అంతర్జాతీయం

కూలిన ఈజిప్టు విమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కైరో, మే 19: పారిస్ నుంచి కైరో వెళుతున్న ఈజిప్ట్ ఎయిర్ విమానం మధ్యధరా సముద్ర ప్రాంతంలో కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో 26మంది విదేశీయులు సహా 66మంది ప్రయాణికులు మరణించారు. ఈజిప్టు ఎయిర్‌స్పేస్‌లోని రాడార్ స్క్రీన్లనుంచి బయలుదేరిన కొద్ది నిమిషాలకే ఈ విమానం కనిపించకుండా పోయిందని విమానయాన అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి ఉగ్రవాద దాడి కారణమా లేక సాంకేతిక లోపమా అనే విషయంపై ఇప్పుడే చెప్పలేమని ఈజిప్టు ప్రధాని షరీఫ్ ఇస్మాయిల్ పేర్కొన్నారు. అయితే రెండింటినీ తాము కాదనడం లేదని, ఉన్నపళంగా విమానం కుప్పకూలిపోవడానికి ఏదో ఒక బలమైన కారణమే ఉంటుందని అన్నారు. ఎయిర్‌బస్ ఎ-320 అనే ఈ విమానం 37వేల అడుగుల ఎత్తులో ఉండగా స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2.45 నిమిషాలకు గల్లంతైంది. ఈజిప్టు ఎయిర్‌స్పేస్‌లోకి ప్రవేశించిన వెంటనే దీనికి రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. దాంతో మధ్యధరా సముద్ర ప్రాంతంలోని రేవు పట్టణమైన అలెగ్జాండ్రియా సమీపంలో ఈ విమానం కూలిపోయి వుండవచ్చునని అధికార వర్గాలు తెలుపుతున్నాయి. అనంతరం విమానం కుప్పకూలిన విషయాన్ని కూడా అధికారులు ధ్రువీకరించారు. రాడార్‌నుంచి వైదొలగిన రెండు గంటల తర్వాత విమానం నుంచి తమకు ప్రమాద సంకేతాలు అందాయని ఈజిప్టు ఎయిర్ తెలిపింది. అయితే తమకు ఎలాంటి సమాచారం అందలేదని ఆ దేశ సైనిక దళాలు వెల్లడించాయి. కాగా, విమానం ఎక్కడ కూలిపోయిందో స్పష్టంగా తెలిసినందున మృతదేహాలు, శకలాల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. మృతుల్లో పదిమంది సిబ్బంది కూడా ఉన్నారు. 30మంది ఈజిప్టు పౌరులతో పాటు మరో పదిహేనుమంది ఫ్రెంచ్ పౌరులు, ఇద్దరు ఇరాకీలు, బ్రిటన్, బెల్జియం, కువైట్, కెనడాకు చెందిన పౌరులు కూడా మృతుల్లో ఉన్నారు. కాగా, గ్రీస్ సహకారంతో ఈజిప్టు సైనిక దళాలు విమానాలు, నౌకల ద్వారా గాలింపు చర్యలను చేపట్టాయి. తాము కూడా ఇందుకు సహకరిస్తామని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ మార్క్ ఆయురాల్ట్ వెల్లడించారు. ఈ సంఘటన జరిగిన వెంటనే అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హొలాండే, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్ శిశితో మాట్లాడారు. ప్రమాద కారణాలను తెలుసుకునేందుకు మృతదేహాలు, శకలాలను అనే్వషించేందుకు తోడ్పడతామన్నారు.