అంతర్జాతీయం

కుదిపేసిన భూకంపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అకుమోలి (ఇటలీ)/ యాగోన్, ఆగస్టు 24: ఇటలీ దేశాన్ని బుధవారం తెల్లవారుజామున శక్తిమంతమైన భూకంపం కకావికలం చేసింది. రిక్టర్ స్కేలులుపై 6.0-6.2 పాయింట్ల తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం తాకిడికి ఇప్పటివరకు కనీసం 73 మంది మృతి చెందగా వేలాది మంది గాయపడ్డమో, కూలిన భవనాల శిథిలాల కింద చిక్కుపడి పోయారు. మరోపక్క మధ్య మయన్మార్‌లో రిక్టర్ స్కేలుపై 6.8 పాయింట్ల తీవ్రతతో పెను భూకంపం సంభవించింది. ఫలితంగా కనీసం ఒక వ్యక్తి చనిపోగా,పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. ప్రాచీన నగరమైన బగాన్‌లో 60కి పైగా పగోడాలు ధ్వంసమైనాయి. ఇటలీలో సంభవించిన భూకంపం తాకిడికి వేల సంఖ్యలో నిరాశ్రయులుగా మారిపోయి తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకున్నారు. 2009లో వచ్చిన భారీ భూకంపానికి సర్వ నాశనమైన ప్రాంతానికి ఉత్తరంగా పెరుగియా నగరానికి 72 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూకంప కేంద్రానికి చుట్టుపక్కల ఉన్న ఉంబ్రియా, మార్చే, లాజియో తదితర గ్రామాలు దాదాపుగా నేలమట్టమై పోయాయి. అమట్రిసి, అకుమోలి, అర్కాటా డెల్ టొరంటో గ్రామాల్లో ఇప్పటివరకు 73 మంది మరణించినట్లు ఇటలీ పౌర రక్షక విభాగం అధికారులు సైతం ధ్రువీకరించారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని వారు అంటున్నారు. భూ ప్రకంపల తీవ్రతకు భీతిల్లిన జనం ప్రాణాలను అరచేతుల్లో పట్టుకుని వీధుల్లోకి పరుగులు తీయడం కనిపించింది. భూకంపం తాకిడికి ఎమాట్రిస్ నగరం పూర్తిగా ధ్వంసమైందని ఆ నగర మేయర్ సెర్జియో పిరోజి తెలిపారు. భూకంపం తాకిడికి వందలాది భవనాలు నేలకూలాయి. ఇటలీ రాజధాని రోమ్‌లో సైతం 20 సెకన్ల పాటు భూ ప్రకంపనలు వచ్చాయి. భవనాల శిథిలాల కింద వేలాది మంది చిక్కుకు పోయి ఉన్నట్లు స్థానిక ప్రజలు చెబుతున్నారు. శిథిలాల కింద చిక్కుపడిన వారిని బైటికి తీసేందుకు సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయి. ఎమాట్రిస్ నగరం ఓ పర్వతంపైనుండే పర్యాటక కేంద్రం వేసవి తాపంనుంచి సేద తీరడం కోసం వేలాది మంది పర్యాటకులు ప్రతి ఏటా ఇక్కడికి వస్తుంటారు. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3.36 గంటలకు తొలి భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2 పాయింట్లు ఉంది. భూమి అడుగున పది కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించినట్లు అమెరికా జియలాజికల్ సర్వే అంచనా వేసింది. ఆ తర్వాత మరో గంటకు 5.4 పాయింట్ల తీవ్రతతో మరోసారి భూమి కంపించింది. ఇటలీలో తరచూ భూకంపాలు సంభవిస్తూనే ఉంటాయి. 2009లో అమ్రుజో ప్రాంతంలో సంభవించిన పెను భూకంపంలో 300మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే. దాని తర్వాత అంతటి తీవ్రతతో భూకంపం రావడం ఇదే మొదటిసారి.
మయన్మార్‌లో మరో భూకంపం
మధ్య మయన్మార్‌లో బుధవారం రిక్టర్ స్కేలుపై 6.8 పాయింట్ల తీవ్రతతో పెను భూకంపం సంభవించింది. ఫలితంగా కనీసం ఒక వ్యక్తి చనిపోగా,పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. ప్రాచీన నగరమైన బగాన్‌లో 60కి పైగా పగోడాలు ధ్వంసమైనాయి. భూమి లోపల 84 కిలోమీటర్ల లోతులో సంభవించిన ఈ భూకంపం ప్రభావం పొరుగు దేశాలయిన థాయిలాండ్, భారత్, బంగ్లాదేశ్‌లలో సైతం కనిపించింది. భూప్రకంపనలతో భీతిల్లిన ప్రజలు ఇళ్లలోంచి వీధుల్లోకి పరుగులు తీశారు. భూకంపం సంభవించినప్పుడు దగ్గర్లో ఉన్న భవనం కూలిపోవడంతో మాగ్వే ప్రాంతంలో ఒక వ్యక్తి చనిపోయాడు. భూకంపం తాకిడికి భూకంపం కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మయన్మార్‌లో అత్యంత ప్రముఖ పర్యాటక కేంద్రమైన బగాన్‌లో దాదాపు 60 బౌద్ధ ఆలయాలు( పగోడాలు) దెబ్బతిన్నట్లు బగాన్ సాంస్కృతిక విభాగం అధికారి ఒకరు చెప్పారు. సూర్యాస్తమయాన్ని తిలకించడం కోసం 2500కు పైగా ఆలయాలున్న ఈ నగరానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు రావడం ప్రతిరోజూ సాధారణ దృశ్యం. పొరుగున ఉన్న మయన్మార్‌లో సంభవించిన భూకంపనల ప్రభావం మన దేశంలోని మయన్మార్ సరిహద్దులకు ఆనుకుని ఉన్న అస్సాం, పశ్చిమ బెంగాల్‌తో పాటుగా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో కనిపించింది. గౌహతిలో ప్రకంపనలు రావడంతో భీతిల్లిన జనం ఇళ్లలోంచి బైటికి పరుగులు తీశారు. అయితే ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు ఎక్కడా ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదు.

చిత్రం... భూకంపం తాకిడికి ఇటలీలో నేలమట్టమైన భవనాలు