అంతర్జాతీయం

మా వైఖరిలో మార్పు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, జూన్ 23: అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పిటి)పై సంతకం చేయని దేశాలను అణు సరఫరా దేశాల గ్రూపు(ఎన్‌ఎస్‌జి)లోకి చేర్చుకోవడంలో తన వైఖరిలో ఎలాంటి మార్పూ లేదని చైనా మరోసారి స్పష్టం చేసింది. దీంతో ప్రస్తుతం స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్‌లో జరుగుతున్న ఎన్‌ఎస్‌జి ప్లీనరీ సమావేశంలో భారత్ ఈ కూటమిలోకి ప్రవేశించే అవకాశాలు దాదాపుగా సన్నగిల్లిపోయాయి. ‘ఎన్‌ఎస్‌జిలోకి ఎన్‌పిటిపై సంతకం చేయని దేశాలను చేర్చుకునే విషయంలో చైనా వైఖరిలో ఎలాంటి మార్పు లేదు’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గెంగ్ షువాంగ్ శుక్రవారం ఇక్కడ మీడియా సమావేశంలో అన్నారు. స్విస్ రాజధాని బెర్న్‌లో జరుగుతున్న ఎన్‌ఎస్‌జి ప్లీనరీ సమావేశంలో చైనా వైఖరిలో ఏదయినా మార్పు ఉంటుందా అని విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయం చెప్పారు. అంతేకాదు, కొత్త సభ్యులను చేర్చుకునే విషయంలో ఎన్‌ఎస్‌జికి స్పష్టమైన రూల్స్ ఉన్నాయని, అంతేకాకుండా సియోల్‌లో జరిగిన ప్లీనరీ సమావేశంలో కొత్త సభ్యులను చేర్చుకోవడానికి సంబంధించి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని ఆయన అంటూ, వీటి ప్రకారమే మేము వ్యవహరించాల్సి ఉంటుందని తాను అనుకుంటున్నానని చెప్పారు. కొత్త సభ్యులను చేర్చుకోవడానికి సంబంధించిన కొలమానం విషయంలో సియోల్ ప్లీనరీ ఆదేశాల ప్రకారమే బెర్న్ ప్లీనరీ నడుచుకుంటుందని, ఏకాభిప్రాయం ఆధారంగానే నిర్ణయం తీసుకోవాలన్న సంప్రదాయాన్ని కాపాడుతుందని, ఎన్‌పిటిపై సంతకం చేయని దేశాలను చేర్చుకోవడానికి సంబంధించిన వివిధ అంశాలను చర్చిస్తుందని తాను భావిస్తున్నట్లు గెంగ్ చెప్పారు. కొత్తగా సభ్యులుగా చేరే దేశాలు అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేసి తీరాలని చైనా పట్టుబడుతూ ఉండడం ఎన్‌ఎస్‌జిలో భారత్ చేరికకు పెద్ద అడ్డంకిగా మారుతోంది. ఎందుకంటే మన దేశం ఎన్‌పిటిపై సంతకం చేయలేదు. అంతేకాకుండా భారత్‌లాగానే పాకిస్తాన్‌ను కూడా ఈ గ్రూపులో చేర్చుకోవాలని చైనా కోరుతోంది. ఇటీవల జరిగిన షాంఘై సహకార కూటమి శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఆస్తానాలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో సమావేశమైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎన్‌ఎస్‌జిలోకి భారత్‌ను చేర్చుకునే అంశాన్ని ప్రస్తావించినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో బెర్న్ ప్లీనరీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదిలా ఉండగా ప్రదాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా వివాదాస్పద దక్షిణ చైనా సముద్ర ప్రాంతంతో సహా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్, అమెరికాల మధ్య సహకారం అంశం చర్చకు రావచ్చని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం గురించి అడగ్గా, చైనా, ఏసియాన్ దేశాల కృషి ఫలితంగా దక్షిణ చైనా ప్రాంతంలో పరిస్థితి చల్లబడుతోందని గెంగ్ చెప్పారు.