అంతర్జాతీయం

ముషారఫ్‌కు మరణశిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, డిసెంబర్ 17: రాజ్యాంగాన్ని వక్రీకరించి తీవ్ర స్థాయి దేశ ద్రోహానికి పాల్పడిన నేరానికిగాను పాకిస్తాన్ మాజీ నియంత పర్వేజ్ ముషారఫ్‌కు ప్రత్యేక కోర్టు మంగళవారం మరణశిక్ష విధించింది. పాకిస్తాన్ చరిత్రలో ఒక సైనిక పాలకుడికి మరణశిక్ష వేయడం ఇదే మొదటిసారి. పెషావర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వాకర్ అహమ్మద్ షేఠ్ సారథ్యంలోని ఈ ప్రత్యేక న్యాయస్థానం దేశద్రోహ నేరాలపై 76 ఏళ్ల ముషారఫ్‌ను దోషిగా తేల్చింది. అనారోగ్య కారణంగా ముషారఫ్ ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటు న్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ చరిత్ర లో అత్యంత శక్తివంతమైన వ్యవస్థగా సుదీర్ఘకాలం సైన్యమే కొనసాగిన నేపథ్యంలో ఓ మాజీ సైనికాధినేత, నియంతకు ఉరిశిక్ష పడడం అన్నది అత్యంత కీలక పరిణామంగా చెబుతున్నారు. 1999లో అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చి సైనికాధినేతగా ఉన్న ముషారఫ్ అధికారాన్ని
హస్తగతం చేసుకున్నారు. 2001 నుంచి 2008 వరకు దేశాధ్యక్షుడిగా కూడా కొనసాగారు. 2007లో రాజ్యాంగాన్ని నిలిపివేసి, రాజ్యాంగ విరుద్ధంగా ఎమర్జన్సీని విధించినందుకు ఈ ప్రత్యేక న్యాయస్థానం ఆయనను దోషిగా నిర్ధారించింది. 2014లోనే ఈ నేరానికిగాను ముషారఫ్‌ను దోషిగా తేల్చిన కోర్టు తాజాగా మరణశిక్షను విధిస్తున్నట్టు ప్రకటించింది. సుప్రీం కోర్టు ఆదేశానుసారం ఏర్పాటైన ఈ త్రిసభ్య ప్రత్యేక కోర్టులో ఇద్దరు న్యాయమూర్తులు ముషారఫ్‌కు మరణశిక్ష విధిస్తూ తీర్పునిస్తే మరో న్యాయమూర్తి వ్యతిరేకించారు. ఇందుకు సంబంధించిన వివరాలు 48 గంటల్లో వెలుగులోకి వస్తాయని అధికార వర్గాలు తెలిపాయి. ఈ తీర్పును వాయిదా వేయాలంటూ ప్రాసిక్యూటర్లు చేసిన అప్పీళ్లను కోర్టు తిరస్కరించింది. తనకు ఆరోగ్యం బాగాలేదన్న సాకుతో 2016లో ముషారఫ్ దుబాయ్ వెళ్లిపోయారు. అప్పటినుంచి ఇంతవరకూ స్వదేశానికి తిరిగి రాలేదు. ఇందుకు భద్రత, ఆరోగ్య అంశాలను ఆయన ఎప్పటికప్పుడు కారణాలుగా చెబుతూ వచ్చారు. గత ఏడాది 19నే ఈ దేశద్రోహ ఆరోపణల విచారణను పూర్తి చేసిన ప్రత్యేక కోర్టు తీర్పును వాయిదా వేసింది. పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం ఎవరు రాజ్యాంగాన్ని వక్రీకరించినా, రద్దు చేసినా, నిలిపివేసినా, అందుకు కుట్ర పన్నినా అధికారంతో అణచివేసేందుకు ప్రయత్నించినా, ఇందు కోసం రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించినా అది అత్యంత తీవ్రమైన దేశద్రోహ నేరం అవుతుంది. ఇలాంటి నేరాలకు పాల్పడ్డ వ్యక్తులకు మరణశిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్షను విధించాలని 1973నాటి తీవ్ర దేశద్రోహ (శిక్ష) చట్టం నిర్ధేశిస్తోంది. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈనెల మొదట్లో దుబాయ్‌లోని ఓ ఆసుపత్రిలో ముషారఫ్ చేరారు. ఆసుపత్రి నుంచి వీడియోలో మాట్లాడిన ఆయన ఈ దేశద్రోహ కేసు పూర్తిగా నిరాధారమని పేర్కొన్నారు. ‘దేశానికి పదేళ్లు అధ్యక్షుడిగా పనిచేశాను. దేశం కోసం పోరాడాను. నా వాదన వినకుండా, నా తప్పేమిటో లేకుండా జరుగుతున్న కేసు విచారణ ఇది’ అని పేర్కొన్నారు. ఇందులో తనను పూర్తిగా బలిపశువును చేశారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. కాగా, ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంలో సవాల్ చేసేందుకు ముషారఫ్ న్యాయవాదుల బృందం సిద్ధమవుతోంది. అయితే, ఈ తీర్పును సుప్రీం కోర్టు ధృవీకరించే పక్షంలో రాజ్యాంగంలోని 45వ అధికరణ ప్రకారం క్షమాభిక్ష పెట్టే అధికారం దేశాధ్యక్షుడికి ఉంటుంది.
*చిత్రం... పాకిస్తాన్ మాజీ నియంత పర్వేజ్ ముషారఫ్‌