మెయిన్ ఫీచర్

ఉగ్రవాదంపై ఉక్కు పిడికిలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరడుగట్టిన ఉగ్రవాదంపై ఆమె చేస్తున్న అనితర సాధ్యమైన పోరాటానికి ఆ దేశ మహిళలు సలామ్ చేస్తున్నారు. కదిలే బొమ్మలను నేస్తాలుగా చేసుకుని ఖదీజ-అల్-సలామి మహిళల్లో తీసుకువస్తున్న చైతన్యం ఉగ్రవాదులకు కంటగింపుగా మారినప్పటికీ వారి బెదిరింపులు...తుపాకీ గుళ్లకు బెదరక సమస్యలను అధిగమిస్తూ ముందుకు సాగుతోంది.
ఇస్లాం మత ఛాందసవాదులకు కేంద్రమైన ఐ.ఎస్.ఐ.ఎస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా) దాడులతో అతలాకుతలం అవుతున్న ఎమెన్ దేశానికి చెందిన ఆమె ఇప్పటికీ 20కి పైగా డాక్యుమెంటరీలను రూపొందించారు. లైంగిక వివక్ష, సమానత్వం, స్ర్తి విద్య తదితర అంశాలపై ఆమె రూపొందించిన డాక్యుమెంటరీలకు పలు అవార్డులు సైతం లభించాయి. తన స్వీయ కథతో ‘‘ఐయామ్ నోజుమ్’’ అంటూ నిర్మించిన సినిమా పలువురి సినీ విమర్శకులను సైతం విశేషంగా ఆకట్టుకుంది. ఆమె వాస్తవ జీవిత గాథలోకి వెళితే ఎన్నో చేదు అనుభవాలను చవిచూసింది. సలామికి పసి ఛాయలు వీడకుండానే పరిణయానికి ఆమెను తల్లిదండ్రులు సిద్ధం చేశారు. పదకొండేళ్ల ప్రాయంలోనే ఆమెకు మూడు పదులు నిండిన వ్యక్తితో వివాహం చేశారు. పెళ్లయిన కొద్దిరోజులకే భర్త నుంచి విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. అత్తారింటికి వెళ్లిన కుమార్తె పట్టుమని పది రోజులు కూడా కాపురం చేయలేదని, పరువు పోయిందని తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరై ససేమిరా విడాకులకు ఒప్పుకోకపోయినప్పటికీ వారిని ఒప్పించి, ఒంటరి జీవితానికే మొగ్గు చూపింది. ఇక ఆమె దినచర్యలలో భాగంగా ప్రతిరోజూ ఉదయం స్కూలుకు వెళ్లి, సాయంత్రం నేషనల్ టి.వి. స్టేషన్‌లో చిన్న పిల్లల కోసం కార్యక్రమాలు రూపొందించేది. ఈ నేపథ్యంలో కదిలే బొమ్మలనే నేస్తాలుగా చేసుకుంది. అవే ఆమె హృదయ వేదనకు స్వాంతన చేకూర్చేవి. ఈ బొమ్మలతోనే మహిళల్లో చైతన్యం తీసుకురావాలనే ధృడ నిశ్చయంతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా తొలుత ఆమె అమెరికా వెళ్లి ఇంజనీరింగ్ అభ్యసించింది. చదువు పూర్తయిన తరువాత అమెరికా నుంచి తన స్వదేశమైన ఎమెన్‌కు తిరిగి వచ్చి నేషనల్ టి.వి స్టేషన్‌లో చేరారు. బాల్య వివాహలు, లైంగిక వివక్ష, అసమానతలు, స్ర్తి విద్య తదితర అంశాలపై ఆమె పలు డాక్యుమెంటరీలను రూపొందించారు. భర్త వేధింపులకు తాళలేక, భర్తను హత్య చేసినందుకు ఉరిశిక్ష విధించిన మహిళపై ఆమె రూపొందించిన డాక్యుమెంటరీ పలువురిని ఆకట్టుకుంది. పలువురు ఇస్లాం మత ఛాందసవాదులు డాక్యుమెంటరీలను ప్రదర్శించవద్దని, ప్రదర్శిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనవలసి వస్తుందని సలామిని తరచూ బెదిరించేవారు. అయితే, ఆమె వారి బెదిరింపులకు తలొగ్గకుండా, తానే స్వయంగా ప్రొజెక్టురు చేతబట్టుకుని మారుమూల గ్రామాలలో తాను రూపొందించిన డాక్యుమెంటరీలను ప్రదర్శించేవారు. ఈ డాక్యుమెంటరీలకు ప్రజల నుంచి విశేష స్పందన రావటంతో ఆమె బెదిరింపులను బేఖాతరు చేసి, ఇనుమడించిన ఉత్సాహంతో డాక్యుమెంటరీలను నిర్మిస్తున్నారు. మనం చేసే పనుల పట్ల మనకు నమ్మకం ఉంటే ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కునే సత్తా లభిస్తుందని చెబుతారు ఖాదిజ.
ప్రస్తుతం ఇస్లాం మతం పేరిట పలు ప్రాంతాలలో విధ్వంసం, హత్యాకాండలకు పాల్పడుతున్న ఐ.ఎస్.ఐ.ఎస్ తీవ్రవాదులు ఇస్లాం మత వౌలిక సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆమె తెగేసి చెబుతున్నారు. ఇస్లాం మతం శాంతి, మతసామరస్యాన్ని బోధిస్తే ఐ.ఎస్.ఐ.ఎస్ తీవ్రవాదులు అశాంతి, మత అసహనాలకు కేంద్రబిందువుగా నిలుస్తున్నారన్నారు. ప్రస్తుతం తమ దేశంలో ఆస్పత్రులు, మసీదులపై కూడా తీవ్రవాదులు బాంబుల వర్షం కురిపిస్తున్నారని ఆమె చెప్పారు.
ఏ దేశం శాంతి, సౌభాగ్యాలతో విరాజిల్లాలన్నా అందుకు మహిళ పాత్ర అత్యంత కీలకమైనది. అందుకే మహిళలందరూ విద్యావంతులు కావాలని ఆమె సూచిస్తున్నారు. విద్యావంతులైన మహిళల్లోనే సమస్యను పరిష్కరించుకునే అవగాహన, శక్తి పెరుగుతుందని ఆమె చెబుతారు.
మత ఛాందసవాదుల ఉక్కు కౌగిలిలో చిక్కి అల్లాడుతున్న ఎమెన్ దేశపు మహిళలు సైతం ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. అటు మత ఛాందసవాదులు ఇటు తీవ్రవాదుల బెదిరింపులకు వెరవక, మహిళలను చైతన్యపరచడానికి కృషి చేస్తున్న సలామిని ఎమెన్ దేశపు ఉక్కు మహిళగా పిలుస్తున్నారు.