అంతర్జాతీయం

బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన థెరిసా మే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 13: థెరిసామే బుధవారం బ్రిటన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఐరన్ లేడీగా పేరు తెచ్చుకున్న మార్గరేట్ థాచర్ తర్వాత బ్రిటన్‌కు ఒక మహిళ ప్రధానమంత్రి కావడం ఇదే ప్రథమం. ఇటీవల జరిగిన రెఫరెండంలో ఐరోపా కూటమినుంచి బ్రిటన్ వైదొలగడానికి అనుకూలంగా మెజారిటీ ప్రజలు తీర్పు చెప్పడంతో డేవిడ్ కామెరాన్ ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం, ఆ తర్వాత అధికార కన్సర్వేటివ్ పార్టీ తరఫున 59 ఏళ్ల థెరెసా మే ప్రధాని పదవికి అభ్యర్థి కావడం తెలిసిందే. ‘బ్రెగ్జిట్’ తర్వాత ప్రభుత్వపరంగా తీసుకోవలసిన అనేక నిర్ణయాలు పెండింగ్‌లో ఉన్న సమయంలో థెరెసా ప్రధాని బాధ్యతలు చేపట్టడం గమనార్హం. అన్నిటికన్నా ముందు ఆమె యూరోపియన్ యూనియన్‌నుంచి బ్రిటన్ వైదొలగడానికి మార్గాన్ని సుగమం చేసేందుకు వీలుగా ఇయుతో చర్చలు జరపగల సమర్థులైన వారిని తన మంత్రివర్గంలోకి తీసుకోవలసిన అవసరం ఉంది. 1979-90 మధ్య కాలంలో ప్రధానిగా ఉండిన మార్గరేట్ థాచర్ తర్వాత బ్రిటన్ ప్రధాని బాధ్యతలు చేపడుతున్నది మహిళ థెరెసాయే. ఐరన్ లేడీగా ముద్రపడిన థాచర్‌లాగానే థెరెసా మే కూడా దృఢమైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తిగా గుర్తింపు పొందారు. డేవిడ్ కామెరాన్ మంత్రివర్గంలో హోం మంత్రిగా ఉండిన థెరెసా మే గత 50 ఏళ్లబ్రిటన్ చరిత్రలో సుదీర్ఘకాలం హోం మంత్రిగా కొనసాగిన వ్యక్తిగా కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు.

మధ్యప్రాచ్యంలో దిగజారుతున్న పరిస్థితులు

న్యూయార్క్, జూలై 13: మధ్యప్రాచ్యంలో రోజురోజుకూ శాంతిభద్రతల పరిస్థితులు దిగజారటం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్రవాదం, విప్లవ ధోరణులు అనూహ్యంగా పెరుగుతున్నాయని వ్యాఖ్యానించింది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ఏర్పాటు చేసిన చర్చాకార్యక్రమంలో ఐరాసకు భారత ఉప శాశ్వత ప్రతినిధి తన్మయలాల్ పాల్గొన్నారు. ‘‘పెరుగుతున్న ఉగ్రవాదం, విప్లవ ధోరణులు మధ్యప్రాచ్యంలో అస్థిరతకు కారణమవుతున్నాయి. శాంతి చర్చలు నిలిచిపోయి దాదాపు రెండు సంవత్సరాలు అవుతున్నాయి. తిరిగి ప్రారంభమయ్యే ఎలాంటి సూచనలూ కన్పించటం లేదు.
పాలస్తీనా భూభాగంలో దారుణమైన అమానవీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయిల్‌లో హింసాత్మక ఘటనలు పెరిగిపోయాయి. ఇరుపక్షాల మధ్య తక్షణం చర్చల ప్రక్రియ ప్రారంభం అయ్యేందుకు అంతర్జాతీయ సమాజం పూనుకోవాలి’’ అని తన్మయలాల్ పేర్కొన్నారు. ఐరాస సెక్రటరీ జనరల్ బాన్‌కీ మూన్ రెండు దేశాల మధ్య శాంతి స్థాపనకు సాహసోపేతమైన చర్యలు చేపట్టడం పట్ల తన్మయలాల్ అభినందించారు.