అంతర్జాతీయం

అడుగేస్తే.. వివాదం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 20: డొనాల్డ్ ట్రంప్.. నిన్నటిదాకా ఓ రియల్ ఎస్టేట్ బిలియనీర్‌గా అందరికీ ప్రపంచానికి పరిచయం! ఇప్పుడు ప్రపంచానే్న శాసించే అమెరికా అధ్యక్షుడు. అమెరికా చరిత్రలోనే అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించడం ఆ దేశ ప్రజలనే కాదు, మొత్తం ప్రపంచానే్న విస్మయానికి గురి చేసింది. దానికి కారణం లేకపోలేదు. అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు రిపబ్లికన్ పార్టీ టికెట్ కోసం పోటీ పడ్డం దగ్గరినుంచి అధ్యక్షుడిగా ఎన్నికయ్యేంత వరకు ఆయన ప్రతి మాటా, ప్రతి చర్యా ఓ వివాదంగా మారడమే దీనికి కారణం. న్యూయార్క్ నగరంలో కోట్లాది డాలర్ల రియల్ ఎస్టేట్ సామ్రాజ్యానికి అధిపతి, రియాల్టీ టెలివిజన్ పర్సనాలిటీగానే అందరికీ తెలిసిన ట్రంప్ 2015లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా అధ్యక్ష పదవికోసం బరిలోకి దిగనున్నట్లు చేసిన ప్రకటనే ఓ సంచలనం అయింది. ఎందుకంటే ఆ పార్టీ అభ్యర్థిత్వం కోసం అప్పటికే డజనుకు పైగా ప్రముఖులు బరిలో ఉన్నారు. వీరందరినీ ఎదుర్కొని చివరిదాకా కొనసాగడం కూడా కష్టమని భావించిన 70 ఏళ్ల ట్రంప్ అనూహ్యంగా మెజారిటీ ప్రైమరీల్లో విజయం సాధించడమే కాక ప్రతినిధుల మద్దతును సైతం సంపాదించి 2016 జూలై 19న రిపబ్లికన్ పార్టీ అధికారిక అభ్యర్థిగా నిలిచారు. ఇదంతా ఒక ఎత్తయితే రాజకీయాల్లో తల పండిన డెమోక్రటిక్ పార్టీ ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌పై విజయం సాధించడం మరో ఎత్తు. అధ్యక్ష ఎన్నికల ప్రచారం సమయంలో ట్రంప్‌పై వచ్చిన వివాదాలు అన్నీ ఇన్నీ కాదు.. మహిళలను కించపరిచే విధంగా గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు మొదలుకొని ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్, అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యక్తిగత జీవితాలపైనా చేసిన వ్యాఖ్యలు ఆయనను ఊపిరాడకుండా చేశాయి. మరొకరైతే ఎప్పుడో పోటీనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించేసి ఉండే వారు. అయితే పట్టిన పట్టు వదిలే మనస్తత్వం లేని ట్రంప్ అలా చేయలేదు సరికదా.. తనదైన బాణీలో ఎదురుదాడి చేశారు. అందుకు ఆయన ఎంచుకున్న మార్గం ప్రభుత్వ తీరు పట్ల విసిగిపోయి ఉన్న కార్మికులు, మధ్య తరగతి వర్గం మనోభావాలను రెచ్చగొట్టడం. వలసలకు, ముస్లింలకు వ్యతిరేకంగా ఆయన చేసిన ప్రసంగాలు, ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ అంటూ ఆయన ఇచ్చిన పిలుపు తమ ఉద్యోగాలను విదేశాలనుంచి వచ్చిన వారు ఎగరేసుకు పోతున్నారన్న ఆసంతృప్తితో ఉన్న అమెరికా యువతను, కార్మిక వర్గాన్ని, ఉగ్రవాద భయంతో అభద్రతా భావానికి లోనయి ఉన్న మధ్య తరగతి వారిని ఆయన వైపు మొగ్గేలా చేసింది. తాను అధికారంలోకి వచ్చిన తొలి రోజునే బరాక్ ఒబామా ప్రభుత్వం చేసిన వివాదాస్పద నిర్ణయాలన్నిటినీ తిరగదోడుతానని ట్రంప్ చేసిన ప్రకటనలు సైతం అప్పటివరకు తటస్థంగా ఉండిన అమెరికా ఓటర్లు ఆయన వైపు మొగ్గేలా చేసిందని చెప్పవచ్చు.
అయితే ఇప్పటికి కూడా ట్రంప్ దేశాధ్యక్షుడుగా ఎన్నిక కావడాన్ని అమెరికా ప్రజల్లో చాలామంది జీర్ణించుకోలేక పోతున్నారన్న మాట వాస్తవం. తాజాగా జరిపిన సర్వేల్లో సైతం కేవలం 40 శాతం మందే ట్రంప్‌కు మద్దతు ప్రకటించడాన్ని బట్టి చూస్తే అధ్యక్షుడిగా ఆయనది పూలబాట కాదని ముళ్ల దారేననిపిస్తుంది. ఎవరు ఏమన్నా రాబోయే నాలుగేళ్లు ఆయన అమెరికా అధ్యక్షుడే. అంతేకాదు, అమెరికా రాజకీయాలు ఆయన హయాంలో సరికొత్త మలుపు తిరుగుతాయని పరిశీలకులు సైతం భావిస్తున్నారు.

చిత్రాలు..ప్రజలకు అభివాదం చేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్
*ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ప్రజలు