అంతర్జాతీయం

మళ్లీ రెఫరెండం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 25: యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగడానికి అనుకూలంగా గురువారం జరిగిన రెఫరెండంలో తీర్పు రావడంతో షాక్ తిన్న బ్రిటన్‌వాసులు మరోసారి రెఫరెండం నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. మళ్లీ రెఫరెండం కోరుతూ పెట్టిన ఆన్‌లైన్ పిటిషన్‌పై సంతకాలు చేసిన వారి సంఖ్య ఒక్క రోజులోనే పదిలక్షలు దాటేసింది. అధికారిక పార్లమెంటరీ వెబ్‌సైట్‌లో ఉంచిన పిటిషన్‌పై సంతకాలు వెల్లువెత్తడంతో ఒకదశలో వెబ్‌సైట్ క్రాష్ అయ్యింది. వేల సంఖ్యలో బ్రిటన్‌వాసులు పిటిషన్‌పై సంతకాలు చేస్తున్నారు.
‘యూరోపియన్ యూనియన్‌లో ఉండాలా? విడిపోవాలా? అన్న అంశంపై రెఫరెండంలో మెజారిటీ 60 శాతంకంటే తక్కువ ఉన్నప్పుడు, పోలయిన ఓట్లు 75 శాతానికి తక్కువగా ఉన్నప్పుడు రెండోసారి రెఫరెండం నిర్వహించాలన్న నిబంధనను ఇప్పుడు అమలు చేయాలని కోరుతూ మేము సంతకాలు చేస్తున్నాం’ అని పిటిషన్‌లో ఉంది. గురువారం జరిగిన రెఫరెండంలో 51.9 శాతంమంది యూరోపియన్ నుంచి వైదొలగడానికి అనుకూలంగా ఓటేయగా, ఇయులోనే కొనసాగడానికి 48.1 శాతం మద్దతు తెలిపారు. కాగా, మొత్తం 72శాతం మంది రెఫరెండంలో పాల్గొన్నారు. కాగా, శనివారం ఈ పిటిషన్‌పై సంతకాలు చేసిన వారి సంఖ్య పది లక్షలను దాటేసింది. పిటిషన్‌పై సంతకాలు చేసిన వారిలో ఎక్కువమంది లండన్, బ్రిటన్, ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జి, మాంచెస్టర్ ప్రాంతాలకు చెందిన వారే ఉన్నారు. యూరోపియన్ యూనియన్‌లో బ్రిటన్ కొనసాగాలని కోరుకుంటున్న వారిలో ఈ ప్రాంతాలకు చెందిన వారే ఎక్కువమంది ఉన్నారు. విలియమ్ ఆలివర్ హీలీ ఈ సంతకాల ఉద్యమాన్ని ప్రారంభించాడు.
సాధారణంగా అధికారిక పార్లమెంటు వెబ్‌సైట్‌లో నమోదయ్యే ఏదైనా పిటిషన్‌కు లక్షమందికి పైగా సంతకాలు వస్తే దాన్ని పార్లమెంటు దిగువ సభ కామన్స్‌లో చర్చిస్తారు. కాగా, ఇప్పుడు ఈ పిటిషన్‌కు అంతకన్నా పదిరెట్లు ఎక్కువ సంతకాలు వచ్చాయి. అందువల్ల పిటిషన్ తప్పకుండా కామన్స్ సభలో చర్చకొచ్చే అవకాశం ఉంది. అయితే పిటిషన్‌లో కోరినట్టుగా నిబంధనల్లో మార్పు అమల్లోకి వచ్చి మరోసారి రెఫరెండం నిర్వహిస్తారా? లేదా? అనేది వేచి చూడాల్సి ఉంది.
2014లో జరిగిన స్కాట్లాండ్ స్వాతంత్య్రానికి సంబంధించిన రెఫరెండంలో ఓడిపోయిన 45శాతం మంది కూడా ఇలాంటి ఉద్యమమే మొదలెట్టారు. ఇప్పుడు స్కాట్లాండ్‌లో రెండోసారి రెఫరెండం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒరిజినల్ రెఫరెండం జరిగినప్పటికీ ఇప్పటికీ పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చిందని, అందువల్ల దీనిపై మరోసారి చర్చించాల్సి ఉందని స్కాట్లాండ్ ఫస్ట్ మినిస్టర్ (ముఖ్యమంత్రి) నికోలా స్టుర్జియాన్ చెప్పడం గమనార్హం.
కాగా, మరోవైపు ఇయునుంచి వైదొలగడానికి అనుకూలంగా బ్రిటన్ ఓటు వేసిన తర్వాత లండన్‌ను స్వతంత్ర రాష్ట్రంగా ప్రకటించాలని లండన్ మేయర్‌ను కోరే మరో పిటిషన్‌పైనా వేలాదిమంది ఇప్పటికే సంతకాలు చేశారు. లండన్ ఒక గ్లోబల్ సిటీ అని, అది యూరప్ మధ్యలోనే ఉండాలని పిటిషన్‌ను ప్రారంభించిన జేమ్స్ ఓ మాల్లే అంటున్నారు.