ఏలతో ఎవరికి లాభం
సుదీర్ఘకాలం ఒకే చోట విధులు నిర్వర్తిస్తున్న ఎస్‌ఎఫ్‌ఏలతో ఎవరికి లాభం చేకూరుతుందన్న విషయం ఆసక్తికరంగా మారింది.
నెలకు రూ. 15500 జీతానికి పనిచేసే ఈ ఎస్‌ఎఫ్‌ఏలకు జీతాల చెల్లింపునకు వివిధ రకాల కారణాలు, లోపాలను చూపుతూ సుమారు రెండు వేల నుంచి మూడువేల రూపాయల వరకు కోతలు విధిస్తూ మిగిలిన జీతాన్ని చెల్లిస్తున్నారు. అయితే రెండురోజుల క్రితం వరకు విధులు నిర్వర్తించిన చోట వీరితో లాభ పడిందెవరు అంటే కొందరు అసిస్టెంటు మెడికల్ ఆఫీసర్లేనన్న సమాధానం వస్తోంది. సికిందరాబాద్ సర్కిల్‌లో కొద్ది రోజుల క్రితం వరకు అసిస్టెంటు మెడికల్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించిన ఓ అధికారి ఓ ఐఏఎస్ అధికారి అండతో కోట్లాది రూపాయలను సంపాదించుకున్న విషయం వెలుగుచూసింది. ఇందుకు కింది స్థాయి ఎస్‌ఎఫ్‌ఏను బలి చేసిన అధికారులు సదరు మెడికల్ ఆఫీసర్ పై నుంచి చేసిన వత్తిడిని తట్టుకోలేక, ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పనిలో పనిగా సదరు అధికారి అక్రమాలు బయట పడటంతో ఇక్కడి నుంచి బదిలీ చేసుకుని చల్లగా జారుకున్నారు.
ఎస్‌ఎఫ్‌ఏల అంతర్గతంగా బదిలీలు చేసినా, దీర్ఘకాలకంగా ఒకే చోట తిష్టవేసుకున్న వీరు ఒకరికొకరు అవగాహన కుదుర్చుకుని, తాజా బదిలీల ప్రకారం తమకు కేటాయించిన ప్రాంతంలో బయోమెట్రిక్ అటెండెన్స్ ఇచ్చిన పలువురు ఎస్‌ఎఫ్‌ఏలు తాము ఇంతకు ముందు పనిచేసిన ప్రాంతాల్లోనే విధులు నిర్వర్తించినట్లు ఆరోపణలున్నాయి. ఈ రకంగా ఎవరికివారు తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగిస్తూ కమిషనర్ ఆదేశాలను బేఖాతరు చేయటం ఇటీవలి కాలంలో బల్దియాలో మామూలైపోయిందన్న చర్చ లేకపోలేదు.

సమన్వయంతో నేరాల నివారణ
నగర క్రైం సమీక్షలో సీపీ అంజనీకుమార్ వెల్లడి
హైదరాబాద్, మే 19: సమన్వయంతో నేరాలను అరికట్టేందుకు కృషి చేయాలని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ కోరారు. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక సహకారంతో నేరాల కట్టడి, నేరస్తులను అదుపు చేసేందుకు ప్రణాళికా బద్ధంగా పని చేయాలని సూచించారు. శనివారం నాడిక్కడ కమిషనరేట్‌లో నగర క్రైం మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి అదనపు సిపి క్రైం, జోన్ల డిసిపిలు, సిసిఎస్ డిసిపి, అన్ని జోన్లలో ఉన్న అదనపు డిసిపిలు పాల్గొన్నారు. తమ సూచనలు, నివేదికలను సిపికి అందజేశారు. నేరాల సంఖ్య తగ్గించేందుకు అవసరమైన విధానాలను వివరించాలని సిపి సూచించారు.

రైస్‌మిల్ గోడకూలి ఇద్దరు కార్మికుల మృతి
ఇబ్రహీంపట్నం, మే 19: పొట్టకూటి కోసం కూలి చేసుకొని జీవనం కొనసాగిస్తున్న కూలీల బ్రతుకలను విధి చిదిమేసింది. రైస్‌మిల్‌లో కార్మికులుగా పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులను గోడరూపంలో మృత్యువు కబళించింది. వివరాల్లోకి వెళితే నిర్మాణంలో ఉన్న గోడకూలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఈ సంఘటనకు సంబందించి ఆదిభట్ల సిఐ గోవింద్‌రెడ్డి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నియోజకవర్గ పరిధిలోని ఆరుట్ల గ్రామానికి చెందిన గిరమోని శ్రీనివాస్, కందుకూరు మండలం గుమ్మడవెళ్ళి గ్రామానికి చెందిన గౌర బీరప్ప (45)లు మండల పరిధిలోని బొంగ్లూరు గ్రామంలో ఉన్న లక్ష్మీగణపతి రైస్‌మిల్లులో కార్మికులుగా పనిచేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం రోజువారీగానే రైస్‌మిల్లుకు వెళ్ళిన వారు మిల్లులోనే నిర్మాణంలో ఉన్న గోడకూలి తమపై పడిపోయి తీవ్రగాయాలపాలయ్యారు. దీంతో రైస్‌మిల్లు యాజమాన్యం హుటాహుటీన నగరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాస్, బీరప్పలు మృతిచెందారు. దీంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కూలీలు మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న యాజమాన్యం రైస్‌మిల్లుకు తాళాలు వేసి పరారయ్యారు. కూలీల మృతి విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు క్యామ మల్లేష్, తెదేపా రాష్ట్ర నాయకులు కొంగర విష్ణువర్ధన్‌రెడ్డి, సిపిఎం నాయకులు యాదయ్య, జగదీశ్, ఆరుట్ల సర్పంచ్ ఆనంగళ్ళ యాదయ్యలు మృతుల కుటుంబాలతో కలిసి రైస్‌మిల్లు ముందు ధర్నాకు దిగారు. యాజమాన్యం ఇద్దరు కూలీల మృతికి భాద్యత వహించి 40 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని అందజేయాలని డిమాండ్ చేశారు. గత ఎన్నో ఏళ్ళుగా ఇద్దరు అదే రైస్‌మిల్లులో పనిచేస్తున్నారని, వారికి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళన తీవ్రస్థాయికి చేరినా స్పంధన కరువవడంతో రైస్‌మిల్లులోకి చొచ్చుకెళ్ళే ప్రయత్నం చేశారు. రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. వెంటనే పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో యాజమాన్యం దిగివచ్చి రూ. 11 లక్షల నష్టపరిహారాన్ని చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు సిఐ తెలిపారు.