అంతర్జాతీయం

కాలంతో శాస్తవ్రేత్తల పరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్, ఫిబ్రవరి 9: చైనాతోపాటు దాదాపు పాతిక దేశాలను కరోనా వైరస్ భయాందోళనలకు గురిచేస్తున్న నేపథ్యంలో ఈ ప్రాణాంతక మహమ్మారిని ఏవిధంగా కట్టడి చేయాలన్న దానిపై అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు శాస్త్ర ప్రపంచం తలమునకలైంది. ఇప్పటికే అనేక దేశాల్లో ఈ వైరస్ పరిస్థితి ఆందోళనకరంగా మారి, వందలాదిగా ప్రజలు మరణిస్తుండడంతో అతి తక్కువ వ్యవధిలోనే ఫలవంతమైన ఓ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తేవడంపై శాస్తవ్రేత్తలు దృష్టి పెట్టారు. కొత్త టెక్నాలజీని వినియోగించుకుని ఈ దిశగా సమీప భవిష్యత్తులోనే మంచి ఫలితాన్ని సాధించేందుకు పట్టుదలతో పనిచేస్తున్నారు. ఏ వ్యాధిని అరికట్టడానికైనా ఓ వ్యాక్సిన్ రూపొందించాలంటే ఏళ్లకు ఏళ్లే పడుతుంది. అనేక పరీక్షలు జరిపి, దానివల్ల ఇతరత్రా ఎలాంటి హామీ ఉండదని నిర్ధారించిన తర్వాతే ఈ వ్యాధి నిరోధక వ్యాక్సిన్లు జనబాహుళ్యంలోకి వస్తాయి. ముందుగా జంతువులపై పరీక్షించడం, అనంతరం మనుషులపై అవి ఏరకమైన ప్రభావాన్ని కనబరుస్తాయని నిర్ధారించుకోవడం, ప్రతి కొత్త వ్యాక్సిన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయడానికి ముందు ప్రక్రియ. అయితే కరోనా వైరస్ తీవ్రత అతి తక్కువ వ్యవధిలోనే ఆందోళనకరంగా మారడం, దాదాపు పాతిక దేశాలకు పైగా ఇది వ్యాపించిన నేపథ్యంలో కొత్త వ్యాక్సిన్ దిశగా శాస్తవ్రేత్తలు కాలంతో పరుగులు పెడుతున్నారు. అంతర్జాతీయంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఉమ్మడి ప్రయత్నంగా ఈ వైరస్ నిరోధక వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. అనుకున్నట్టుగా ఈ ప్రయత్నం సఫలమైతే ఆరు నెలల వ్యవధిలోనే కరోనా వైరస్‌కు పటిష్టమైన మందుతో చెక్ పెట్టవచ్చన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ విషయంలో శాస్తవ్రేత్తలపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోందని, అదుపు తప్పుతున్న పరిస్థితులు కూడా కొత్త మందు దిశగా తమను కార్యోన్ముఖం చేస్తున్నాయని ఆస్ట్రేలియాకు చెందిన ఓ సీనియర్ శాస్తవ్రేత్త తెలిపారు. ఇప్పటికే అనేక దేశాల్లో శాస్తవ్రేత్తల బృందాలు ఇదే పనిమీద ఉన్నట్టుగా సంకేతాలు అందుతున్నాయి. ఈ ఉమ్మడి ప్రయత్నం విఫలమయ్యే అవకాశం లేదని, ఆరు నెలల్లోనే కరోనా వైరస్‌ను అడ్డుకునే దివ్యౌషధం అందుబాటులోకి రావచ్చునని చెబుతున్నారు. ముఖ్యంగా 2017లో ఏర్పడిన అంటువ్యాధుల సన్నాహక పరిశోధక బృందం (సీఈపీఐ) ఈ దిశగా కృషి చేస్తోంది. ఇందుకోసం అత్యంత వ్యయభరితమైనా కూడా బయోటెక్నాలజీ పరిశోధనలకు సమాయత్తమవుతోంది. గతంలో పశ్చిమాఫ్రికాలో దాదాపు 11 వేల మందిని బలిగొన్న ‘ఎబోలా’ వ్యాప్తి నిరోధన విషయంలోనూ ఈ కూటమి పరిశోధనలు ఎంతగానో దోహదం చేశాయి. తాజాగా కరోనా వైరస్‌ను అరికట్టే పరిశోధనలకు మొత్తం నాలుగు ప్రాజెక్టులను ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ చేపట్టింది. ఇందుకోసం మిలియన్లకొద్దీ డాలర్లను కుమ్మరిస్తోంది. కొత్త టెక్నాలజీని వినియోగించుకోవడం ద్వారా సమీప భవిష్యత్తులోనే వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తేవాలన్నది దీని లక్ష్యం. కేవలం 16 వారాల్లోనే అన్ని రకాల పరీక్షలను నిర్వహించే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఈ సంస్థ సీఈఓ రిచర్డ్ హెచెర్ట్ తెలిపారు. జర్మనీకి చెందిన బయోఫార్మాస్యూటికల్ కంపెనీ ప్యూర్ వ్యాక్ అలాగే అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న మోడర్నా తెరాప్యూటిక్స్ సంస్థలు ‘మెసెంజర్ ఆర్‌ఎన్‌ఏ’ ప్రాతిపదికగా కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించే వ్యాక్సిన్‌ను రూపొందిస్తున్నాయి. దీనివల్ల శరీరంలో ప్రొటీన్ల తయారీకి సంకేతాలు వెళ్తాయని చెబుతున్నారు. అమెరికాకు చెందిన మరో సంస్థ ఇనోవియో కూడా డీఎన్‌ఏ ఆధారిత టెక్నాలజీతో వ్యాక్సిన్‌ను రూపొందించే పనిలో పడింది. డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ ఆధారిత వ్యాక్సిన్లను వైరస్ జన్యుపరమైన కోడింగ్ ఆధారంగా రూపొందిస్తారు. ప్రస్తుతం ఈ వైరస్‌ను అరికట్టేందుకు ఎవరి స్థాయిలో వారు మందులను సూచిస్తున్నా అవి ఎంతవరకు పనిచేస్తాయన్న దానిపై ఎలాంటి హామీ లేదని చెబుతున్నారు. దీని దృష్ట్యానే పటిష్టమైన కొత్త వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తేవడం, ఇప్పటికిప్పుడే కాకపోయినా సమీప భవిష్యత్తులో తలెత్తే ఈ తరహా వైరస్ నిరోధానికి అవసరమన్నది శాస్తవ్రేత్తల ఆలోచన.