అంతర్జాతీయం

సిరియాపై రష్యా వైమానిక దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీరుట్, నవంబర్ 27: ఐసిస్ ఆధీనంలో వున్న ఈశాన్య సిరియాలోని ఓ గ్రామంపై రష్యా వైమానిక దళాలు జరిపిన దాడుల్లో 53మంది పౌరులు మృతిచెందారు. వీరిలో 21మంది వరకూ పిల్లలు ఉన్నారని చెబుతున్నారు. ఊఫ్‌రేట్స్ నది కుడిగట్టుకు ఆనుకుని వున్న డెయిర్ ఎజ్జోర్ ప్రావిన్స్‌లోని అల్-సఫా గ్రామంపై రష్యా వైమానిక దళాలు విరుచుకుపడ్డాయని సిరియా పరిస్థితులపై పని చేస్తున్న బ్రిటన్ ఆధారిత మానవ హక్కుల కమిటీ ఒకటి వెల్లడించింది. సిరియా నుంచి విశ్వసనీయ వర్గాల ద్వారా మానవ హక్కుల సంఘానికి అందిన సమాచారం ప్రకారం రష్యా వైమానిక దళాలు ఏకధాటిగా దాడులకు పాల్పడినట్టు చెబుతున్నారు. తొలుత దాడుల్లో 34మంది మృత్యువాత పడినట్టు కథనాలు వెలువడినా, ఘటనా ప్రాంతంలో స్వాధీనపర్చుకున్న మృతదేహాలను బట్టి చూస్తే భారీగానే పౌరులు మృతిచెందినట్టు తెలుస్తోంది. ‘ఘటనా ప్రాంతంలో శిథిలాల తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటల్పడుతూనే ఉన్నాయి. దీన్నిబట్టి అంచనా వేస్తే కనీసం 55మందికి పైనే చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నాం. దాడులు పౌరుల ఇళ్లను లక్ష్యం చేసుకునే సాగాయి’ అని సిరియాలోని మానవ హక్కులపై అధ్యయనం చేస్తున్న బ్రిటన్ బృందం ప్రధాన నాయకుడు రామి అబ్దెల్ రహ్‌మాన్ వెల్లడించారు. ఈ దాడుల్లో కనీసం 20మంది తీవ్రంగా గాయపడ్డారని, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. ఇదిలావుంటే, 2015 సెప్టెంబర్‌లో సిరియా అధ్యక్ష స్థానంపైకి బషార్ అల్-అసద్ వచ్చిన దగ్గర్నుంచీ, రష్యాతో వ్యూహాత్మక చెలిమి సాగుతోంది. సిరియాకు రష్యా మరింత సహకారం అందించడమే కాకుండా, ఇరు దేశాల మధ్య సైనిక సంబంధ సహకారాన్ని పెంపొందించుకుంటూ వస్తున్నాయి. దాడుల నేపధ్యంలో సిరియాలోని చాలా ప్రాంతాలను ఖాళీచేస్తూ వెళ్లిపోయిన ఐసిస్ జిహాదీలు, ప్రస్తుతం డెయిర్ ఎజ్జోర్‌నే తమ స్వాధీనంలో పెట్టుకున్నారు. సిరియాలో ఐసిసి ఆధీనంలోవున్న ప్రాంతాల్లో ఇదే చివరిది కూడా. ఆయిల్ బావులకు పెట్టింది పేరైన తూర్పు సిరియా నుంచి ఇరాక్ బోర్డర్ వరకూ జిహాదీలదే పైచేయిగావున్నా, ప్రస్తుత పరిస్థితుల్లో డెయిర్ ఎజ్జోర్‌లోని 9శాతం ప్రాంతంపై మాత్రమే పట్టుకలిగి ఉన్నారు. ప్రస్తుతం సిరియాలోని ఐసిసి ఉగ్రవాదలు రెండురకాల ముప్పు ఎదుర్కొంటున్నారు. ఒకటి సిరియాకు సహకరిస్తున్న రష్యా వైమానిక దళాల నుంచి అయితే, రెండోది అమెరికా సహకారంతో కుర్దిష్-అరబ్ ఫైటర్స్ సంయుక్తంగా దాడులకు దిగుతున్న సిరియా డెమొక్రాటిక్ దళాల నుంచి. 2011లో సిరియాలో తలెత్తిన అంతర్యుద్ధం నుంచి ఇప్పటి వరకూ సమారు 3.4 లక్షలమంది మృత్యువాతపడ్డారని లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

చిత్రం..సిరియాలోని ఐసిస్ ఉగ్రవాదులపై బాంబుల వర్షం కురిపిస్తున్న రష్యా విమానం టి-22ఎం3