అంతర్జాతీయం

సైనిక చర్యే పరిష్కారం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డానాంగ్, నవంబర్ 11: దీర్ఘకాలంగా యుద్ధంతో అస్తవ్యవస్తమైన సిరియాలో సమస్యకు సైనిక చర్యే పరిష్కారం కాదని అమెరికా, రష్యా అంగీకరించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ శనివారం నాడిక్కడ ఓ సంయుక్త ప్రకటన చేశారు. వియత్నాంలో జరుగుతున్న ఎపెక్ సమీట్‌కు హాజరైన ఇద్దరు అధ్యక్షులు పలు అంశాలపై చర్చించినట్టు క్రెమ్లిన్ వర్గాలు వెల్లడించాయి. ట్రంప్, పుతిన్ మధ్య పలు అంశాలపై అభిప్రాయభేదాలున్నాయన్న కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో డానాంగ్‌లో జరిగిన భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమీర్ పుతిన్ ముఖాముఖీ భేటీ అయి పలు అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. ఎపెక్ వేదికపై ఇరువును దేశాధినేతలు కరచాలనం చేసుకున్న తరువాత మూడు పర్యాయాలు పలు అంశాలపై మాట్లాడుకున్నారు. సిరియాపై ఇరువురు అగ్రదేశాధినేతలు ఓ స్పష్టమైన అభిప్రాయానికి వచ్చారని క్రెమ్లిన్ అధికారిక వెబ్‌సైట్ వెల్లడించింది. ఆరేళ్లుగా అంతర్యుద్ధంతో అల్లాడిపోతున్న సిరియాలో ఓ పరిష్కారం కనుగొనాలన్న అభిప్రాయం ట్రంప్, పుతిన్‌లో కలిగింది. సిరియాలో శాంతిని నెలకొల్పడానికి వైరీ వర్గాలతో చర్చలు, ఒడంబడిక చేయించాలని వారు స్పష్టం చేశారు. ‘సిరియాలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులను తొలగించి, శాంతిని పాదుగొల్పాలని ఇరుదేశాల అధ్యక్షులు నిర్ణయించారు. దీనికి సైనిక చర్య ఎంతమాత్రం పరిష్కారం కాదని భావించారు’ అని ఆ సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఐరాస నేతృత్వంలో శాంతి చర్చలకు ట్రంప్, పుతిన్ మొగ్గుచూపారని వెబ్‌సైట్ వెల్లడించింది. అయితే డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంపై వైట్‌హౌస్ నుంచి ఎలాంటి స్పందన లేదు. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసాద్‌కు అవసరమైన ఆయుధ సహకారాన్ని 2015 నుంచే రష్యా అందిస్తోంది. తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా ప్రభుత్వ దళాలు చేస్తున్న యుద్ధానికి రష్యా అండదండలు అందిస్తోంది. దీన్ని తమకు అనుకూలంగా మలచుకోవాలని చూస్తున్న శక్తులకు అమెరికా మద్దతు ఇస్తోందన్న ఆరోపణలున్నాయి. ఇరాక్‌లో ఐసిస్ ఉగ్రవాదులపై పోరాడుతున్న అమెరికా ఇక్కడ మరోలా వ్యవహరిస్తోందని రష్యా ఇటీవలే ధ్వజమెత్తడం గమనార్హం. ఏది ఎలాఉన్నా శనివారం ఇరుదేశాధినేతల చర్చలు పూర్తి సంతృప్తిని ఇచ్చినట్టు క్రెమ్లిన్ వర్గాలు స్పష్టం చేశాయి. ట్రంప్, పుతిన్ ముఖాముఖి కావడం ఇదే తొలిసారి కాదు. జి-20 దేశాల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఈ ఏడాది ప్రారంభంలో ఇద్దరు నేతలు భేటీ అయ్యారు.
ఎన్నికల్లో పుతిన్ జోక్యం లేదు!
అమెరికా ఎన్నికల్లో రష్యా అధ్యక్షడు వ్లాదిమీర్ పుతిన్ జోక్యం చేసుకున్నట్టు పెద్దఎత్తున కథనాలు వెలువడ్డ సంగతి తెలిసిందే. అయితే పుతిన్‌తో శనివారం ఇక్కడ భేటీ అయిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దానిపై వివరణ ఇచ్చారు. ‘అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నేనెలాంటి జోక్యం చేసుకోలేదు’ అని పుతిన్ తనతో అన్నారని ట్రంప్ వెల్లడించారు. డానాంగ్‌లో జరిగే ఎపెక్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఇరువురు అగ్రనేతలు రెండుమూడు సార్లు స్వల్ప భేటీ అయ్యారు. హొనోయ్ వెళ్తూ విమానంలో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ‘మీరు ఎన్ని సార్లయినా అడగండి. నా వద్ద ఉన్న సమాధానం ఒక్కటే. నేను అనవసరంగా జోక్యం చేసుకోలేదు’ అని పుతిన్ తనతో చెప్పారని ట్రంప్ పేర్కొన్నారు.

చిత్రం..వియత్నాంలోని డానాంగ్‌లో జరుగుతున్న ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ (ఎపెక్) సమ్మిట్‌కు హాజరైన అమెరికా, రష్యా, చైనా, జపాన్ తదితర దేశాల అధినేతలు