అంతర్జాతీయం

భారత్‌కు తొమ్మిది మంది మృతదేహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, ఏప్రిల్ 24: ఈస్టర్ పర్వదినం సందర్భంగా ఆదివారం శ్రీలంకలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన బాంబు దాడుల్లో అసువులు బాసిన 10 మంది భారతీయుల్లో 9 మంది మృతదేహాలను వారి స్వదేశానికి పంపినట్టు అధికార వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఈస్టర్ వేడుకల్లో పాల్గొన్నవారిపై ఉగ్రమూకలు బాంబు దాడులకు తెగబడడంతో 359 మంది పౌరులు మరణించిన సంగతి తెలిసిందే. మృతుల్లో 10 మంది భారతీయులు ఉన్నట్టు సంబంధిత అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఉగ్రవాదులు జరిపిన దారుణ మారణకాండలో అసువులు బాసిన 10 మంది భారతీయుల్లో స్వదేశానికి పంపిన 9 మంది జాబితాను ఇక్కడి భారత హైకమిషన్ అధికార వర్గాలు వెల్లడించాయి. వీరిలో ఎస్.ఆర్.నాగరాజ్, హెచ్.శివకుమార్, కె.జి.హననుమత్రాయియప్ప, కె.ఎం.లక్ష్మీనారాయణ, ఎం.రంగప్ప, వి.తులసీరామ్, ఏ.మారెగౌడ, హెచ్.పుట్టరాజు, ఆర్.లక్ష్మణ్ గౌడ ఉన్నారు. ఈ తొమ్మిది మంది మృతదేహాలను నాలుగు విమానాల ద్వారా బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాలకు పంపినట్టు శ్రీలంకలోని భారత హైకమిషన్ అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలావుండగా, శ్రీలంకలోని పలు ప్రాంతాల్లో ముష్కర దాడికి పాల్పడి వందలాది అమాయక ప్రజల ప్రాణాలను బలిగొన్నవారిలో అనుమానితులుగా భావిస్తున్న 60 మందిని ఇప్పటివరకు అరెస్టు చేసినట్టు పోలీస్ విభాగం అధికార ప్రతినిధి రువాన్ గుణశేఖర తెలిపారు. టెర్రరిస్టుల బాంబు దాడుల్లో 500 మందికి పైగా గాయపడినట్టు ఆయన తెలిపారు. అదేవిధంగా 34 విదేశాలకు చెందిన పౌరులు సైతం ఈ బాంబు దాడుల్లో ప్రాణాలు కోల్పోయినట్టు గుర్తించామని ఆయన పేర్కొన్నారు.

చిత్రం... బెంగళూరులో తన భర్త భౌతిక కాయానికి జరిగిన అంత్యక్రియలకు హాజరైన ఓ మహిళ. ఆమె భర్త హనుమంతరాయప్ప గత ఆదివారం కొలంబోలో జరిగిన ఉగ్ర దాడిలో మృతి చెందారు.