సబ్ ఫీచర్

సైలెంట్ కిల్లర్స్... యాంటీ బయాటిక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డాక్టర్లు అవసరం ఉన్నా లేకపోయినా విచ్చలవిడిగా యాంటీ బయాటిక్స్ మందులు రాసేస్తున్నారని పలు అధ్యయనాలు తేల్చి చెప్తున్నాయి. దేశీయ, విదేశీ యూనివర్సిటీలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు సంయుక్తంగా జరిపిన అధ్యయనంలో కమీషన్ల కోసం డాక్టర్లు పడుతున్న కక్కుర్తి బయటపడింది. రోగికి ఎంతమేర యాంటీ బయాటిక్స్ అవసరమన్నది చూడకుండా ప్రిస్కిప్షన్ రాసేస్తున్నారనేది ఈ సర్వేల సారాంశం. ఈ నివేదికలను ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ ఎథిక్స్ అనే మ్యాగజైన్, ఓ అంతర్జాతీయ న్యూస్ వెబ్ సైట్ ఎప్పటికప్పుడు ప్రచురిస్తూనే ఉంటాయి. కొంతమంది కమర్షియల్ డాక్టర్లనుంచి ఎదురయ్యే ముప్పు గురించి నలుగురికీ తెలిస్తే మంచిదేగా మరి. అయితే నిజాయితీగా నిబద్ధతతో సేవే పరమావధిగా వైద్య వృత్తిలో సేవలందిస్తున్న డాక్టర్లు చాలామందే ఉన్నారు.
రోగకారకమైన సూక్ష్మజీవిని నిర్మూలించడానికి యాంటి బయాటిక్స్ నిర్దేశిత మోతాదులో వాడుతారు. అవసరానుగుణంగా మోతాదు పెంచడం డాక్టర్ల పర్యవేక్షణలో జరగాలి. కానీ మన డాక్టర్లు ఇష్టం వచ్చినట్లు యాంటీ బయాటిక్స్ రాసేస్తున్నారన్నది అధ్యయనం నిరూపించింది. మందులు ఇష్టానుసారం మింగేస్తే మనిషిలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. డాక్టర్లు ఇలా ఎందుకు చేస్తున్నారంటే ఆ మందులు తయారుచేసిన ఫార్మాస్యూటికల్ కంపెనీలు దండిగా కమీషన్లు ముట్టచెప్తున్నాయిట. కంపెనీల తరఫున రిప్రెజెంటివ్‌లు డాక్టర్లను కలుస్తుంటారు. శాంపిల్ మందులు ఇచ్చి వెళ్తుంటారు. ఆ డాక్టర్లు లేదా ఆస్పత్రి చుట్టుప్రక్కలున్న మందుల షాపుల్లో తమ మందుల స్టాక్ పెట్టిస్తారు. ఇక డాక్టర్లు తమ దగ్గరకొచ్చిన ప్రతిరోగికి ఆ మందులు వీలు వెంబడి రాస్తుండాల్సిందే. మందులే కాదు మెడికల్ టెస్టులు, ఎక్స్‌రేలు, రక్త, మల మూత్ర పరీక్షలు, స్కానింగులు, ఇసిజిలు, ఈఎంఆర్‌ఐలు ఎక్కడికక్కడ డాక్టర్లకు కమీషన్లు అందుతుంటాయి. బిల్లుమీద డాక్టర్లకు కమీషన్ సుమారు ఇరవై నుంచి యాభై శాతం దాకా వుంటుంది. స్పెషలిస్టు డాక్టర్లకు డెబ్భై శాతం ఇంటెన్సివ్ అందుతుందనేది ఆ రంగంలోనివారే చెప్తున్న మాట. ఏసి కార్లు, ప్లాస్మా టీవీలు కూడా ఇస్తుంటారని ఇటీవల నెల్లూరు ప్రాంతంలో జరిగిన సర్వేలో కొంతమంది డాక్టర్లు నిర్మొహమాటంగా చెప్పారట.
