అంతర్జాతీయం

భారత్‌తో మైత్రికి పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, నవంబర్ 19: భారత్‌తో సన్నిహిత సంబంధాలను శ్రీలంక కొత్త అధ్యక్షుడు గొటబాయ రాజపక్ష కొనసాగించే అవకాశం ఉంటుందని, అలాగే చైనాతో ఆర్థిక లావాదేవీలను కొనసాగించే విషయంలో ఆయన ఆచితూచి వ్యవహరించవచ్చునని నిపుణులు చెబుతున్నారు. దాదాపు 13 లక్షల మెజారిటీతో అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రాజపక్ష దేశాధినేతగా ఎన్నిక కావడం భారత్‌కు అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశమని వీరు విశే్లషించారు. భారత ప్రయోజనాలను దెబ్బతీసే రీతిలో విదేశీ శక్తులను తమ దేశంలోకి రాజపక్ష ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించదన్న నమ్మకాన్ని భారత్ వ్యక్తం చేస్తోందని, దీనికి అనుగుణంగానే కొత్త అధ్యక్షుడి పాలన కూడా కొనసాగవచ్చునని చెబుతున్నారు. భారత్ ఇరుగుపొరుగున ఉన్న దేశాల్లో శ్రీలంక వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైనది. అయినప్పటికి కూడా గత కొన్ని దశాబ్దాలుగా భారత్‌తో సంబంధాల కంటే కూడా ఇతర దేశాలతోనే శ్రీలంక సన్నిహితంగా మెసలిన నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిపుణులు ఈ తాజా విశే్లషణ చేశారు. అమెరికా కనుసన్నల్లోనే రాజపక్ష పాలన సాగుతుందని, అయినప్పటికి కూడా చైనాతో ఆర్థిక లావాదేవీలను పరిమిత స్థాయిలోనే ఇది కొనసాగించవచ్చునని తెలిపారు. తమ ప్రాంత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అమెరికాకు దూరం కాకుండా ఉండడమే అత్యుత్తమమన్న తమ సంకేతాన్ని లంక కొత్త అధ్యక్షుడు తమ విదేశాంగ విధానంలో స్పష్టం చేసిన విషయాన్ని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అలాగే, చైనాకు అతి సన్నిహితం కాకుండా భారత్‌కు అతి దూరం కాకుండా ఉభయ తారకమైన రీతిలోనే కొత్త అధ్యక్షుడి పాలన సాగుతుందన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది. ముఖ్యంగా భారత ప్రధాని నరేంద్ర మోదీతో స్నేహపూర్వక సంబంధాలను గొటబాయ రాజపక్ష కొనసాగించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని జాతీయ శాంతి మండలి డైరెక్టర్ జహన్ పెరీరా పేర్కొన్నారు. అలాగే, భారత్‌లో మోదీ అనుసరిస్తున్న విధానాలను ఆయన శ్రీలంకలో అమలు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదన్న అభిప్రాయాన్ని కూడా పెరీరా వ్యక్తం చేశారు. ఆదివారం రాజపక్ష విజయం సాధించిన వెంటనే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి అభినందించిన విషయాన్ని గుర్తు చేసిన పెరీరా లంక కొత్త ప్రభుత్వంతో మరింత బలంగా సన్నిహిత సంబంధాలను కొనసాగించాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. దీనికి ప్రతిగా మాట్లాడిన రాజపక్ష ఇరు దేశాల మధ్య చారిత్రకంగా ఎంతో సాన్నిహిత్యం ఉందని, అనేక అంశాలపై ఉమ్మడి అభిప్రాయం కూడా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాదు, కొత్త అధ్యక్షుడిగా తొలి విదేశీ పర్యటన భారత్‌తోనే మొదలు కావాలన్న మోదీ ఆకాంక్షను కూడా ఆయన అంగీకరించే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. అలాగే, అమెరికా కూడా గొటబాయ విషయంలో సానుకూల వైఖరిరే కనబరుస్తూ వస్తోంది. ముఖ్యంగా గొటబాయకు ఇటు అమెరికా పౌరసత్వం, అటు లంక పౌరసత్వం ఈ ఏడాది ఏప్రిల్ వరకు కొనసాగిన విషయాన్ని నిపుణులు గుర్తు చేస్తున్నారు. అయితే, ఇప్పటికి కూడా గొటబాయ తన అమెరికా పౌరసత్వాన్ని కొనసాగిస్తున్నారని, దీని దృష్ట్యా శ్రీలంక కార్యనిర్వాహక అధ్యక్ష పదవిలో కొనసాగే నైతిక హక్కు ఆయనకు ఎంతమాత్రం లేదన్న విమర్శలు తలెత్తుతున్నాయి. ఇక చైనా విషయానికొస్తే లంకకు కొత్త ప్రభుత్వం గతంలో మాదిరిగా కాకుండా కొంత జాగ్రత్తగానే వ్యాపార, వాణిజ్య లావాదేవీలను కమ్యూనిస్టు ప్రభుత్వం కొనసాగించవచ్చునని పెరీరా తెలిపారు. గతంలో మహింద రాజపక్షే హయాంలో చైనాతో అత్యంత సన్నిహితంగా శ్రీలంక కొనసాగిన అంశాన్ని, దానివల్ల తమకు కలిగిన చెడు ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కమ్యూనిస్టు ప్రభుత్వం తదుపరి అడుగులు వేయవచ్చునని చెబుతున్నారు. మహింద రాజపక్షే హయాంలోనే చైనా రుణ కూపంలోకి శ్రీలంక చిక్కుకుందన్న విషయాన్ని నిపుణులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. లంకలోని అనేక ప్రాజెక్టులను అప్పట్లోనే చైనాకు కట్టబెట్టారని, ముఖ్యంగా రుణ విమోచనలో భాగంగా లంకలోని హంబన్ టోటా రేవును 99 సంవత్సరాలపాటు బీజింగ్‌కు లీజుకు ఇచ్చారని కూడా నిపుణులు చెబుతున్నారు.
మధ్యంతర ఎన్నికలు అనివార్యం?
శ్రీలంక అధికార యునైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్‌పీ) అభ్యర్థి సజిత్ ప్రేమదాస ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఎస్‌ఎల్‌పీటీకి చెందిన గొటబాయ రాజపక్ష చేతిలో పరాజయాన్ని చవిచూసిన నేపథ్యంలో పార్లమెంటుకు మధ్యంతర ఎన్నికలు తప్పవన్న అభిప్రాయాన్ని స్పీకర్ కారు జయసూర్య వ్యక్తం చేశారు. 2020 ఆగస్టు తర్వాత గానీ లంక పార్లమెంటు ఎన్నికలు జరిగే అవకాశం లేదని, అలాగే రాజ్యాంగం ప్రకారం ప్రస్తుత ప్రధానమంత్రిని తొలగించేందుకు ఆస్కారం లేదని ఆయన వెల్లడించారు. అయితే, కొత్త అధ్యక్షుడు తన సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా పార్లమెంటుకు మధ్యంతర ఎన్నికలు బలంగా కనపడుతున్నాయని ఆయన తెలిపారు.