హైదరాబాద్

గణేష్ ఉత్సవాల్లో గంగ హారతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, : మహానగరంలో పదకొండు రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగే గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ సారి హుస్సేన్‌సాగర్‌లో మొట్టమొదటి సారి ప్రభుత్వం తరపున గంగ హారతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ వెల్లడించారు. శుక్రవారం గణేష్ నిమజ్జనంపై మంత్రులు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, నగర ప్రజాప్రతినిధులతో కలిసి ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ నగరంలో గణేష్ ఉత్సవాలు భక్తిశ్రద్ధలు, ఆనందోత్సవాలకు ప్రతీకగా, ప్రశాంతంగా జరిగేందుకు వీలుగా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మండప నిర్వాహకులు, భక్తులు కూడా ఈ ఉత్సవాలు ఘనంగా, ప్రశాంతంగా జరిగేలా ప్రభుత్వం, పోలీసులతో సహకరించాలని సూచించారు. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం ఈసారి ప్రత్యేకంగా 26 కొలనులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు శివారుల్లో నిమజ్జనం జరిగే అన్ని ప్రాంతాల్లో దాదాపు 255 క్రేన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హుస్సేన్‌సాగర్ వద్ద 20 బోట్లను అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం వత్తిడిని తగ్గించేందుకు జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో వేర్వేరు ప్రాంతాల్లో 22.89 కోట్ల రూపాయల ఖర్చుతో 26 నిమజ్జన కొలనులను చేపట్టగా, అందులో 23 పూర్తయ్యాయని, మరో మూడు నిర్మాణంలో ఉన్నాయని, ఒక్కోక్క కొలనులో ఐదువేల విగ్రహాల వరకు నిమజ్జనం చేసే అవకాశముందని మంత్రి వివరించారు. నిమజ్జనం జరిగే రూట్‌లో, వివిధ ప్రాంతాల్లో ఎప్పటికపుడు వ్యర్థాలను తొలగించేందుకు వీలుగా సుమారు 9710 మంది పారిశుద్ధ్య కార్మికులను నియమించి, 680 మంది జవాన్లతో ఈ పనులను ఎప్పటికపుడు పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగరంలో జరిగే గణేష్ ఉత్సవాలకు దేశంలోనే ఎంతో గుర్తింపు ఉందని, ఇలాంటి ఎంతో ప్రతిష్టాత్మకమైన ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేందుక వీలుగా నగరంలోని హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిష్నరేట్ పరిధిలో ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పారిశుద్ధ్య సిబ్బంది మూడు షిఫ్టుల్లో రౌండ్ ది క్లాక్ విధులు నిర్వర్తించనున్నట్లు పేర్కొన్నారు. నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో ప్రత్యేకంగా బ్యారికేడ్లు, అదనంగా లైట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులతో పాటు రిజర్వ్‌డ్ పోలీసులను రంగంలో దింపనున్నట్లు తెలిపారు. భక్తుల కోసం 30లక్షల పై చిలుకు వాటర్ ప్యాకెట్లను 115 కౌంటర్ల ద్వారా పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నిమజ్జనం కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారి కోసం ఆర్టీసీ, మెట్రోరైలు ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీలు రాంచందర్‌రావు, స్టీఫెన్‌సన్, ప్రభాకర్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, శేరిసుభాష్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, జీఏడీ ప్రత్యేక కార్యదర్శి అదర్‌సిన్హా, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్, పోలీసు కమిషనర్లు అంజనీ కుమార్, మహేశ్ భగవత్, అదనపు కమిషనర్ జితేందర్, హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ రవి, రంగారెడ్డి జేసీ లోకేశ్, మెడ్చల్ జేసీ రవి, మెట్రోరైలు ఎండీ డా.ఎన్వీఎస్ రెడ్డి పాల్గొన్నారు.