అంతర్జాతీయం

‘పారిస్’కు గుడ్‌బై!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మార్చి 29: పర్యావరణ ఒప్పందాలపై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రవేశపెట్టిన విధానాలను ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్తిగా మార్చివేశారు. పర్యావరణ పరిరక్షణకు ఒబామా తీసుకొచ్చిన విధానాలను మార్చివేస్తూ ట్రంప్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. భూతాపానికి వ్యతిరేకంగా పోరాడటానికి సాగుతున్న అంతర్జాతీయ కృషికి ఇది పెద్ద దెబ్బ. పర్యావరణ పరిరక్షణ సంస్థ (ఇపిఎ) వద్ద ఈ కార్యనిర్వాహక ఆదేశాలపై ట్రంప్ సంతకం చేశారు. దేశంలో బొగ్గు పరిశ్రమకు మద్దతిస్తానని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చడంలో భాగంగా ట్రంప్ ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు ప్రభుత్వ అతి జోక్యాన్ని నివారిస్తాయని, ఉత్పత్తి, ఉద్యోగాల కల్పనలో కొత్త శకం ప్రారంభమవుతుందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఆదేశాలపై సంతకం చేసిన అనంతరం మాట్లాడుతూ ‘ఈనాటి కార్యనిర్వాహక చర్యతో నేను అమెరికా ఇంధనంపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయడానికి, ప్రభుత్వ అతి జోక్యాన్ని ఉపసంహరించు కోవడానికి, ఉద్యోగాల సృష్టిని దెబ్బతీసే నియంత్రణలను రద్దు చేయడానికి చరిత్రాత్మక చర్యలు తీసుకుంటున్నాను’ అని అన్నారు. ‘నేను అమెరికా ప్రజలకు ఉద్యోగాలను సృష్టించడానికి, అమెరికాను మరింత సుసంపన్నం చేయడానికి తీసుకుంటున్న చర్యల పరంపరలో ఈనాటి చర్య తాజాది’ అని అన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించటం, అమెరికా ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేయడం అనేవి పరస్పరం వేర్వేరు లక్ష్యాలు కావని ట్రంప్ దృఢంగా విశ్వసిస్తున్నారని వైట్ హౌస్ ప్రెస్ కార్యదర్శి సీన్ స్పైసర్ పేర్కొన్నారు. ఆర్థిక వృద్ధిని, ఉద్యోగాల కల్పనను త్యాగం చేయకుండానే మనం స్వచ్ఛమైన గాలిని, స్వచ్ఛమైన నీరును కలిగి ఉండటానికి ఈ ఆదేశాలు దోహదం చేస్తాయని ఆయన అన్నారు. దేశీయంగా ఇంధన ఉత్పత్తికి ఆటంకంగా ఉన్న అన్ని నియంత్రణలను, నియమాలను, విధానాలను సమీక్షించాలని అన్ని ఏజెన్సీలకు ఈ ఆదేశాలు సూచిస్తున్నాయని ఆయన వివరించారు. అయితే 2015 నాటి పారిస్ వాతావరణ ఒప్పందంపై ట్రంప్ ప్రభుత్వ వైఖరి ఏంటనే విషయాన్ని ఈ ఆదేశాలు వెల్లడించలేదు. అయితే ఈ ఆదేశాలు ఆ ఒప్పందంపై ప్రభావం చూపుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా తాను ఎన్నికయితే పారిస్ ఒప్పందం నుంచి అమెరికాను ఉపసంహరింప చేస్తానని ట్రంప్ ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రపంచంలోనే చైనా తరువాత గ్రీన్‌హౌస్ వాయువులను ఎక్కువ విడుదల చేస్తున్న దేశం అమెరికా కావడం విశేషం.
డెమొక్రాట్ల ధ్వజం
ట్రంప్ జారీ చేసిన తాజా ఆదేశాలపై ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ, పర్యావరణ పరిరక్షణ సంస్థలు విరుచుకుపడ్డాయి. స్వచ్ఛ ఇంధన ఆర్థిక వ్యవస్థ కోసం, భవిష్యత్తులో దేశ ప్రజల ఉద్యోగాల కోసం దశాబ్దాలుగా చేసిన కృషికి ట్రంప్ తాజా ఆదేశాలు తూట్లు పొడిచాయని విమర్శించాయి.