హైదరాబాద్

సైబరాబాద్‌లో బతుకమ్మ సంబురాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, అక్టోబర్ 16: సైబరాబాద్, రాచకొండ పోలీసు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. సైబరాబాద్ కమిషనరేట్‌లో ఏర్పాటుచేసిన బతుకమ్మ సంబరాలకు కమిషనర్లు సజ్జనార్, మహేష్ భగత్‌లతోపాటు అధికారులు పాల్గొని ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపారు. జంట కమిషనరేట్‌లకు చెందిన మహిళా ఉద్యోగులు కుటుంబ సమేతంగా హాజరై బతుకమ్మ పాటలు పాడుతూ, నృత్యాలు చేశారు. స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, చరిత్ర, పురాణలు మేళవిస్తు శాంతి భద్రతలకు పోలీసులు అమలు చేస్తున్న షీటీమ్, భరోసా, నేరాలు అదుపునకు పోలీసులు చేస్తున్న సేవలను బతుకమ్మ పాటల ద్వారా వివరించారు. మహిళ ఉద్యోగలు బతుకమ్మను అందంగా అలంకరించి ఐక్యత, సోదరభావం, ప్రేమను కలిపి రంగరిస్తూ మానవహారంగా ఏర్పడి పాటలు పాడారు. సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ మాట్లాడుతూ పోలీసు కుటుంబ సభ్యులతో కలసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో సీపీ సజ్జనార్ సతీమణి అనుపమ, క్రైం డీసీపీ జానకీ షర్మిలా, షీటీమ్ డీసీపీ అనసూయ, ఏడీసీపీ ఇందిరా, అడ్మిన్ డీసీపీలు నరిసింహ, శిల్పవల్లి, మాణిక్ రాజ్, గౌస్ హోహియుద్ధీన్, ఏసీపీలు రవీందర్ రెడ్డి, కిషోర్ కుమార్, ఉమేందర్, విద్యాసాగర్ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు భద్రారెడ్డి, కృష్ణారెడ్డి, శివకుమార్ పాల్గొన్నారు.

ఆత్మీయ సత్కారం
కాచిగూడ, అక్టోబర్ 16: సామాజిక సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వామలు కావాలని సామాజికవేత్త డా. లయన్ విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. సుధా ఆర్ట్స్, శంకరం వేదిక, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో ఆత్మీయ సత్కార కార్యక్రమం మంగళవారం గానసభలోని గుండవరపు హనుమంతరావు వేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి విజయ్‌కుమార్, ప్రముఖ రచయిత్రి కేతవరపు రాజశ్రీ, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విరహత్ అలీ, శంకరం వేదిక అధ్యక్షుడు యలవర్తి రాజేంద్ర ప్రసాద్, సుధా ఆర్ట్స్ అధ్యక్షుడు మల్లెల సుధాకర్ పాల్గొని ఆత్మీయ సత్కారం చేశారు. వివిధ రంగాల్లో అనేక కారణాలతో పేదరికం అనుభవిస్తున్న వారికి అర్థికంగా చేయూత అందించేందుకు కృషి చేస్తున్న సుధా ఆర్ట్స్‌ను అభినందించారు. మిమిక్రీ అర్టిస్ట్ మల్లెల సుధాకర్ ప్రదర్శించిన మాట్లాడే బొమ్మ ప్రదర్శన ఆకట్టుకుంది.

19న ‘వ్యూహలక్ష్మీ’ నృత్య ప్రదర్శన
కాచిగూడ, అక్టోబర్ 16: ప్రముఖ నాట్యగురువు డా.కే. ఉమా రామారావు రచించిన యక్షగాన గ్రంథావిష్కరణ సభ ఈనెల 19వ తేది రవీంద్ర భారతిలో నిర్వహిస్తున్నట్లు ప్రముఖ నర్తకి డా.జ్వాలా శ్రీకళ తెలిపారు. తరిగొండ వెంగమాంబ రచన పద్య ప్రబంధం ‘వ్యూహలక్ష్మీ’ ఆవిర్భావం కూచిపూడి నృత్య రూపకం ప్రదర్శించనున్నట్లు చెప్పారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ దర్శకుడు పద్మశ్రీ డా.కే.విశ్వనాథ్, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, సీనియర్ పాత్రికేయుడు గుడిపూడి శ్రీహరి పాల్గొంటారని వివరించారు.

ఆదివాసీ ఆత్మగౌరవ ప్రతీక కొమరం భీమ్
కాచిగూడ, అక్టోబర్ 16: ఆదివాసీ ఆత్మగౌరవ ప్రతీక కొమరం భీమ్ అని పలువురు వక్తలు కొనియాడారు. కొమరం భీమ్ జయంతి సభ శంకరం వేదిక, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం గానసభలోని కళా లలిత కళావేదికలో నిర్వహించారు.
కార్యక్రమానికి ప్రముఖ రచయిత కోయి కోటేశ్వర రావు, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, శంకరం వేదిక అధ్యక్షుడు యలవర్తి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని కొమరం భీమ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆదివాసీ హక్కుల కోసం నిజాంకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాటం చేసి ప్రాణాలర్పించిన వ్యక్తి కొమరం భీమ్ అని కీర్తించారు. కొమరం భీమ్ చిత్ర ప్రదర్శనను ప్రదర్శించారు.

నృత్య గురువులకు సత్కారం
కాచిగూడ, అక్టోబర్ 16: దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకుని ప్రముఖ నృత్య గురువు డా.రేణుకా ప్రభాకర్ బృందం ‘కూచిపూడి’ నృత్య ప్రదర్శన కళానిలయం, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం గానసభలోని కళా వేంకట దీక్షితులు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి వైఎస్‌ఆర్ మూర్తి, న్యాయవాది ఆకుల రమ్య, గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి, సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.సురేందర్, పుష్పలత పాల్గొని కళాకారులను అభినందించి సత్కరించారు. కళాకారులు ప్రదర్శించిన పలు నృత్యంశాలు ఆకట్టుకున్నాయి.