అంతర్జాతీయం

తోచక.. చంపేశాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెర్లిన్ (జర్మనీ), నవంబర్ 10: రోగుల ప్రాణాలు కాపాడాల్సిన నర్సు వారి పాలిట యమకింకరుడయ్యాడు. గుండెపోటుకు, రక్తప్రసరణలో తేడాలకు కారణమయ్యే మందులు ఇచ్చి దాదాపు వందమందికి పైగా రోగుల ప్రాణాలను నిలువునా తీసేశాడు. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఈ కేసుపై తాజాగా జర్మనీ పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. నీల్స్ హోగెల్ అనే 41 సంవత్సరాల మేల్ నర్స్ పాల్పడ్డ ఈ ఘాతుకాలకు సంబంధించి భయానకమైన వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. మొదట్లో ఈ నర్సు బారిన పడి మరణించిన రోగుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ తాజాగా వెలుగుచూస్తున్న కథనాలను బట్టి చూస్తే దాదాపు వందమందికి పైగా రోగుల ప్రాణాలు పోవడానికి నీల్స్ హోగెల్ కారణమన్న విషయం స్పష్టమవుతోంది. ఇప్పటివరకు 106మంది మరణానికి ఇతడే కారణమన్న అంశాన్ని దర్యాప్తు అధికారులు తేల్చారు. ఇంకా ఎన్నో మరణాలకు సంబంధించిన ఆధారాలు వెలుగుచూడాల్సి ఉన్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఇంటెన్సివ్ కేర్‌లో ఉండే రోగుల ప్రాణాలతోనే హోగెల్ చెలగాటమాడాడని గతంలోనే రుజువైంది. ఇందుకు సంబంధించి 2015లోనే రెండు హత్య కేసులు నాలుగు హత్యాయత్నం కేసులను అతడిపై నమోదు చేశారు. అయితే తాజాగా రోగుల మృతదేహాలను బయటికి తీయడంతో వారి శరీరంలో ఒక రకమైన మత్తు పదార్థం ఉన్నట్లుగా గుర్తించారు. ఆ పదార్థమే వారి మరణానికీ కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. దాదాపు 90మందికి పైగా హోగెల్ బారిన పడి మరణించారని రెండు నెలల క్రితమే జర్మనీ పోలీసులు నిర్ధారించారు. తాజాగా మరో పదహారు మంది మరణానికీ ఇతడే కారణమని తేల్చారు. 1999 - 2005 మధ్య కాలంలో రెండు ఆసుపత్రుల్లో హోగెల్ పనిచేశాడు. తాజా ఆధారాలను బట్టి హోగెల్ మరిన్ని తీవ్రమైన అభియోగాలను నమోదు చేయబోతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంటెన్సివ్ కేర్‌లో ఉండే రోగులకు తాను ఒక రకమైన మందులు ఇచ్చేవాడినని, దీనివల్ల వారి గుండె ఆగిపోవడమో లేదా రక్త ప్రసరణలో తేడా రావడమో జరిగేదని, అలాంటి పరిస్థితుల్లో వారిని మళ్లీ బతికించేందుకు తాను ప్రయత్నించేవాడినని ఇప్పటివరకు జరిగిన విచారణలో హోగెల్ వెల్లడించాడు. తాను చేసిన ఈ ప్రయత్నం విజయవంతమైతే తోటి సమకాలికుల మధ్య ఓ వెలుగు వెలిగిపోవచ్చునని భావించానన్నాడు. చాలా సందర్భాల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఏం చేయాలో తోచక తీవ్ర అనారోగ్య స్థితిలో ఉన్న రోగులకు ఈ రకమైన మందులను ఇచ్చేవాడినని కూడా తెలిపాడు. ఆ రోగి బతికితే ఆనందంతో ఉప్పొంగిపోయేవాడినని, తన ప్రయోగం వికటిస్తే చలించిపోయేవాడినని కూడా ప్రాసిక్యూటర్ల ముందు వెల్లడించాడు. ఈ రకంగా నర్సే రోగులను చంపడమన్నది సొంతంగా వైద్యం చేసి వారి ప్రాణాలతో చెలగాటమాడటమన్నది బహుశా వైద్య చరిత్రలోనే ఇది తొలిసారని జర్మనీ ప్రధాన దర్యాప్తు అధికారి అర్నే షిమెడ్ వెల్లడించారు. విచక్షణారహితంగా హోగెల్ రోగులను చంపేశాడని ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిపైనే ఈ ప్రయోగాలు చేశాడని అన్నారు. ఇప్పటివరకు వెలుగుచూసిన సాక్ష్యాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయని, తాము ఊహించిన దానికంటే కూడా మృతుల సంఖ్య ఎక్కువగానే ఉండే అవకాశముందని తెలిపారు.