అంతర్జాతీయం

ఉద్విగ్నం.. ఉత్కంఠ..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 23: మరికొన్ని గంటల వ్యవధిలో బ్రెగ్జిట్ ఫలితం తేలబోతోంది. 28దేశాల కూటమిగా ఐరోపా యూనియన్ భవితవ్యాన్ని కూడా ఇది నిర్దేశించబోతోంది. ఐరోపా యూనియన్‌లో బ్రిటన్ కొనసాగాలా స్వతంత్య్ర దేశంగా మనుగడ సాగించాలా అన్న కీలక అంశంపై గురువారం జరిగిన పోలింగ్‌లో లక్షలాది మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బ్రిటన్ సాధారణ ఎన్నికల్లో కూడా నమోదు కానంత విస్తృత స్థాయిలో జరిగిన ఈ ఓటింగ్‌లో బ్రిటన్ భవితవ్యం ఏమిటి? ఐరోపా యూనియన్ యథాతథంగా కొనసాగే అవకాశం ఉందా అన్న అంశాలు తేలిపోతాయి. ఐరోపా యూనియన్‌లో బ్రిటన్ కొనసాగేలా చేసేందుకు..దీన్ని కాపాడుకునేందుకు ప్రధాని డేవిడ్ కామెరాన్ చేసిన ప్రయత్నాలు ఎంత మేరకు ప్రజలపై ప్రభావాన్ని చూపించాయి..అలాగే..ఇయూ నుంచి బ్రిటన్ వైదొలగితేనే అది అన్ని విధాలుగా ఎదిగే అవకాశం ఉంటుందని వాదిస్తున్న వారి ప్రభావం ఎంత మేరకు ఉంటుందన్నది కూడా తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఫలితం బ్రిటన్‌కు అనుకూలంగా వచ్చినా..వ్యతిరేకంగా వచ్చినా ఈ చారిత్రక రిఫరెండం ప్రభావం చాలా తీవ్రంగానే ఉంటుంది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఈ చారిత్రక ఓటింగ్‌లో బ్రిటన్ ప్రజలు అత్యంత ఉత్సాహంగా, క్రియాశీలకంగా పాల్గొన్నారు. తొలి దశ ఫలితాల సరళిని బట్టి చూస్తే ఐరోపా యూనియన్‌లో బ్రిటన్ కొనసాగాలన్న వారి వాదనకే మెజార్టీ మద్దతు లభించిందన్న సంకేతాలు వచ్చాయి. అయితే శుక్రవారం అంతిమ ఫలితం వెలువడే వరకూ ఏ రకంగానూ ఓ నిర్ణయానికి వచ్చేసేందుకు ఆస్కారం ఉండదు.‘పోలింగ్ కేంద్రాలకు వెళ్లండి..ఇయూలోనే ఉంటామన్న మాటకు ఓటేయండి’అంటూ ప్రధాని డేవిడ్ కామెరాన్ చివరి సారిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాలన్న వారి వాదనలో పస లేదని, వారి వన్నీ అబద్ధాలేనంటూ కామెరాన్ తీవ్రస్థాయిలోనే విరుచుకు పడ్డారు. ఇయూ నుంచి వైదొలగితే బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ బలహీన పడుతుందని, యథాతథంగా కొనసాగితేనే బలపడుతుందన్న బలమైన సందేశాన్నీ చివరి క్షణంలో ఆయన అందించారు. తన భార్య సమంతతో కలిసి వెస్ట్‌మినిస్టర్ ప్రాంతంలో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాదాపు పనె్నండు లక్షల మంది ఇండో-బ్రిటీష్ పౌరులు సహా మొత్తం 46మిలియన్ మందికి పైగా ఈ చారిత్రక ఓటింగ్‌లో పాల్గొన్నారు. అనుకూల, ప్రతికూల వాదనలు అత్యంత పదునుగా ఉండటం వల్ల అంతిమంగా బ్రిటన్ ప్రజల మొగ్గు ఎటు అన్నది అంతుబట్టడం లేదు. బ్రిటన్ నిష్క్రమణను కోరుతున్న బోరిస్ జాన్సన్ తమదే అంతిమ విజయమన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు..‘ఇది అత్యంత చారిత్రాత్మక రోజు..బ్రిటన్‌కు స్వాతంత్య్రం వచ్చిన రోజు’అని కూడా అన్నారు. అయితే, ఇప్‌సోస్ మోరిస్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ఐరోపా యూనియన్‌లోనే బ్రిటన్ ఉండాలంటూ 52శాతం మంది, వైదొలగాలని 48శాతం మంది అభిప్రాయ పడ్డట్టుగా వెల్లడైంది. టెలిఫోన్ ఆధారంగా జరిగిన ఈ సర్వేను అత్యంత విశ్వసనీయమైనదిగా, నిర్ణయాత్మకమైనదిగా భావిస్తున్నారు. మరి కొన్ని సర్వేలు 28 దేశాల కూటమిలో బ్రిటన్ కొనసాగాలంటూ 51శాతం మంది అభిప్రాయ పడ్డారని, మరో 49శాతం మంది మాత్రం వైదొలగాలనే కోరుకున్నారని తెలిపాయి. దీన్ని బట్టి చూస్తే..ప్రజాభిప్రాయంలో తేడా అతిస్వల్పమే కాబట్టి అంతిమ ఫలితం ఎలాగైనా ఉండవచ్చునని స్పష్టమవుతోంది. ఒక వేళ బ్రిటన్ నెగ్గినా..ఓడిపోయినా కూడా ఆ తేడా ఒకటి రెండు శాతం మధ్యే ఉంటుందన్న భావనా వ్యక్తం అవుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని కామెరాన్ రిఫరెండం ప్రకటన చేసినప్పటినుంచీ..అనుకూల, ప్రతికూల వర్గాలు విస్తృత స్థాయిలో తమతమ వాదనలను తెరపైకి తెచ్చాయి.

చిత్రం బ్రెగ్జిట్‌పై గురువారం జరిగిన పోలింగ్‌లో ఓటేసి వస్తున్న బ్రిటన్ ప్రధాని కామెరాన్