అంతర్జాతీయం

మనీ లాండరింగ్ కేసులో జర్దారీకి 10 రోజుల రిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూన్ 11: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీకి కోర్టు 10 రోజుల రిమాండ్‌ను విధించింది. మనీ లాండరింగ్ కేసు లో సోమవారంనాడు అతనిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ కో-చైర్మన్ అయిన జర్దారీ బెయిల్ కోసం చేసిన దరఖాస్తును ఇస్లామాబాద్ హైకోర్టు తోసిపుచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే నేషనల్ అకౌంట్‌బిలిటీ బ్యూరో (ఎన్‌ఏబీ) ఆయనను అరెస్టు చేసింది. 63 ఏళ్ల జర్దారీ, ఆతని సోదరి కలసి చానల్ ఏర్పాటుకు నకిలీ బ్యాంకు అకౌంట్లు సృష్టించి మనీ లాండరింగ్ ద్వారా పెద్దఎత్తున నిధులు సంపాదించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్‌ఏబీ అధికారుల కథనం ప్రకారం..పాక్ మాజీ అధ్యక్షుడు జర్దారీ, ఆతని సోదరి ఇద్దరూ కలసి నకిలీ బ్యాంకు అకౌంట్లు సృష్టించడం ద్వారా దాదాపు 150 మిలియన్ల నిధులను అక్రమంగా సంపాదించారు. ఈ నేపథ్యంలో వారిద్దరి అరెస్టుకు సంబంధించి వారెంట్లు జారీ అయ్యాయి. నకిలీ బ్యాంకు అకౌంట్లతో మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ సమగ్ర విచారణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి జర్దారీని ఎన్‌ఏబీ నేతృత్వంలోని ఒక టీమ్ శుక్రవారంనాడు కోర్టుకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా జర్దారీని ప్రాథమికంగా విచారించేందుకు వీలుగా 14 రోజుల రిమాండ్‌కు పంపాలని ఎన్‌ఏబీ అధికారులు కోర్టుకు విన్నవించారు. అయితే, దీనిని బాధితుడి తరఫున వాదించిన న్యాయవాది ఫరూక్ హెచ్ నాయెక్ వ్యతిరేకించారు. అయినా ఎన్‌ఏబీ అధికారులు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) నాయకుడు జర్దారీని 14 రోజుల రిమాండ్‌కు పంపాలని ఎన్‌ఏబీ తరఫున వాదించిన న్యాయవాది ముజాఫర్ అబ్బాసీ కోర్టును అభ్యర్థించారు. బ్యాంకు అధికారుల ప్రమేయంతోనే జర్దారీ, అతని సోదరి నకలీ అకౌంట్లను సృష్టించి వందలాది మిలియన్ డాలర్ల మోసానికి తెరలేపారని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసుకు సంబంధించి జర్దారీని అరెస్టు చేసిన నేపథ్యంలో సమగ్ర దర్యాప్తు నిమిత్తం అతనిని రిమాండ్‌కు పంపాలని ఆయన కోర్టుకు విన్నవించారు.
ఇదిలావుండగా, ఎన్‌ఏబీ జైలులో తగిన సౌకర్యాలు కల్పించాలని పాక్ మాజీ అధ్యక్షుడు జర్దారీ కోర్టును అభ్యర్థించారు. అంతేకాకుండా తన వయసు, అనారోగ్య పరిస్థితుల రీత్యా తనకు సహాయకుడిగా ఉండేందుకు ఒక వ్యక్తిని ఏర్పాటు చేయాలని జర్దారీ కోర్టును కోరారు. కాగా, ఈనెల 21న జర్దారీని తమ ఎదుట హాజరుపరచాలని కోర్టు ఎన్‌ఏబీ అధికారులకు సూచించింది. ఇదిలావుండగా, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నాయకుడు ఆసిఫ్ అలీ జర్దారీని కోర్టుకు హాజరుపరచిన సందర్భంగా ఎలాంటి ఉద్రిక్తతలకు తావులేకుండా ఉండేందుకు వీలుగా ఫెడరల్ క్యాపిటల్ చుట్టూ దాదాపు 500 మంది పోలీసులను వినియోగించారు. అంతేకాకుండా ఎన్‌ఏబీ ప్రధాన కార్యాలయం బయట కూడా దాదాపు 300 మంది పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. కోర్టుకు తీసుకువచ్చే ముందు జర్దారీకి ముగ్గురు సభ్యులు గల వైద్య బృందం పరీక్షలు నిర్వహించింది. ఎన్‌ఏబీ అధికారులు మాత్రం జర్దారీ ఆరోగ్యపరంగా చాలా ఫిట్‌గా ఉన్నాడని అంటున్నారు. 2008 నుంచి 2013 వరకు పాకిస్తాన్ దేశ 11వ అధ్యక్షుడిగా వ్యవహరించిన ఆసిఫ్ అలీ జర్దారీ నకిలీ అకౌంట్లతో జరిగిన మనీ లాండరింగ్ కేసుతో ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. కేవలం తనను అపఖ్యాతిపాలు చేయడానికే అధికార పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ ఇలాంటి కుట్రలకు పాల్పడుతోందని జర్దారీ ఆరోపించారు.