రాష్ట్రీయం

ఇక అంతా స్వదేశీ పరిజ్ఞానంతోనే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యుద్ధనౌకల దిగుమతికి స్వస్తి తూర్పు నౌకాదళ ప్రధాన అధికారి సతీష్ సోనీ

విశాఖపట్నం, డిసెంబర్ 3: యుద్ధనౌకల తయారీలో రష్యా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునేవాళ్ళం.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.. యుద్ధనౌకలను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసే శక్తి మనకుంది అని తూర్పు నౌకాదళ అధికార సతీష్ సోనీ అన్నారు. డిసెంబర్ 4 నేవీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐఎన్‌ఎస్ సహ్యాద్రిపై గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1963లోనే కోల్‌కత్తా షిప్‌యార్డులో ఐఎన్‌ఎస్ అజయ్ యుద్ధ నౌకను తయారు చేశామన్నారు. 1972లో స్వదేశీ పరిజ్ఞానంతో ఐఎన్‌ఎస్ నీలగిరి యుద్ధ నౌకను తయారు చేయగలిగామన్నారు. ఈమధ్య కాలంలో ఐఎన్‌ఎస్ సహ్యాద్రిని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశామని అన్నారు. 90 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఐఎన్‌ఎస్ కర్మత్ త్వరలోనే నౌకాదళంలో చేరబోతోందని సోనీ వివరించారు. దేశంలోని వివిధ షిప్‌యార్డుల్లో 40కి పైగా యుద్ధనౌకలు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోనే తయారవుతున్నాయని ఆయన చెప్పారు. ఇకపై రష్యా సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్దగా వినియోగించుకోనవసరం లేదని ఆయన చెప్పారు.
ఇదిలా ఉండగా వచ్చే ఏడాది ఫిబ్రవరి నాలుగు నుంచి ఎనిమిదో తేదీ వరకూ విశాఖలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకి ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయని ఆయన చెప్పారు. 89 దేశాలకు ఆహ్వానపత్రాలు పంపించామని, ఇప్పటి వరకూ 25 దేశాల నుంచి నేవీ ప్రధానాధికారులు వస్తున్నట్టు వర్తమానం పంపించారని సోనీ తెలియచేశారు. అలాగే 32 మంది ప్రతినిధులు హాజరవుతున్నట్టు ఇప్పటి వరకూ తమకు సమాచారం అందిందని అన్నారు. ఫ్లీట్ రివ్యూని దృష్టిలో పెట్టుకుని నగర సుందరీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా లక్ష మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్ణయించామని, ఆ కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన జరుగుతోందని చెప్పారు. లక్షవ మొక్కను ప్రధాని మోదీ విశాఖలో నాటనున్నారని ఆయన తెలిపారు. ఈ విలేఖరుల సమావేశంలో వైస్ అడ్మిరల్ విమల్‌వర్మ, రియర్ అడ్మిరల్స్ ఎస్‌వి బోకర్, ఎస్‌ఆర్ శర్మ, ప్రదీప్ రాణా, సంజయ్‌మదోరా పాల్గొన్నారు.