అంతర్జాతీయం

సాహితీవేత్త నైపాల్ ఇకలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఆగస్టు 12: నోబెల్ బహుమతి గ్రహీత విఎస్ నైపాల్ వయోభారంతో ఆదివారం ఇక్కడ కన్నుమూశారు. ఆయన వయస్సు 85 సంవత్సరాలు. వలసవాదం, మతం, రాజకీయాలపై ఆయన విమర్శనాత్మకమైన రచనలు చేశారు. జీవితంలో చివరి క్షణాల్లో నైపాల్ మరణించే సమయంలో దగ్గర భార్య, ఆత్మీయులు ఉన్నారు. తాను అనుకున్నది సాధించే లక్ష్యం ఉన్న మహోన్నత రచయిత నైపాల్ అని భార్య లేడీ నదిరా నైపాల్ పేర్కొన్నారు. కాల్పనిక, తదితర సాహిత్యాలపై ఆయన 30 రచనలు చేశారు. ఆయన తొలి పుస్తకం ‘ది మిస్టిక్ మస్సీర్’ బహుళ ప్రజాదరణ పొందింది. ఆయన రాసిన నవలల్లో ఏ హౌస్ ఫర్ బిశ్వాస్ 1961లో ప్రచురితమైంది. ఈ నవల నైపాల్‌కు మంచి పేరు తెచ్చింది. ఫ్రీ స్టేట్, గెరిల్లా, ఎ బెండ్ ఇన్ ది రివర్, ఏ వే ఇన్ ది వరల్డ్, ది మిమిక్ మెన్, ది ఎనిగ్మా ఆఫ్ అరైవల్, బియాండ్ బిలీఫ్, ఇస్లామిక్ ఎక్స్‌కర్షన్స్, కన్వర్టెడ్ పీపుల్స్, హాఫ్ ఏ లైఫ్, ది రైటర్ అండ్ ది వల్డ్, లిటరరీ అకేషన్స్, ది నవాల్ మేజిక్ సీడ్స్, ఏ సీక్వెల్ టు హాఫ్ టు లైఫ్,
ఇన్ ది మస్క్యూ ఆఫ్ ఆఫ్రికా నవలలు సాహిత్యాభిమానులను ఉర్రూతలూగించాయి. 2001లో నైపాల్‌కు నోబెల్ బహుమతికి ఎంపిక చేశారు. ఆయన సాహిత్యరంగానికి చేసిన ఎనలేని సేవలకు గుర్తింపుగా అనేక అవార్డులు వచ్చాయి. చరిత్రలో వెలుగుచూడని అనేక వాస్తవాలను నైపాల్ చక్కగా చిత్రీకరించి ప్రపంచానికి తెలియచేశారని నోబెల్ బహుమతి ప్రదానం సందర్భంగా స్వీడిష్ అకాడమి ప్రశంసించింది.
సర్ విద్యాధర్ సూర్జప్రసాద్ నయాపూల్ 1932 ఆగస్టు 17వ తేదీన ట్రినాడ్‌లో ఒక భారతీయ హిందూ కుటుంబంలో జన్మించారు. 18 ఏళ్ల వయస్సులో ఆయన ఇంగ్లాండ్‌కు వెళ్లారు. అక్కడ ఉపకారవేతనంపై ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ కాలేజీలో ఉన్నత విద్యను అభ్యసించారు. అనంతరం ఆయన ఇంగ్లాండ్‌లోనే స్థిరపడ్డారు. 1955లో నైపాల్ పత్రిసియా అన్ హలే అనే యువతిని వివాహం చేసుకున్నారు. ఆమె 1996లో మరణించారు. అనంతరం ఆయన పాకిస్తాన్‌కు చెందిన విడాకులు పొందిన ఒక మహిళా జర్నలిస్టు నదీరా ఖానుమ్ ఆల్వీని రెండో పెళ్లి చేసుకున్నారు.
సాహితీ లోకానికి తీరని నష్టం: మోదీ
నోబెల్ బహుమతి గ్రహీత, భారత సంతతికి చెందిన విఎస్ నైపాల్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు. సాహిత్య రంగానికి నైపాల్ చేసిన సేవలను ఆయన కొనియాడారు. ఆయన భారత్‌కు సాహితీ కృషి ద్వారా గుర్తింపు తెచ్చారన్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివాజీ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ ప్రపంచ సాహిత్యానికి నైపాల్ మృతి తీరని లోటు అన్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జీవాలా మాట్లాడుతూ సాహిత్య లోకం ఒక గొప్ప ప్రతిభాశాలిని కోల్పోయిందని నివాళులు అర్పించారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో పాటు పలువురు రాజకీయనేతలు నైపాల్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.