హైదరాబాద్

నీటి వృథాతో రూ.30 కోట్ల నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, : మహానగరంలో నీటి సరఫరా జరిగినపుడు అవుతున్న నీటి వృథా విలువ రూ. 30 కోట్లు అని, వృథా కాకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా, పొదుపుగా వాడాలని మేయర్ బొంతు రామ్మోహన్ సూచించారు. నగరవాసులకు నీటి పొదుపుపై అవగాహన కల్పించేందుకు ఇప్పటికే వాక్ నిర్వహిస్తున్న వాలంటీర్లకు, మహిళా సంఘాలకు శుక్రవారం రోజున జలమండలి ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి విశ్వనాధగార్డెన్‌లో అవగాహన సదస్సు జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన మేయర్ మాట్లాడుతూ నగర పౌరులు నీటి విలువ తెలుసుకున్నపుడే వృథా కాకుండా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఎన్నో వందల కిలోమీటర్ల దూరం నుంచి నీటిని తీసుకువచ్చి, నగరవాసుల దాహర్తిని తీర్చేందుకు సరఫరా చేస్తున్నామన్న విషయాన్ని గుర్తించాలని సూచించారు.
నగరంలో గతంలో 500 చెరువులు ఉండేవని, ప్రస్తుతం వాటి సంఖ్య 180కి తగ్గిపోయిందని వివరించారు. నీటి సంరక్షణ కోసం ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు. జలమండలి ఎండీ దాన కిషోర్ మాట్లాడుతూ జలమండలి వంద కిలోమీటర్ల దూరం నుంచి నీటిని తీసుకువచ్చి ఇంటింటికి సరఫరా చేసేందుకు రూ. 89 కోట్లను కేవలం విద్యుత్ బిల్లులుగా చెల్లిస్తుందని తెలిపారు. ఈ విషయంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఈ ప్రత్యేక వాక్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గాంధీ, జలమండలి డైరెక్టర్ సీ.రవి, సీజీఎం ఆర్‌బీ అనిల్ కుమార్ పాల్గొన్నారు.

మహామహోపాధ్యాయుడు బీఎస్ రాములు
కాచిగూడ, ఆగస్టు 23: భిన్న అనుభవాలతో పరిపూర్ణమైన జీవితం గడిపిన మహామహోపాధ్యాయుడు బీఎస్ రాములు అని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. బీసీ కమిషన్ చైర్మెన్ బీఎస్ రాములు జన్మదిన వేడుకలు శుక్రవారం రవీంద్ర భారతిలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహముద్ అలీ పాల్గొని బీఎస్ రాములును అభినందించారు. బీఎస్ తన జన్మదిన సప్తతిని విలాసవంతంగా కాకుండా సాహితీ, సామాజిక సంబురాలుగా జరుపుకోవాడం వందలాది మంది సాహితీవేత్తలకు పురస్కారాలను అందించి గౌరవించడం విన్నూతంగా ఉందని తెలిపారు. 70 ఏళ్ల వయస్సులో కూడా క్రియాశీలంగా అట్టడుగు వర్గాల సంక్షేమానికి ప్రజా సాహిత్యాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్న ఘనత బీఎస్‌కు దక్కుతుందని పేర్కొన్నారు. సాహిత్య, సామాజిక, సంస్కృతిక సేవా రంగాలలో దశాబ్దాలుగా ఎనలేని కృషి చేస్తున్న 50 మంది జీవన సాఫల్య పురస్కారాలను ప్రదానం చేశారు. బీసీ కమిషన్ సభ్యుడు డా.వకుళాభరణం కృష్ణమోహన రావు సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో తెలంగాణ అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర రావు, బీసీ కమిషన్ సభ్యులు జూలూరి గౌరీశంకర్, ఆంజనేయ గౌడ్, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, నేటి నిజం సంపాదకుడు బైస దేవదాసు, దైవజ్ఞ శర్మ పాల్గొన్నారు.

