తెలంగాణ

సాయం కోసం ఇందూరు రైతు ఎదురుతెన్నులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రబీలో పూర్తిగా అటకెక్కిన ‘వరి’ సాగు విస్తీర్ణం..!
జిల్లావ్యాప్తంగా ఎక్కడా వరినాట్లు వేయని దైన్యం

నిజామాబాద్, డిసెంబర్ 31: ఉత్తర తెలంగాణ జిల్లాల ధాన్యాగారంగా విలసిల్లిన నిజామాబాద్ జిల్లాను కరవు రక్కసి వెంటాడడంతో సేద్యపు రంగం మనుగడే ప్రశ్నార్ధకంగా మారుతోంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఈ ఏడాదైతే వ్యవసాయ రంగం పూర్తిగా కుదేలవడంతో జిల్లా రైతాంగం తల్లడిల్లాల్సి వచ్చింది. ఖరీఫ్‌లో కాస్తోకూస్తో పంటల సాగును చేపట్టిన అన్నదాతలు, ప్రస్తుత రబీ సీజన్‌లోనైతే ప్రతీకూల పరిస్థితులను చూసి పంటలు సాగు చేసేందుకు ఏమాత్రం సాహసించడం లేదు. జిల్లా అంతటా కరవు ఛాయలు దట్టంగా అలుముకుని ఉండడంతో ప్రభుత్వం సైతం స్పందించి జిల్లాలోని మొత్తం 36 మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించిందంటే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. మూడు వారాల క్రితం జిల్లాలో పంట నష్టం పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర కరవు బృందం సభ్యులు సైతం జిల్లాలో నెలకొని ఉన్న దుర్భిక్ష పరిస్థితులను చూసి చలించిపోయారు. అధికారులు పంపించిన నివేదికల కంటే మరెన్నో ఎక్కువ రెట్లు కరవు తీవ్రత తాండవిస్తోందని కేంద్ర బృందం సభ్యులే పేర్కొనడం గమనార్హం. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సైతం కేంద్రానికి నష్టపరిహారం నిధుల కోసం ఇదివరకు పంపించిన ప్రతిపాదనలను సవరిస్తూ మరోదఫా సరికొత్త ప్రతిపాదనలు సమర్పించింది. తాజాగా బుధవారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌తో జిల్లాకు చెందిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి భేటీ అయి త్వరితగతిన కేంద్రం నుండి కరవు సహాయక నిధులు విడుదల చేయాలని కోరారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందిస్తూ ఈ నెల 7వ తేదీన రాష్ట్రంలో చేపడుతున్న హార్టికల్చర్ యూనివర్శిటీ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకావడానికి ముందే కేంద్రం నుండి కరవు సహాయం అందేలా చూస్తానని హామీ ఇవ్వడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కేంద్రం నుండి నిధులు విడుదలైతే భూముల సర్వే నెంబర్లను అనుసరిస్తూ పంటలు నష్టపోయిన బాధిత రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా నష్టపరిహారం జమ చేయనుంది. ప్రకృతి అనుకూలించక తీవ్రంగా నష్టపోయిన రైతాంగానికి కరవు సహాయక నిధులు ఎంతోకొంత ఉపశమనం కల్పించనున్నాయి. అయితే ప్రస్తుత రబీ సీజన్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తోడ్పాటు లభించినా, జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం సాధారణ స్థాయికి చేరుకునే అవకాశాలు ఏ కోశానా కనిపించడం లేదు. ప్రత్యేకించి వరి పంట సాగు విస్తీర్ణమైతే పూర్తిగా అటకెక్కినట్టేనని భావిస్తున్నారు. ఈ ఏడాది 55 శాతానికి పైగా లోటు వర్షపాతం నెలకొనడంతో జిల్లాలోని ప్రధాన జలాశయాలన్నీ నీటి నిల్వలు లేక వెలవెలబోతున్నాయి. జిల్లాకు ప్రధాన ఆధారంగా ఉన్న నిజాంసాగర్ రిజర్వాయర్‌లో ఒక అర టిఎంసిలలోపే నీరు నిలువ ఉండగా, ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాంసాగర్ జలాశయంలోనూ నీటి నిల్వలు డెడ్‌స్టోరేజీకి చేరాయి. ఇవి తాగునీటి అవసరాలకు కూడా సరిపోయేలా లేవు. ఇతర ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లోనూ నీటి జాడలు లేక కళావిహీనంగా దర్శనమిస్తున్నాయి. వర్షాకాలం ఆరంభం నుండే గడ్డు పరిస్థితులు ఎదురవడంతో ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం నిర్దేశిత లక్ష్యానికి చేరుకోలేకపోతోంది. ఇక రబీలోనైతే ఎక్కడ చూసినా రైతులు తమ పంట భూములను పడావుగా వదిలేసిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. ప్రతిఏటా రబీలో సుమారు 2 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి పంట సాగు చేసేవారు కాగా, ఈయేడు ఇప్పటివరకు జిల్లాలో కనీసం ఐదు శాతం మేర కూడా వరి నాట్లు వేయలేదు. అతికొద్ది మంది బోరుబావుల్లో నీరు కలిగిన రైతులు మాత్రమే నారుమళ్లు సిద్ధం చేసినప్పటికీ, వరి నాట్లు వేయాలా? వద్దా? అనే సంశయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆరుతడి పంటలు సైతం ఆశించిన స్థాయిలో సాగయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఓ వైపు జలాశయాల్లో నీటి నిల్వలు అంతరించిపోగా, మరోవైపు భూగర్భ జలాలు అధఃపాతాళానికి చేరుకుని బోరుబావులు వట్టిపోవడంతో పంటల సాగుకు రైతులు ససేమిరా అంటున్నారు.