అంతర్జాతీయం

వైదొలగిన బ్రిటన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 24: యూరోపియన్ యూనియన్‌నుంచి బ్రిటన్ వైదొలగడానికి అనుకూలంగా ప్రజలు తీర్పు ఇవ్వడంతో ప్రధాని డేవిడ్ కామెరాన్ శుక్రవారం తన పదవికి రాజీనామా ప్రకటించారు. బ్రిటన్ రెఫరెండం ఫలితాలు 28 దేశాలు సభ్యులుగా ఉన్న యూరోయపన్ యూనియన్‌కే కాక మొత్తం ప్రపంచానికే షాక్‌గా మారాయి. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లన్నీ దారుణంగా పతనమైనాయి. మరోవైపు గురువారం జరిగిన రెఫరెండంలో ఇయునుంచి నిష్క్రమణకు కేవలం 51.9 శాతం మంది మద్దతు పలికిన నేపథ్యంలో ఇతర దేశాలనుంచి ముఖ్యంగా ఇయు దేశాలనుంచి అక్కడికి వలస వెళ్లిన వారి స్థితి ఏమిటి, ఆ దేశంతో ఆర్థిక సంబంధాలు ఎలా ఉంటాయనేది కూడా ప్రశ్నార్థకంగా మారాయి. రెఫరెండంకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడిన కొద్ది సేపటికే కామెరాన్ తన అధికార నివాసమైన 10, డౌనింగ్ స్ట్రీట్‌నుంచి బైటికి వచ్చి తాను రాజీనామా చేయాలని అనుకుంటున్నట్లు ప్రకటించారు. ఇయునుంచి వైదొలిగే ప్రక్రియను ప్రారంనించడం కోసం కొత్త ప్రధాని అక్టోబర్‌లో బాధ్యతలు చేపడతారని ఆయన చెప్పారు. కాగా, ఇతర దేశాలనుంచి బ్రిటన్‌కు ప్రజల రాకకు సంబంధించి, అలాగే బ్రిటన్‌లో సేవలకు సంబంధించి కానీ తక్షణం ఎలాంటి మార్పు ఉండబోదని ప్రపంచ దేశాలు, ముఖ్యంగా ఐరోపా కూటమి దేశాలకు ఆయన హామీ ఇచ్చారు. కామరాన్ ఈ ప్రకటన చేసేటప్పుడు భార్య సమంతా ఆయన పక్కనే ఉన్నారు. ‘ఈ నౌకను ముందుకు తీసుకెళ్లడానికి బహుశా ఒక కొత్త కెప్టెన్ కావాలి. ఈ నౌకను ఒడ్డుకు చేర్చడానికి నేను తగిన వాడిని కాదు. అయితే నేను చేయగలిగిన సాయమంతా చేస్తాను’ అని కామెరాన్ అన్నారు. గురువారం జరిగిన రెఫరెండంను భారీ ప్రజాస్వామిక ప్రక్రియగా ఆయన అభివరిణస్తూ ప్రజల తీర్పును గౌరవించాల్సిన అవసరముందన్నారు. వారు ఇచ్చిన ఆదేశాన్నీ అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అక్టోబర్‌లో కన్సర్వేటివ్ పార్టీ మహాసభ ప్రారంభమయ్యేలోగానే కొత్త ప్రధాని బాధ్యతలు చేపడతారని నేను అనుకుంటున్నాను’ అని ఆయన గద్గద స్వరంతో అన్నారు.బ్రిటన్ ఆర్థిక మూలాలు బలంగానే ఉన్నాయంటూ ప్రపంచ దేశాలకు, మార్కెట్లకు మరోసారి హామీ ఇచ్చారు. కాగా, మంత్రివర్గం సోమవారం సమావేశమై కామెరాన్ పదవినుంచి తప్పుకోవడానికి సంబంధించిన టైమ్‌టేబుల్‌ను రూపొందిస్తుందని భావిస్తున్నారు.