కత్తితో నరికి ఆటో డ్రైవర్ హత్య
శేరిలింగంపల్లి, ఆగస్టు 23: మియాపూర్‌లో దారుణం జరిగింది. ఆటో డ్రైవర్‌ను మిత్రులే అత్యంత క్రూరంగా హత్య చేశారు. కత్తితో నరికిన దుండగులు తలను వేరు చేసి తీసుకెళ్లి ఐయదారు కిలో మీటర్ల దూరంలో జాతీయ రహదారి పక్కనే పడేసి పారిపోయారు. హంతకుల్లో బావ, బామ్మర్ది ఉండడం గమనార్హం. హత్యోదంతం వివరాలిలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని కోకాకోలా కంపెనీ సమీపంలోని శ్రీవాణి నగర్‌లో నివసిస్తున్న మహబూబాబాద్ జిల్లా (కేసముద్రం)లోని అయోధ్య నగర్‌కు చెందిన గడ్డం ప్రవీణ్ (24), మియాపూర్‌లోని ఎంఏ నగర్‌లో ఉంటున్న నల్గొండకు చెందిన శ్రీకాంత్, శ్రీనివాస్, రాజేష్ మంచి మిత్రులు. అందరూ ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా రాజేష్ వద్ద శ్రీకాంత్ అప్పుగా తీసుకున్న రూ.20 వేలు వడ్డీతో కలిపి మూడు రెట్లు అధికంగా చెల్లించినా ఇంకా ఇవ్వాలని మధ్యవర్తితో ఒత్తిడి చేయడంతో మిత్రుల మధ్య గురువారం ఘర్షణ జరిగింది. అనంతరం అందరూ రాజీ కుదుర్చుకుని సాయంత్రం వరకు మద్యం తాగారు. అర్ధరాత్రి 11.45 గంటల సమయంలో మరోసారి మందు తాగుదామని చెప్పి ఆటోలో ప్రవీణ్, శ్రీకాంత్, శ్రీనివాస్, రాజేష్ కలిసి దీప్తిశ్రీ నగర్ సమీపంలోని ధర్మపురి క్షేత్రం దాటిన తర్వాత చెత్త డంపింగ్ యార్డు సమీపంలోని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లారు. గొడవ పడుతుండగానే శ్రీకాంత్ తన వెంట తెచ్చుకున్న చున్నీని ప్యాంట్ జేబులో నుంచి తీసి రాజేష్ మెడపై వేస్తుండగానే అతను తప్పించుకుని పారిపోయాడు. ఆ మరుక్షణమే ప్రవీణ్ మెడకు వేసి గట్టిగా గుంజి కింద పడేశారు. బావ, బామ్మర్ది ఇద్దరూ కలిసి కత్తితో అతని మెడ నరికేశారు. మొండెన్ని అక్కడే పడేసి ఎవరూ గుర్తు పట్టకుండా ఉండాలనే ఆలోచనతో తలను తీసుకెళ్లి ఐదారు కిలో మీటర్ల దూరంలో మియాపూర్ క్రాస్ రోడ్ వద్ద రోహిత్ వైన్స్ షాపు ముందు పడేసి ఉడాయించారు. శుక్రవారం తెల్లవారుఝామున ఐదు గంటల సమయంలో చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పారిపోయిన రాజేష్.. పోలీసులకు జరిగిన విషయాన్ని చెప్పాడు. తల, మొండాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిందితులు శ్రీకాంత్, శ్రీనివాస్.. నల్గొండకు పారిపోవడంతో సెల్ టవర్ నెట్‌వర్క్ ఆధారంగా గుర్తించి పట్టుకున్నట్టు తెలిసింది.
అమీన్‌పూర్‌కు చెందిన ఓ మహిళ విషయంలో తనకు అడ్డం వస్తున్నాడనే అనుమానంతో అయిలయ్య అనే వ్యక్తిని పొట్టలో పొడిచి శ్రీకాంత్ హత్య కేసులో ఇరుక్కున్నాడు. తనను అంతమొందించడానికి మృతుడు ప్రవీణ్‌తో అయిలయ్య స్నేహం చేస్తున్నాడనే అనుమానంతోటే ముందస్తు పక్కా ప్రణాళికతో హత్యకు కుట్ర పన్నినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసును మియాపూర్ ఇన్స్‌పెక్టర్ శామల వెంకటేష్ దర్యాప్తు చేస్తున్నారు.

