అంతర్జాతీయం

భయం నీడన బాల్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యునైటెడ్ నేషన్స్, జూలై 10: ప్రపంచంలో 535 మిలియన్ల మంది పిల్లలు ఘర్షణలు లేదా విపత్తుల సంభవిస్తున్న దేశాల్లోనే జీవిస్తున్నారని ఐరాస వెల్లడించింది. అంతే నాలుగింట ఒక వంతు బాల్యం అనిశ్చితి పరిస్థితుల మధ్యే గడుపుతున్నట్టు. ఐరాస భద్రతా మండలి సమావేశంలో చిన్నపిల్లల విభాగం అధినేత్రి హెన్రిట్టా ఫోర్ సోమవారం మాట్లాడుతూ ‘నిత్యం యుద్ధవాతావరణం, అననుకూలమైన పరిస్థితుల మధ్య ప్రతి నలుగురు పిల్లల్లో ఒకరు జీవిస్తున్నారు’అని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నపిల్లలు, యువత ఘర్షణలతో చిన్నాభిన్నమైన దేశాల్లో ఉదాహరణకు యెమెన్, మాలీ, దక్షిణ సూడాన్ లాంటిచోట ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఆమె వెల్లడించారు. కొంతమంది యువతను పోరాటం పేరుతో రిక్రూట్ చేసుకుంటుండగా పాఠశాల పిల్లలు దాడులకు, మందుపాతరలకు బలైపోతున్నారని హెన్రిట్టా ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలపై జరుగుతున్న దాడులు, పేలుళ్లలో అభంశుభం తెలియని బాలలు బలైపోతున్నారని ఆమె చెప్పారు. ఆయా దేశాల పరిస్థితి చూస్తే అక్కడున్న పిల్లల భవిష్యత్ ఏమిటన్న ఆందోళన తలెత్తుతోందని ఆమె స్పష్టం చేశారు. ‘ప్రొటెక్టింగ్ చిల్ట్రన్ టుడే.. ప్రివెంట్స్ కాన్‌ఫ్లిక్ట్ టుమారో’ పేరుతో జరిగిన సమావేశంలో 15 తీర్నానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. చిన్నారులు, యువత భద్రత కోసం ఐరాస ఓ కార్యాచరణ రూపొందించాలని 15 సభ్యదేశాలు విజ్ఞప్తి చేశాయి. ఈ సమావేశానికి స్వీడన్ ప్రధాని స్టెఫెన్ లొఫెన్ అధ్యక్షత వహించారు. ప్రపంచ వ్యాప్తంగా 350 మిలియన్ మంది పిల్లలపై యుద్ధాల ప్రభావం ఉంటోందని, వారు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని ఆయన ఆందోళన చెందారు. ప్రభుత్వాలు వారి స్వార్థం కోసం బాల్యాన్ని బలితీసుకుంటున్నాయని ఆయన విమర్శించారు. పిల్లలపై యుద్ధ నీడలు పడకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే సమావేశంలో తొలిసారి దానికి సంబంధించి ఓ తీర్మానం ఆమోదించారు. ‘అరవై శాతం మందికి పైనే ఘర్షణలు/విపత్తులు జరిగే చోటే జీవిస్తున్నారు. 25 ఏళ్ల లోపువారే బాధితులవుతున్నారు’ అని అమెరికా రాయబారి నిక్కీ హేలీ వెల్లడించారు. ఆఫ్గనిస్తాన్‌లో ఒక తరం శాంతి అంటే ఏమిటో తెలియని వాతావరణంలో బతికిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. విద్యతోనే వాటిని జయించవచ్చని, పిల్లల భవిష్యత్‌కు కొంత భరోసా విద్యతోనే వస్తుందని నిక్కీ స్పష్టం చేశారు. విద్యలేకపోవడం, నైపుణ్యత వృద్ధి లేనివారినే ఉగ్రవాద సంస్థలు లక్ష్యంగా చేసుకుంటున్నాయని ఆమె తెలిపారు. అలాంటి వారిని రిక్రూట్ చేసుకుని తర్ఫిదులు ఇస్తూ భవిష్యత్‌ను చిదిమేస్తున్నారని అమెరికా రాయబారి చెప్పారు. పిల్లలు ఇలాంటి వాతావరణంలో జీవించాల్సి రావడం దిగ్భ్రాంతికరమేనని ఐరాస ప్రత్యే ప్రతినిధి వర్జినియా గంబా ఆవేదన వ్యక్తం చేశారు. 2017లో పిల్లల హక్కుల ఉల్లంఘనకు సంబంధించి 21,000 కేసులు నమోదయ్యాయని ఆమె వెల్లడించారు. 2016 కంటే గత ఏడాది ఎక్కువైనట్టు నివేదికలు వెల్లడించాయి. బాల్యంపై జరుగుతున్న ఈ దాడులను తిప్పికొట్టేలా సమష్టిపోరాటం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.