అంతర్జాతీయం

కర్తార్‌పూర్‌పై ముందడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, జూలై 14: కర్తార్‌పూర్ ఒప్పందం ముసాయిదాలోని 80 శాతానికి పైగా అంశాలకు భారత్, పాకిస్తాన్‌లు అంగీకారం తెలిపాయి. పాకిస్తాన్‌కు చెందిన ఒక సీనియర్ అధికారి ఆదివారం ఇక్కడ ఈ విషయం వెల్లడించారు. ఇరు దేశాలకు చెందిన అధికారులు ఆదివారం వాఘాలో సుదీర్ఘంగా సమావేశమయిన తరువాత ఆయన ఈ విషయం వెల్లడించారు. కర్తార్‌పూర్ కారిడార్ పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్‌లో గల దర్బార్ సాహిబ్, భారత్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో గల డేరా బాబా నానక్ ఆలయాన్ని కలుపుతుంది. భారత్‌లోని సిక్కు యాత్రికులు వీసా లేకుండానే పాకిస్తాన్‌లోని దర్బార్ సాహిబ్‌ను దర్శించడానికి వీలు కల్పిస్తుంది. అయితే ఈ యాత్రికులు కర్తార్‌పూర్ సాహిబ్‌ను సందర్శించడానికి పర్మిట్‌ను తీసుకోవలసి ఉంటుంది. సిక్కు మత వ్యవస్థాపకుడు గురు నానక్ దేవ్ 1522లో కర్తార్‌పూర్ సాహిబ్‌ను నెలకొల్పారు. భారత్, పాకిస్తాన్‌లకు చెందిన అధికారులు ఆదివారం వాఘాలో రెండో దశ చర్చలు జరిపారు. సుమారు నాలుగు గంటల సేపు జరిగిన ఈ చర్చల అనంతరం 13 మందితో కూడిన పాకిస్తాన్ అధికారుల బృందానికి నేతృత్వం వహిస్తున్న ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మహమ్మద్ ఫైసల్ వాఘాలో మీడియాతో మాట్లాడుతూ కారిడార్ చర్చల్లో సానుకూల పురోగతి ఉందని తెలిపారు. ‘చర్చల్లో సానుకూల పరిణామాలు ఉన్నాయి. ఇరు దేశాలు కర్తార్‌పూర్ కారిడార్ ఒప్పందంలోని 80 శాతానికి పైగా అంశాలకు అంగీకారం తెలిపాయి’ అని ఆయన చెప్పారు. ఇరు దేశాలు తదుపరి సమావేశంలో మిగిలిన 20 శాతం అంశాలను పరిష్కరించుకుంటాయని ఆయన అన్నారు. ఇరు దేశాల సంయుక్త ప్రకటన గురించి ప్రశ్నించగా, ‘తుది ఒప్పంద ముసాయిదాపై మాకు అంగీకారం కుదిరేంత వరకు మేము సంయుక్తంగా వివరాలు వెల్లడించలేము. అపరిష్కృత అంశాలపై మేము మరోసారి సమావేశం కావలసి వస్తుందని భావిస్తున్నాం’ అని ఫైసల్ బదులిచ్చారు. నవంబర్‌లో కారిడార్ ప్రారంభోత్సవం సందర్భంగా ఎంతమంది భారతీయ సిక్కులకు పర్మిట్లు జారీ చేస్తారని ప్రశ్నించగా, ‘అయిదు వేలు లేదా ఎనిమిది వేల మందికి ఇవ్వొచ్చు.. ఖచ్చితమయిన సంఖ్యను నేను చెప్పజాలను. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోవలసి ఉంది’ అని ఫైసల్ సమాధానమిచ్చారు. పాకిస్తాన్ ఒక శాంతి మొక్కను నాటిందని దక్షిణాసియా, సార్క్ డైరెక్టర్ జనరల్ కూడా అయిన ఫైసల్ అన్నారు. ‘ఇది శాంతి కారిడార్. మేము ఒక శాంతి మొక్కను నాటినాము’ అని ఆయన అన్నారు. ఈ సంవత్సరం నవంబర్‌లో జరిగే గురు నానక్ దేవ్ 550వ జయంతోత్సవాల సందర్భంగా ఈ కారిడార్‌ను భారతీయ సిక్కు యాత్రికుల కోసం ప్రారంభించడానికి పాకిస్తాన్ కట్టుబడి ఉంది’ అని ఫైసల్ పేర్కొన్నారు.
చిత్రం...అమృత్‌సర్ సమీపంలోని వాఘా సరిహద్దులో ఆదివారం కర్తార్‌పూర్ కారిడార్ ప్రాజెక్టుపై జరిగిన రెండో దఫా చర్చల్లో పాల్గొన్న భారత్, పాక్ అధికారులు