ప్రకాశం పంతులు సేవలు మరువలేనివి
కాచిగూడ, ఆగస్టు 23: ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు ప్రత్యేకాంధ్ర సాధనలో చేసిన సేవలు మరువలేనివని తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. ప్రకాశం అభివృద్ధి అధ్యయన సంస్థ, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ‘పంతులుగారి ఆలోచనలో గ్రామీణాబివృద్ధి’ అంశంపై స్మారకోపన్యాసం కార్యక్రమం శుక్రవారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ దిల్లీ ప్రతినిధి సముద్రాల వేణుగోపాలా చారి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మెన్ కోలేటి దామోదర్ గుప్త, మాజీ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు, జేడీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వీవీ లక్ష్మీనారాయణ, సంస్థ చైర్మెన్ డా.గంధం సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి టంగుటూరి శ్రీరామ్ పాల్గొన్నారు.
పద్మజారాణికి బిరుదు ప్రదానం
కాచిగూడ, ఆగస్టు 23: టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా 27 రంగాల్లో ప్రసిద్ధి చెందిన తొలి మహిళా డా. ఈడ్పుగంటి పద్మజారాణికి ‘శ్రావణ సౌందర్య మహాలక్ష్మీ’ బిరుదుతో పాటు సీల్వర్ క్రౌన్ ప్రదానోత్సవ కార్యక్రమం కళానిలయం సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ పాల్గొని ఈడ్పుగంటి పద్మజారాణికి బిరుదును ప్రదానం చేశారు. చిన్నతనంలోనే కరాటేలో బ్లాక్‌బెల్టు సాధించిన మాస్టర్ హరిహర్ నందన్‌కు టంగుటూరి ప్రకాశం పంతులు జాతీయ పురస్కారం ప్రదానం చేశారు. వంశీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు వంశీ రామరాజు సభాధ్యక్షత వహించగా శోభన్‌బాబు సేవా సమితి చైర్మెన్ పీవీ శేషందర్ రావు, రచయిత్రి లలిత గన్నవరపు, సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు సురేందర్, పుష్పలత పాల్గొన్నారు.
తల్లిదండ్రులను యువత గౌరవించాలి
కాచిగూడ, ఆగస్టు 23: తల్లిదండ్రులను నేటి యువత గౌరవించినప్పుడే సమాజంలో రాణించగలుగుతారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు డా.కేవీ రమణా చారి అన్నారు. అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ, శారత సత్యనారాయణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ‘సాహిత్య - సాంస్కృతిక’ సమ్మోహనం కార్యక్రమం శుక్రవారం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రమణా చారి పాల్గొని ప్రసంగించారు. వివిధ రంగాల్లో విశిష్ల సేవలందించిన చంద్రకాంత్, సంధ్య గొల్లమూడి, డా.మంథా భానుమతి, వోలేటి రంగమణికి పురస్కారాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి మాజీ చైర్మెన్ డా.మండలి బుద్ధప్రసాద్, ప్రముఖ సాహితీవేత్త డా.వోలేటి పార్వతీశం, విద్యావేత్త డా.అమృతలత, వంశీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు వంశీ రామరాజు, వంశీ అధ్యక్షురాలు డా.తెనే్నటి సుధాదేవి, ఆచార్య ఎండ్లూరి సుధాకర్, సంస్థ అధ్యక్షురాలు కోసూరి ఉమాభారతి పాల్గొన్నారు.

అత్తాపూర్‌లో సామూహిక వరలక్ష్మి పూజలు
రాజేంద్రనగర్, ఆగస్టు 23: రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అత్తాపూర్‌లో సామూహిక వరలక్ష్మి పూజలను మహిళలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణాష్టమి వేడుకలను సైతం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాలను విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో సహ కార్యదర్శి జగదీశ్వర్, ఉమామహేశ్వర్‌రెడ్డి, పావని, లక్ష్మి మాతాజీ, సుశీల, కనకదుర్గా, సత్యవతి, జ్యోతి, మంజు, దేవి, రేఖా, మంజు పాల్గొన్నారు.
కొత్తూరు: మందోని మైసమ్మ అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. శుక్రవారం కొత్తూరు మండల కేంద్రంలోని మందోని మైసమ్మ ఆలయ ధర్మకర్త మలిపెద్ది విశ్వనాథ్ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అభిషేకం, హోమాలు వంటి కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ ధర్మకర్త మలిపెద్ది విశ్వనాథ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి భావాలను అలవర్చుకోవాలని అన్నారు. దైవ భక్తితోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని వివరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మాదారం అనురాధ కృష్ణగౌడ్, గోవింద్ రెడ్డి, వడ్ల లక్ష్మయ్యచారి, మాదారం లక్ష్మయ్య గౌడ్, శివగుప్తా, పేపర్ యాదయ్య గౌడ్, రాజు నాయక్ పాల్గొన్నారు.
ముదిరాజ్ ప్రతినిధులకు ఘన సన్మానం
కొత్తూరు రూరల్, ఆగస్టు 23: ముదిరాజ్ ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో నిర్వహించిన ముదిరాజ్ ప్రజాప్రతినిధుల సన్మాన సభకు ముఖ్యఅతిధిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, జడ్పీవైస్ చైర్మన్ ఈట గణేష్, రాజ్యసభ సభ్యుడు బండప్రకాష్‌లు హాజరయ్యారు. కొత్తగా ఏర్పడిన నందిగామ మండలం నుండజ జడ్పీటీసీగా ఎన్నికై రంగారెడ్డి జిల్లా జడ్పీవైస్ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన ఈట గణేష్‌ను ముదిరాజ్ సంఘం నేతలు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి అందె బాబయ్య, ముదిరాజ్ సంఘం నాయకులు యాదయ్య, శ్రీశైలం పాల్గొన్నారు.