అంతర్జాతీయం

మైత్రీ బంధం మరింత బలోపేతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్లాడివోస్టాక్, సెప్టెంబర్ 4: అన్ని రంగాల్లోనూ అభివృద్ధికి కలిసి పనిచేస్తామని, ఇరు దేశాల మైత్రీ సంబంధాలను మరింత పటిష్టం చేస్తామని భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. పరస్పర సహకారంతో ముందుకు సాగుతామని బుధవారం ఇక్కడ ప్రారంభమైన ఐదవ తూర్పు ఆర్థిక మండలి (ఈఈఎఫ్) సదస్సు సందర్భంగా కలిసిన వీరు ప్రకటించారు. పశ్చిమ దేశాల్లో యుద్ధపూరిత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ సదస్సు జరగడం గమనార్హం. భారత్-రష్యా మధ్య స్నేహ సంబంధాలను మరింత పటిష్టం చేయడానికి ఈ చారిత్రాత్మక కలయిక దోహద పడుతుందని ప్రధాని మోదీ అన్నారు. ఒక ప్రకటనపై సంతకం చేస్తామని ప్రధాని మోదీ తెలిపారు. రష్యాతో సంబంధాలు ఎంతో కాలంగా కొనసాగుతున్నాయని ప్రధాని చెప్పారు. రష్యా తమకు అత్యంత ఆప్త దేశమని ఆయన అన్నారు. ఇలావుంటే, జమ్మూకాశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని 370 అధికరణను రద్దు చేసిన తర్వాత అక్కడ నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పుతిన్‌ను మోదీ వ్యూహాత్మకంగా కలిశారని అంటున్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని పాకిస్తాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా చైనా దానికి వంత పాడుతోంది. ఇటీవలే ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ భద్రతా మండలిలో ఈ అంశాన్ని చైనా లేవనెత్తింది. కానీ మిగతా సభ్య దేశాలు దీనిపై చర్చించేందుకు నిరాకరించడంతో చైనా ప్రయత్నం విఫలమైంది. అక్టోబర్ లేదా నవంబర్ మాసంలో భారత్‌తో యుద్ధం చేయాల్సి వస్తుందని పాకిస్తాన్ రైల్వే శాఖ మంత్రి షేక్ రషీద్ అహమ్మద్ చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. మరోవైపు అణుయుద్ధం తప్పకపోవచ్చునని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హెచ్చరికలు కూడా జారీ చేశారు. సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో పాకిస్తాన్‌కు అండగా నిలుస్తున్న చైనాకు తగిన సమాధానం చెప్పాలన్న ఉద్దేశంతోనే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను భారత ప్రధాని మోదీ కలిశారని అంటున్నారు. ఆయుధ రంగానికి సంబంధించిన అంశాలు కూడా వీరిద్దరూ చర్చిస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈఈఎఫ్ సదస్సు సమయంలోగానీ ఆ తర్వాతగానీ పుతిన్‌తో మోదీ విస్తృత స్థాయి
చర్చలు జరిపే అవకాశాలు ఉన్నాయి. కాగా, ఇతర దేశాల అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రష్యా కూడా తమ సిద్ధాంతాన్ని అనుసరిస్తోందని ఆయన అన్నారు. అఫ్ఘనిస్తాన్ సహా ఏ దేశ వ్యవహారాల్లోనూ తాము కల్పించుకోమని మోదీ స్పష్టం చేశారు. జమ్మూకాశ్మీర్ విషయంలో పలు అనుమానాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఒక ప్రకటన చేశారు. అదేవిధంగా అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే చూస్తూ ఊరుకోబోమని యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) పార్లమెంటు హెచ్చరించింది. అలాంటి సంఘటనలపై పారదర్శకత విచారణ జరుగుతుందని యూకే పార్లమెంటు తేల్చిచెప్పింది. ఈ హెచ్చరికలను, ప్రకటనలను మోదీ పరోక్షంగా ప్రస్తావించారు. తాము ఎవరి అంతర్గత వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకోబోమని ప్రకటించడం ద్వారా అమెరికా, యూకే తదితర దేశాలకు జమ్మూకాశ్మీర్ అంశంలో జోక్యం చేసుకోవద్దని పరోక్షంగా మోదీ తెలిపారు.

చిత్రం... రష్యాలోని వ్లాడివోస్టాక్‌లో ఐదవ తూర్పు ఆర్థిక మండలి సమావేశం సందర్భంగా సమావేశమైన భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్