హైదరాబాద్

నగర కాంగ్రెస్ సమావేశం రసాభాస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎన్నికల నగారా మోగక ముందే హైదరాబాద్ కాంగ్రెస్‌లో సీట్ల పంచాయితీ ప్రారంభమైంది. సోమవారం గాంధీ భవన్ ఆవరణలోని ఇందిరా భవన్ హాలులో జరిగిన నగర కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం రసాభాసగా మారింది. పరిశీలకునిగా విచ్చేసిన ఎఐసిసి కార్యదర్శి బోస్ రాజు, టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి ముందే నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్ అనుచరులు క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌కు వ్యతిరేకంగా, అంజన్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. ఒక దశలో ఎఐసిసి కార్యదర్శి, మాజీ ఎంపీ వి. హనుమంత రావు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. మరోవైపు ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో చేరుతారని ఊహగానాలు వినిపిస్తున్న మాజీ మంత్రి ఎం. ముఖేష్ గౌడ్, ఆయన తనయుడు విక్రమ్ గౌడ్ ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు.
అసలేం జరిగిందంటే..!
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తాను సికింద్రాబాద్ లోక్‌సభ నుంచి పోటీ చేస్తానని మాజీ క్రికెటర్ అజరుద్దీన్ ఆదివారం ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం వివాదానికి దారి తీసింది. సోమవారం జరిగిన సమావేశంలో అంజన్ కుమార్ యాదవ్ ప్రసంగిస్తూ సికింద్రాబాద్ లోక్‌సభ స్థానాన్ని తాను కాంగ్రెస్‌కు కంచుకోటగా మార్చానని చెప్పారు. అయితే మాజీ క్రికెటర్ అజరుద్దీన్ సికింద్రాబాద్ లోక్‌సభకు పోటీ చేస్తానని ప్రకటిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దమ్ముంటే హైదరాబాద్ లో పోటీ చేసి గెలవాలి
అజరుద్దీన్‌కు దమ్ము, ధైర్యం ఉంటే హైదరాబాద్ లోక్‌సభ నుంచి పోటీ చేసి గెలుపొందాలని అంజన్ సవాల్ విసిరారు. ఇలా అంజన్‌కుమార్ ఆవేశంగా ప్రసంగిస్తున్న దశలో ఆయన అనుచరులు గాంధీ భవన్ ఆవరణలో అంజన్‌కు అనుకూలంగా, అజర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదంతా గమనించిన ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వీ. హనుమంత రావు నిరసన వ్యక్తం చేస్తూ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. ఇలాఉండగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి జోక్యం చేసుకుని అంజన్ అనుచరులకు సర్ధి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని ఆయన తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్‌కు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ సమయంలో పార్టీలో అందరమూ కలిసి పని చేయాల్సి ఉందని ఆయన చెప్పారు.
పోటీ ఎవరు చేస్తారు?
వచ్చే ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్‌స భ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారన్న ది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని, ఇక్కడ గొడవ పడితే లాభం ఏమిటనీ కొంత మంది సీనియర్ నాయకులు అన్నారు. ఎవరు పోటీ చేస్తారన్నది ఇప్పుడు అప్రస్తుతమనీ, పార్టీ బలోపేతానికే ప్రతి ఒక్కరూ పని చేయాలని అభిప్రాయపడ్డారు.
అజర్ ఏమన్నారంటే..!
క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, కాంగ్రెస్ నాయకుడు, హైదరాబాదీ మహమ్మద్ అజరుద్దీన్ లోగడ ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి పోటీలో నిలవగా, ఈసారి సొంత రాష్ట్రానికి రావాలని ఆశిస్తున్నారు. 2009లో ఉత్తర ప్రదేశ్‌లోని మోరాదాబాద్ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ఎన్నికైన ఆయన 2014లో రాజస్థాన్‌లోని టోన్క్-సవాయ్ మాధోపూర్ నుంచి పోటీకి దిగి పరాజయాన్ని ఎదుర్కొన్నారు. 2019 ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి బరిలోకి దిగాలని దిగేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అజర్ చెప్పకనే చెప్పారు. మొరాదాబాద్ నుంచి ఎన్నికైన తాను ఆ తర్వాత పార్టీ ఆదేశాల మేరకు టోన్క్‌కు వలస వెళ్లానని అన్నారు. రక్షణాత్మకంగా వ్యవహరించడం తనకు చేతకాదని, కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, అధిష్ఠానం ఆదేశాలను శిరసావహిస్తానని అజర్ చెప్పారు. ఈసారి సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సిందిగా చాలా మంది తనను కోరుతున్నారని అన్నారు. ‘ఇప్పటికే నేను ఎన్నో గ్రామాల్లో పర్యటించాను. రైతులతో మాట్లాడాను. ప్రజాభిప్రాయాన్ని తెలుసుకున్నాను. సికింద్రాబాద్ నియోజకవర్గమే తనకు ఎంతో అనుకూలమని వారంతా ముక్తకంఠంతో చెప్పారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్ఠానం దృష్టికి కూడా తీసుకెళ్లాను. ‘పార్టీకి నేను కెప్టెన్‌ను కాను, నిర్ణయాధికారం నాది కాదు. అధినాయకత్వం తీసుకునే ఎలాంటి నిర్ణయాన్ని అమలు చేయడమే నా బాధ్యత’ అన్నారు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, జయాపజయాల గురించి తాను ఆలోచించడం లేదని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడమే తన ధ్యేయమని, ఎన్నికల్లో గెలుస్తానా లేదా అనే అంశానికి ఎలాంటి ప్రాధాన్యం లేదని వ్యాఖ్యానించారు. తనను సికింద్రాబాద్ నుంచి పోటీకి దింపాలని అధినాయకత్వం యోచిస్తున్నదని, తాను కూడా ఆ అవకాశాన్ని ఇవ్వాల్సిందిగా కోరానని అజార్ చెప్పారు.