అంతర్జాతీయం

అమెరికాలోకి ముస్లింలను రానివ్వొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మే 5: రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం ఖరారు అయినట్లుగా భావిస్తున్న డొనాల్డ్ ట్రంప్ తన ముస్లిం వ్యతిరేక వైఖరిని మరోసారి ప్రకటించారు. ముస్లింలు అమెరికాలోకి ప్రవేశించకుండా నిషేధం విధించాలని, అమెరికాలోకి అక్రమంగా వలస వచ్చిన వారందరినీ తిప్పి పంపాలని ఆయన పునరుద్ఘాటించారు. ట్రంప్ తన ఈ వైఖరిని పునరుద్ఘాటించిన వెంటనే ఆయన ప్రత్యర్థి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం రేసులో ముందున్న హిల్లరీ క్లింటన్ తరపు ప్రచారకులు ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమెరికా మాజీ విదేశాంగ మంత్రి అయిన హిల్లరీ క్లింటన్ అమెరికా అధ్యక్షురాలిగా ఇలాంటి విచ్ఛిన్నకర, ప్రమాదకర ధోరణులను ఏమాత్రం సహించబోరని వారు గట్టిగా హెచ్చరించారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం దాదాపు ఖాయమైన మరుసటి రోజే డొనాల్డ్ ట్రంప్ ప్రాథమిక ఎన్నికల సందర్భంగా తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలనుంచి వెనక్కి తగ్గడానికి నిరాకరించారు. సిఎన్‌ఎన్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ట్రంప్.. విదేశీ ముస్లింలు అమెరికాలోకి ప్రవేశించకుండా తాత్కాలికంగా నిషేధం విధించాలన్న తన ప్రతిపాదనను వెనక్కి తీసుకోవడానికి నిరాకరించారు. అదే సమయంలో తాను ముస్లిం దేశాలతో కలిసి ఉగ్రవాదంపై పోరాటం చేస్తానని ఆయన అన్నారు. అయితే ఈ బాధ్యత ముస్లిం దేశాలపైనే ఉందని ఆయన వాదించారు. ఈ విషయంలో తనకు హాని కలిగినా తాను లెక్క చేయబోనని ఆయన ఎంఎస్‌ఎన్‌బిసికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కరాఖండిగా చెప్పారు. ‘మనం వేలాది మందిని మన దేశంలోకి రావడానికి అనుమతిస్తున్నాం. ఇలా వచ్చిన వేలాది మంది ప్రజలు దేశవ్యాప్తంగా ఉన్నారు. వాస్తవానికి వారంతా ఎవరో ఎవరికీ తెలియదు. వీరిలో చాలామంది వద్ద తగిన పత్రాలు లేవు. మనం ఏం చేస్తున్నామో మనకే తెలియదు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
అయితే ట్రంప్ తన వైఖరిని పునరుద్ఘాటించగానే హిల్లరీ క్లింటన్ తరపు ప్రచారకులు ఆయనపై తీవ్ర స్థాయిలో దాడికి దిగారు. ‘రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వాన్ని దక్కించుకున్న 24 గంటలలోనే డొనాల్డ్ ట్రంప్.. తన నేతృత్వంలో అమెరికా ఎలా ఉండబోతోందో చాలా బాగా చెప్పారు. అమెరికాలోని లాటిన్ అమెరికా సంతతికి చెందిన ప్రజలు, ముస్లింలు, ఇతర మతాల వారు స్వదేశంలో ఉన్నట్లు భావించుకోరు’ అని లాటినో ఔట్‌రీచ్ నేషనల్ డైరెక్టర్ లోరెల్లా ప్రయేలి అన్నారు. ట్రంప్ కేవలం అధ్యక్ష పదవిని కైవసం చేసుకోవాలనే యావతో అమెరికా సమాజంలో, ఆర్థిక వృద్ధిలో భాగమైన మిలియన్ల కొద్ది కుటుంబాలను తిప్పి పంపాలని, ముస్లింలను అమెరికాలోకి ప్రవేశించకుండా నిషేధం విధించాలని ప్రతిపాదించారని ప్రయేలి విరుచుకుపడ్డారు.
అయితే మరింత పారదర్శకమైన, స్వేచ్ఛగల దేశంగా అమెరికాను తీర్చిదిద్దుకునేందుకు మనం సాగిస్తున్న ప్రయాణానికి ట్రంప్ విద్వేష ప్రసంగాలు, ప్రతిపాదనలు పెద్ద ఆటంకంగా, ముప్పుగా పరిణమిస్తాయని తాము మరోసారి గుర్తు చేస్తున్నామని ప్రయేలి అమెరికా ప్రజలను ఉద్దేశించి అన్నారు.