అంతర్జాతీయం

అతనే హీరో.. అతనే విలన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 26: క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకడిగా అభిమానుల నీరాజనాలు అందుకున్న ఇమ్రాన్ ఖాన్ ఎంత సమర్థుడో అంతటి వివాదాల పుట్ట. గొప్ప ఆటగాడిగా ఎంత పేరుందో, వ్యక్తిత్వం లేని మనిషిగా అంతకంటే ఎక్కువ విమర్శలున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే, క్రికెట్‌లోనూ, నిజ జీవితంలోనూ అతనే హీరో, అతనే విలన్. పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా అతను ఎంతో మంది సమర్థులను వెలుగులోకి తీసుకొచ్చాడు. తనకు నచ్చని వాళ్లను అంతే క్రూరంగా అణచివేసి, వారి కెరీర్‌ను నాశనం చేశాడు. క్రికెటర్‌గా తనకు ఉన్న గ్లామర్‌తో బయట ప్లేబాయ్ జీవితం గడిపాడు. అంతులేని ఆత్మవిశ్వాసం.. అంతకు మించిన మొండి తనం.. నచ్చిన వారిని అందలమెక్కించే మంచితనం.. గిట్టని వారిని పాతాళానికి తొక్కే కఠినత్వం. ఇమ్రాన్ జీవితంలో రెండు వేరువేరు కోణాలు కనిపిస్తాయి. ఒకటి అతని సామర్థ్యానికి, తెంపరితనానికి, అనుకున్నది సాధించాలనే పట్టుదలకు నిలవెత్తు ప్రతీక. మరోవైపు చూస్తే, అతనిలో వ్యక్తిత్వం, నైతికత్వం కాగడా పెట్టి వెతికినా కనిపించవు. ముక్కోపి. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లని వాదించే మూర్ఖుడు. మొత్తం మీద రెండు భిన్న ధ్రవాల్లాంటి మనస్తత్వాలు కలిగి, అటు క్రీడల్లోనూ, ఇటు రాజకీయాల్లోనూ రాణించిన సిసలైన ఆల్‌రౌండర్.
ప్రతిష్ఠాత్మక ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్న ఇమ్రాన్ క్రికెట్ జీవితం మీడియం పేస్ బౌలింగ్‌తో మొదలైంది. భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత అతను బౌలింగ్ విధానాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. షార్ట్ లైనప్‌తో బంతులు వేసేవాడు. పైకి ఎగిరి బంతిని డెలివర్ చేయడం ఇమ్రాన్ స్పెషల్ యాక్షన్ స్టిల్‌గా మారింది. 1980లో భారత్ సహా ప్రపంచ దేశాల మేటి బ్యాట్స్‌మెన్‌ను గజగజలాడించిన ఇమ్రాన్, ప్రపంచ మేటి ఫాస్ట్ బౌలర్ల జాబితాలో చేరాడు. సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్, గుండప్ప విశ్వనాథ్ వంటి హేమాహేలు ఉన్నప్పటికీ, ఇమ్రాన్ బౌలింగ్‌ను ఎదుర్కోలేక భారత్ చతికిల పడిన సందర్భాలు కోకొల్లలు. మొహీందర్ అమర్‌నాథ్‌ను మినహాయిస్తే జట్టులో ఎవరూ ఇమ్రాన్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేకపోయారన్నది వాస్తవం. ఓపెనర్‌గా మైదానంలోకి దిగిన తర్వాత, ఇమ్రాన్ తొలి బంతిని ఫుట్‌టాస్‌గా సంధిస్తే బాగుంటుందని తాను పదేపదే అనుకునేవాడినని గవాస్కర్ వ్యాఖ్యానించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఫుట్‌టాస్ వేస్తే, ఒక సింగిల్ తీసుకొని, అతని బౌలింగ్ నుంచి తప్పించుకోవచ్చన్నది తన అభిప్రాయమని గవాస్కర్ అప్పట్లో స్పష్టం చేశాడు. ఇమ్రాన్ బౌలింగ్ ప్రమాణాలు ఏ స్థాయిలో ఉండేవో చెప్పడానికి గవాస్కర్ మాటలే నిదర్శనం. సర్ఫ్‌రాజ్ నవాజ్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన ఇమ్రాన్ పాకిస్తాన్ క్రికెట్ జట్టును అంతా తానై నడిపించాడు. ఒక దేశవాళీ మ్యాచ్‌ని చూస్తున్న సమయంలో, చక్కటి స్వింగ్‌తో, వేగంగా బంతులు వేసే ఒక యువకుడిని చూసి ముచ్చటపడ్డాడు. అతనికి ఉజ్వల భవిష్యత్తు ఉందని