పేషెంట్లలో పేద, ధనిక వర్గాలుంటాయి. డబ్బు దగ్గర ఒకసారి పీనాసిగాను, మరోసారి డాంబికంగానూ వ్యవహరించే మధ్యతరగతివారు ఉండనే ఉంటారు. ఆరోగ్యం మీద మనిషికి ఎంత స్పృహ పెరిగినా, ఎంత చైతన్యం వచ్చినా చాలా సందర్భాల్లో డాక్టర్ దగ్గరికెళ్లాలంటేనే జంకే వారి సంఖ్య ఎక్కువే. ఎంత డబ్బు గుంజుతారోనన్న భయం.
కన్సల్టింగ్ ఛార్జి కనీసం వంద, స్పెషలిస్టులైతే మూడు వందలు చెల్లించాల్సిందే. ఇక మందుల లెక్క మూడు వందలు దాటుతుంది. చిన్న రోగానికైనా చాంతాడంత ప్రిస్కిప్షన్. మందులు, టెస్టులు కలిసి వెయ్యి రూపాయల పైమాటే. ఇక చిన్న సైజు ఆస్పత్రి గడప తొక్కినా చికున్‌గున్యా, డెంగ్యూ లాంటి రోగాల పేరుతో వేలకు వేలు ఖర్చుపెట్టాల్సిందే. ఒకవేళ ఇన్సూరెన్స్ గట్రా ఉందని తెలిసిందంటే ఐసియూలో వెంటిలేటర్లు, వారానికిపైగా చికిత్స, మరో నెల్లాళ్లు మందులు.. అన్నీ కలిపి అర లకారం. అందుకే పేద, మధ్యతరగతి ఇళ్లల్లో రోగాలు వచ్చాయంటే బెంబేలెత్తిపోతున్నారు.
డాక్టర్లనే పూర్తిగా తప్పుబట్టడానికి లేదు. తక్కువ మందులు రాస్తే పేషెంటే శంకిస్తాడు. రోగం ఆ మరుసటి రోజుకు తగ్గుముఖం పట్టకపోతే మందుల మోతాదు పెంచమని పేషెంట్లే అడుగుతారు. ఇలాంటప్పుడు డాక్టర్లు, మందుల కంపెనీలు మననే నమ్ముకుని వ్యాపారం చేస్తున్నారు కదా.. వాళ్లకు మాత్రం మనమీద జాలి, దయ, కరుణ ఎందుకుండాలి? ఎప్పటికప్పుడు కొత్త కొత్త మందులు తయారుచేస్తున్న ఫార్మా కంపెనీలు వాటిని అమ్ముకోవడానికి డాక్టర్లకు ఇంటెన్సివ్‌లు సమర్పించుకోకపోతే ఇక పనెలా జరుగుతుంది? ఇదంతా పేదవాడి ముఖ్యంగా మధ్యతరగతివాడి కర్మ. పేషెంట్ ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి గమనించి నిదానంగా కుదుటపడేలా వైద్యం చేసే డాక్టర్లను మనం నమ్మనంత వరకూ వైద్యం వ్యాపారంగానే ఉంటుంది. కాలం చెల్లిన, నిషేధిత మందులు విచ్చలవిడిగా అందుబాటులోనే ఉంటాయి. ఈమధ్య ఉభయ తెలుగు రాష్ట్రాల రాజధాని నడిబొడ్డునే ఓ కార్పొరేట్ ఆస్పత్రి కాసులకు కక్కుర్తిపడి నిర్వహించిన అనవసరపు ఆపరేషన్ మన విజ్ఞానమే మనని వెక్కిరిస్తోందని తేటతెల్లం చేసింది. తెల్లకోటూ, స్టెతస్కోపూ సాక్షిగా డాక్టర్లే కమీషన్ ఏజెంట్లుగా మారిపోతూంటే ఇక పేద రోగిని ఎవరు కాపాడాలి?! ఇంకే భగవంతుడితో మొరపెట్టుకోవాలి.

-మురళి