హైదరాబాద్

మెట్రోభవన్ ముందు కాంగ్రెస్ ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: చారిత్రక కట్టడాల పరిరక్షణ పేరిట పెండింగ్‌లో పెట్టిన మెట్రోరైలు పనులను వెంటనే పూర్తి చేయాలని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు వారు లక్డీకాపూల్‌లోని మెట్రోరైలు భవన్ ముందు సోమవారం ఉదయం ధర్నా చేపట్టారు. భవన్‌ముందు బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. రంగంలో దిగిన పోలీసులు తొలుత మాజీ ఎమ్మెల్యేలకు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా, అది ఫలించలేదు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. అరెస్టు సమయంలో పోలీసులు, నేతల మధ్య తోపులాట చేసుకుని, ఉద్రిక్తతతకు దారితీసింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, కూన శ్రీశైలంగౌడ్ మాట్లాడుతూ, ప్రభుత్వం మెట్రోపనులను చారిత్రక భవనాల పేరిట చాటుమాటు ఒప్పందాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. పనులు చేపట్టిన ఎల్ అండ్ టి సంస్థ నుంచి వందల కోట్ల ముడుపులు ఆశిస్తున్న కెసిఆర్ ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ముందు నుంచి రైలు పోతే చారిత్రక కట్టడాలకు ఇబ్బంది అనిపిస్తే, ఉస్మానియా ఆసుపత్రి చారిత్రక కట్టడం కాదా? దాన్ని కూల్చివేస్తామనటం నిజం కాదా? అని సుధీర్‌రెడ్డి ప్రశ్నించారు. చారిత్రక కట్టడాల విషయంలో ప్రభుత్వం ద్వంద్వ వైఖరి ఏమిటీ? అని ప్రశ్నించారు. ప్రభుత్వ మూర్ఖపు వైఖరి వల్ల 2016లో ప్రజలకు అందుబాటులోకి రావల్సిన మెట్రోరైలు ఒక సంవత్సరం ఆలస్యంగా అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పాత ఒప్పందం ప్రకారం పనులను పూర్తి చేసి, సకాలంలో మెట్రోరైలును ప్రజలకు అందుబాటులోకి తేవాలని సుధీర్‌రెడ్డి డిమాండ్ చేశారు. అలైన్‌మెంట్‌లో మార్పులు అంటూ ఆలస్యం చేయటం తగదన్నారు. కాగా, ప్రభుత్వం సుల్తాన్‌బజార్ మీదుగా కాకుండా ప్రత్యామ్నాయ ప్రాంతాల మీదుగా మెట్రోరైలును నిర్మించాలని రెండురోజుల క్రితం టిడిపి తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ డిమాండ్ చేసిన మరుసటిరోజే కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు పెండింగ్ పనులు చేపట్టాలంటూ మెట్రోభవన్ ముందు ధర్నా చేపట్టడటం గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ప్రజలను ఆకట్టుకునేందుకేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.