అంతర్జాతీయం

కాశ్మీరీల హక్కులకు ఆటంకం ఒద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెనీవా, సెప్టెంబర్ 9: జమ్మూకాశ్మీర్ ప్రజల హక్కులను గౌరవించి వాటిని పరిరక్షించాలని ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సంస్థ అధినేత మిచెల్లీ బషలెట్ సోమవారంనాడు ఇక్కడ భారత్, పాకిస్తాన్‌కు విజ్ఞప్తి చేశారు. కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను భారత ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఉద్రిక్తతల కారణంగా కాశ్మీర్ ప్రజల భద్రత, వారి రక్షణకు ఏరకమైన ఆటంకం కలుగకూడదని ఆమె స్పష్టం చేశారు. అలాగే, అస్సాంలో చేపట్టిన జాతీయ పౌర రిజిస్ట్రీ కారణంగా ఎవరు కూడా నిరాదరణకు గురికాకూడదని, ఏ రాష్ట్రానికి చెందనివారిగా మిగిలిపోకూడదని భారత్‌కు ఆమె విజ్ఞప్తి చేశారు. కాశ్మీర్‌కు సంబంధించి మాట్లాడిన ఆమె ఆధీనరేఖకు ఇరువైపులా ఉన్న మానవహక్కుల పరిస్థితుల గురించి తమకు ఎప్పటికప్పుడు నివేదికలు అందుతున్నాయని తెలిపారు. అయితే, ఇంటర్‌నెట్‌పై ఆంక్షలు విధించడం, ప్రజలు శాంతియుతంగా సమావేశమయ్యేందుకు అవకాశం కల్పించకుండా భారత ప్రభుత్వం ఇటీవల కాశ్మీర్‌లో అమలుచేసిన చర్యలు తనకెంతో ఆందోళన కలిగించాయని ఆమె అన్నారు. మానవహక్కుల మండలి 42వ సమావేశంలో ఆమె ప్రారంభోపన్యాసం చేశారు. కాశ్మీర్ విషయంలో నెలకొన్న ఉద్రిక్తతల తీవ్రతలను పరిగణనలోకి తీసుకుని భారత్, పాక్ అక్కడి ప్రజలకు ఏరకమైన నష్టం కలుగకుండా చూడాలని ఆమె కోరారు. అలాగే, ప్రస్తుతం కాశ్మీర్‌లో అమలవుతున్న ఆంక్షలను త్వరితగతిన తొలగించాలని, ప్రజలకు వౌలిక సేవలను అందుబాటులోకి తేవాలని భారత్‌ను కోరారు. కాశ్మీర్ ప్రజల భవితవ్యంతో ముడిపడివున్న నిర్ణయాలు తీసుకునేటపుడు అక్కడి ప్రజలను సంప్రదించాల్సిన అవసరం ఎంతో ఉందని, ఇలాంటి నిర్ణయాల్లో వారికి కూడా ప్రమేయం కల్పిస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా సమస్యను పరిష్కరించడం సాధ్యమవుతుందని ఆమె అన్నారు. ప్రస్తుతం నిర్బంధంలో ఉంచిన కాశ్మీరీ నేతల హక్కులకు ఎలాంటి భంగం కలుగకూడదని ఆమె విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగంలోని 370 అధికరణను భారత ప్రభుత్వం రద్దు చేయడం ఆ దేశ ఆంతరంగిక విషయమని ఆమె స్పష్టం చేశారు. అలాగే బాధ్యతారహితమైన ప్రకటనలు చేస్తున్నందుకు పాకిస్తాన్‌పై కూడా ఆమె తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు. అస్సాంలో చేపట్టిన ఎన్‌ఆర్‌సీ వల్ల ఎంతో అనిశ్చితి, ఆందోళన ప్రజల్లో తలెత్తిందని, దాదాపు 20 లక్షల మంది ప్రజలకు ఈ తుది జాబితాలో చోటు లభించకపోవడం ఇందుకు కారణమని ఆమె తెలిపారు. అయితే, వీరి సమస్యలను సానుకూల దృక్పథంతో అర్థం చేసుకోవాలని ఆమె భారత్‌కు విజ్ఞప్తి చేశారు.