నమ్మాడు. సెలక్టర్లను ఒప్పించి, ఆ టీనేజర్‌కు జాతీయ జట్టులో చోటు కల్పించాడు. ఇమ్రాన్‌ను అంతగా ఆకట్టుకున్న యువకుడే వకార్ యూనిస్. పాకిస్తాన్ క్రికెట్‌లో ఇమ్రాన్ వారసత్వాన్ని వసీం అక్రంతో కలిసి వకార్ యూనిస్ ముందుకు తీసుకెళ్లాడు. పాక్ క్రికెట్ ప్రమాణాలను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాడు. ఇమ్రాన్ గుర్తించి, ప్రోత్సహించిన మరో ఆటగాడు ఇంజమాముల్ హక్. అతను కూడా పాక్ క్రికెట్‌కు విశిష్ట సేవలు అందించాడు. ప్రపంచ మేటి బ్యాట్స్‌మెన్‌లో సచిన్ తెండూల్కర్, బ్రియాన్ లారా తర్వాత ఇంజీ పేరు చేరిందంటే, ఇమ్రాన్ ముందు చూపు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అన్నింటినీ మించి, అత్యంత వివాదాస్పదుడైన జావేద్ మియందాద్‌ను కట్టడి చేయగలిగిన ఏకైక కెప్టెన్‌గా ఇమ్రాన్‌ను పేర్కొంటారు. ఎవరి మాటా వినని మియందాద్ ఫీల్డ్‌లో భయపడే ఒకే ఒక వ్యక్తి ఇమ్రాన్. ఆటగాళ్లను అంతగా ప్రభావితం చేయగలడు కాబట్టే, 1987 వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్‌ను ప్రకటించిన ఇమ్రాన్‌ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) 1992 వరల్డ్ కప్ టోర్నీకి ముందు మళ్లీ పిలిపిచింది. కెప్టెన్సీ బాధ్యతలు అప్పచెప్పింది. ఆ టోర్నీని అతను భుజం గాయంతోనే ఆడాడు. ఎక్కువగా బౌలింగ్ చేయలేకపోయినా, బ్యాటింగ్‌లో రాణించాడు. జట్టు సభ్యులకు స్ఫూర్తిదాయమైన మార్గదర్శకాన్ని అందిస్తూ, పాక్‌ను విజయపథంలో నడిపాడు.
క్రికెటర్‌గా ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఇమ్రాన్ నిజ జీవితంలో వివాదాస్పద వ్యక్తిగా ముద్రపడ్డాడు. తోటి ఆటగాళ్లతో ఘర్షణకు దిగడం, వారికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా అణచివేయడం అతని వైఖరికి నిదర్శనం. ఆఫ్ ది ఫీల్డ్‌లోనూ అతని వ్యిక్తిత్వం అలాంటిదే. అమ్మాయిలతో తిరగడం, డేటింగ్స్ కుదుర్చుకోవడం అతని హామీలు. రాజకుటుంబానికి చెందిన సితా వైట్‌ను వివాహం చేసుకున్న అతను ఆరేళ్లకే ఆమెను వదిలించుకున్నాడు. తన 43వ ఏట 21 ఏళ్ల జెమీమా గోల్డ్‌స్మిత్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఆమెకూ విడాకులిచ్చి, బ్రిటిష్ జర్నలిస్టు రెహానా ఖాన్‌తో కొద్దికాలం స్థిరపడ్డాడు. ప్రస్తుతం ఆమెను కూడా విడిచిపెట్టాడు. నిలకడలేని వ్యక్తిత్వం ఇమ్రాన్ ఇమేజ్‌ను దారుణంగా దెబ్బతీసింది. అయితే, అద్భుత మాటకారి కావడం అతనికి కలిసొచ్చిన అంశం. ప్రతి పెళ్లికీ ఒక కథను వినిపించి, జనాలను ఒప్పించాడు. తన వాగ్ధాటితో ప్రజలను మెప్పించాడు. పాకిస్తాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీని జనంలోకి తీసుకెళ్లగలిగాడు. సుమారు 22 ఏళ్ల క్రితమే రాజకీయాల్లోకి వచ్చిన ఇమ్రాన్ భారత్ వ్యతిరేక ప్రసంగాలతో పాకిస్తాన్‌ను హోరెత్తించాడు. దీనితో అతనికి ఇస్లామిక్ మిలిటెంట్ సంస్థలు మద్దతిచ్చాయి. భారత్‌కు ఎంతోకొంత అనుకూలంగా ఉన్న నవాజ్ షరీఫ్‌కు పదవి దక్కకూడదన్న ఉద్దేశంతో, సైన్యం నేరుగా ఇమ్రాన్ పక్షాన నిలిచింది. ఎన్నికల తతంగాన్ని పూర్తి చేసింది. ఇమ్రాన్ ముమ్మాటికీ భారత్ వ్యతిరేకి. అతని రాక భారత్‌కు ఎన్ని కొత్త సమస్యలను తెచ్చిపెడతాయో చూడాలి. పాకిస్తానీయులకు, ప్రత్యేకించి ఇస్లామిక్ గ్రూపులకు అతను హీరోనే కావచ్చుగానీ, భారతీయులకు మాత్రం కచ్చితంగా విలనే.