ఒక్కటిగానే ఉంటాం: ఇయు
ఇయునుంచి నిష్క్రమణకు బ్రిటన్ ప్రజలు ఓటేసిన తర్వాత కూడా ఇయు ఒక్కటిగానే ఉండాలనే కృతనిశ్చయంతో ఉందని యూరోపియన్ యూనియన్ అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్ అంటూ, దీనిపై అనవసరపు ఆందోళనతో ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించారు. ‘మా ఐక్యతను కొనసాగించాలనే కృతనిశ్చయంతో మేమంతా ఉన్నామని ఈ రోజు 27 దేశాల నేతల తరఫున నేను చెప్తున్నాను’ అని టస్క్ బ్రసెల్స్‌లో మీడియాకు చెప్పారు. ఇయునుంచి వైదొలగాలన్న బ్రిటన్ నిర్ణయం ప్రభావం ఇతర సభ్య దేశాలకు విస్తరించదన్న నమ్మకాన్ని ఇయు పార్లమెంటు అధ్యక్షుడు మార్టిన్ షుల్జ్ వ్యక్తం చేశారు. ఇయు ప్రపంచంలోనే అతిపెద్ద ఏకైక మార్కెట్ అని, బ్రిటన్ ఆ మార్కెట్‌తో సంబంధాలను మాత్రమే తెంచుకుందని ఆయన అన్నారు.
తేడా 12 లక్షలే
ఇయులో నాలుగు దశాబ్దాల బ్రిటన్ సభ్యత్వాన్ని రద్దు చేసుకోవడానికి సంబందించిన రెఫరెండం తుది ఫలితాలను శుక్రవారం బ్రిటన్ ఎన్నికల కమిషన్ ప్రధాన కౌంటింగ్ అధికారి జెన్నీ వాట్సన్ మాంచెస్టర్ టౌన్‌హాలునుంచి ప్రకటించారు. మొత్తం 72.2 శాతం ప్రజలు అంటే మూడు కోట్ల మందికి పైగా ఓటర్లు రెఫరెండంలో పాల్గొన్నారు. ఇయునుంచి బ్రిటన్ వైదొలగడానికి అనుకూలంగా 51.9 శాతం మంది ఓటేయగా, కొనసాగడానికి అనుకూలంగా 48.1 శాతం మంది ఓటేవారు. బ్రెగ్జిట్‌కు అనుకూలంగా 1,74,10,742 మంది ఓటేయగా, ఇయులోనే కొనసాగడానికి అనుకూలంగా 1,61,41,241 మంది ఓటేశారు. అంటే 12,69,501 ఓట్ల తేడాతో బ్రెగ్జిట్ విజయం సాధించినట్లయింది. రెఫరెండం ప్రక్రియను కామెరాన్ ప్రశంసిస్తూ, ఇంగ్లండ్, స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్, జిబ్రాల్టర్‌లకు చెందిన 3.3 కోట్లకు పైగా ప్రజలు ఈ రెఫరెండంలో పాల్గొన్నారని, ఇలాంటి ముఖ్యమైన నిర్ణయాల్లో ఈ దీవులకు చెందిన ప్రజల తీర్పును మనం విశ్వసిస్తున్నందుకు గర్వించాలని అన్నారు. లండన్, స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్ ప్రజలు ఇయులో కొనసాగడానికి అనుకూలంగా తీర్పు ఇవ్వగా ఇంగ్లండ్ ఉత్తర భాగం, వేల్స్, ఇంగ్లీషు కౌంటీలలో చాలావాటిలో బ్రెగ్జిట్‌కు అనుకూలంగా బలమైన తీర్పు వచ్చింది.

చిత్రం... శుక్రవారం మీడియాతో మాట్లాడేందుకు లండన్ 10 డౌనింగ్ స్ట్రీట్‌లోని అధికారిక నివాసం నుంచి భార్య సమంతతో కలిసి బయటకు వస్తున్న బ్రిటన్ ప్రధాని కామెరాన్